71 డిమాండ్లతో ఉద్యోగుల ఉద్యమం

ABN , First Publish Date - 2021-12-08T04:04:46+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో ఉద్యమానికి సిద్ధమ య్యారు.

71 డిమాండ్లతో ఉద్యోగుల ఉద్యమం
నెల్లూరు : ట్రెజరీ వద్ద నినాదాలు ఇస్తున్న జేఏసీ నాయకులు

నల్లబ్యాడ్జీలతో నిరసన

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆందోళనలు

ఉపాధ్యాయులు సైతం ఉద్యమబాట


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 7 : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో ఉద్యమానికి సిద్ధమ య్యారు. తాము ప్రతిపాదించిన 71 డిమాండ్లను నెరవేర్చాలంటూ జేఏసీలుగా ఏర్పడి ప్రభుత్వానికి గడువిచ్చారు. ఆ గడువు సోమవారంతో ముగియడంతో మంగళవారం నుంచి దశల వారీ ఆందోళనకు దిగారు. తొలిరోజు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. పీఆర్సీ ప్రకటనలో తీవ్ర జాప్యం, సకాలంలో డీఏలు చెల్లించకపోవడం, ఉద్యోగుల హక్కులు అమలు చేయకుండా ఇబ్బంది పెడుతుండటంపై నిరసన గళం విప్పారు. 11వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, పీఆర్సీ సిపార్సులను యూనివర్సిటీ లు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యా య, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఏడు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో లోపాలను సరిచేసి సక్రమంగా అమలు చేయాలన్నా రు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని. ఇకపై చేపట్టే నియామకాలకు  కాంట్రాక్టు పద్దతిని రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయులందరికీ కామన సర్వీస్‌ రూ ల్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 


కలెక్టరేట్‌, ట్రెజరీ వద్ద జేఏసీ నాయకుల నిరసన


కలెక్టరేట్‌,  ట్రెజరీ కార్యాలయం వద్ద ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నాయకులు నిరసన తెలిపారు. ప్రతి కార్యాలయానికి వెళ్లి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన తీరును పరిశీలించి, నిరసన తెలుపుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఏపీజేఏసీ-అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి, ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు, ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన రాష్ట్రప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఇరిగేషన, ఆర్‌అండ్‌బీ సర్కిల్‌, పంచాయతీరాజ్‌ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన పోరాట ఐక్యతను చాటారు. కాగా, కొంతమంది స్వార్ధపరులైన మాజీ నాయకులు వారి సొంత ప్రయోజ నాలే లక్ష్యంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చారని, అలాంటివి నమ్మవద్దని, ఉద్యోగులందరూ ఉద్యమంలో పాల్గొనాలని ఏపీ ట్రెజరీ సర్వీ సెస్‌ అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ కిరణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో కోరారు.


డీఎంహెచవో కార్యాలయంలో..


నెల్లూరు(వైద్యం) : ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. 


సంక్షేమ శాఖల్లో... 


నెల్లూరు (వీఆర్సీ) : సాంఘిక, వెనుకబడిన, గిరిజన, ఐటీడీఏ, మహిళ, శిశు సంక్షేమ శాఖల ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో వారంతా కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు ఈదూరు విజయకుమార్‌ మాట్లాడుతూ జేఏసీ పిలుపు మేరకు నాలుగు రోజులపాటు ఇదేవిధంగా నిరసనను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మార్కేండేయులు, రమేష్‌, కేశవులు, కేవీ రమణ, రమణారెడ్డి, గిరిధర్‌, విక్రమ్‌, షర్మిష్టా తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-08T04:04:46+05:30 IST