ఉపాధి బడ్జెట్‌ ఖరారు

ABN , First Publish Date - 2022-03-02T05:16:35+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసల నివారణకు ఊతమిచ్చిన ఉపాధిహామీ పథకంలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశారు.

ఉపాధి బడ్జెట్‌ ఖరారు

- ఈ ఆర్థిక సంవత్సరానికి 1.19 కోట్ల పని దినాలు

- జిల్లాలో 2.84 లక్షల మంది కూలీలు

- గత ఏడాది ఉపాధిహామీలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

- కరోనా కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధినిచ్చిన ఉపాధిహామీ


కామారెడ్డి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసల నివారణకు ఊతమిచ్చిన ఉపాధిహామీ పథకంలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశారు. మహత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టాల్సిన పనులు కావాల్సిన వ్యయంపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రణాళికను రూపొందించారు. గత రెండు సంవత్సరాలలో కరోనా కాలంలో గ్రామీణ ప్రాంతాల కూలీలకు ఉపాధి పనులు భరోసానిచ్చాయి. గ్రామాల్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ కొవిడ్‌ ఆపత్కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విజయవంతంగా ఉపాధిహామీ పనులు అందించి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉపాధిహామీ పథకంలో కొత్త మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పనులను పర్యవేక్షించనుంది. ఇందుకు అనుకూలంగా పనులు గుర్తించి ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

ఉపాధి లక్ష్యం 1.19 కోట్ల పని దినాలు

జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఉపాధిహామీ కూలీలకు 2022-23 సంవత్సరానికి 1.19 కోట్ల పని దినాలు కల్పించడానికి బడ్జెట్‌ను రూపొందించారు. పని దినానికి కావాల్సిన రూ.348లో రూ.245 కూలీ, రూ.98 మెటీరియల్‌ కోసం కేటాయిస్తూ బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. ఇప్పటికే గ్రామసభల ద్వారా పనుల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో 2.84 లక్షల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది.

గత ఏడాది రాష్ట్రంలోనే కామారెడ్డి మొదటి స్థానం

జిల్లాలో 2,64,479 ఉపాధిహామీ జాబ్‌ కార్డులున్నాయి. వీటి పరిధిలో 5,41,457 మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది 2,84,789 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో కూలీలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతీ ఏట జిల్లాలో ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా విజృంభించడం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణ ప్రాంత ప్రజలు కూడా గ్రామాలకు వెళ్లి ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. దీంతో అధిక పని దినాలు కల్పించిన జిల్లాగా కామారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా ఇప్పటి వరకు 91.76 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఎక్కువ మంది కూలీలు 100 రోజుల పని దినాలు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది 19,491 కుటుంబాలు 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకోవడం గమనార్హం.

Updated Date - 2022-03-02T05:16:35+05:30 IST