ఉపాధి కల్పనేనా?

ABN , First Publish Date - 2022-01-25T06:31:38+05:30 IST

ఉపాధి కల్పన కార్యాలయాలు కేవలం పేరు నమోదుకే పరిమితమవుతున్నాయి. గతంలో ఉపాధి కల్ప న కార్యాలయంలో పేరు, అర్హతలు నమోదు చేసుకుంటే ప్రభుత్వశాఖల్లో ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందనే భరోసా ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఉపాధి కల్పనేనా?

నమోదుకే పరిమితమవుతున్న కార్యాలయాలు 

ఉమ్మడి జిల్లాలో 38వేల మంది ఎదురుచూపు

2006 నుంచి 750 మందికే ఉద్యోగాలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఉపాధి కల్పన కార్యాలయాలు కేవలం పేరు  నమోదుకే పరిమితమవుతున్నాయి. గతంలో ఉపాధి కల్ప న కార్యాలయంలో పేరు, అర్హతలు నమోదు చేసుకుంటే ప్రభుత్వశాఖల్లో ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందనే భరోసా ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.ప్రభుత్వ ఉద్యోగం కాదుకదా, ప్రైవేటు ఉద్యోగం సైతం కల్పించలేని పరిస్థితుల్లో ఉపాధి కార్యాలయాలు ఉన్నాయి.


గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్‌, రి కార్డ్‌ అసిస్టెంట్‌,నాలుగో తరగతి పో స్టులు ఖాళీ కాగానే వాటిని భర్తీ చేసే బా ధ్యతను ప్రభుత్వాలు ఉపాధి కల్పన శాఖకు అప్పగించేవి. అయితే ఈ పోస్టుల భర్తీ లేకపోవడంతో అరకొరగా కొన్ని ప్రైవేటు కంపెనీలతో ఉద్యోగ మేళాలు నిర్వహించి కొందరికి ఉద్యోగాలు కల్పించి మమ అనిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 38,636 మంది నిరుద్యోగులు పేరు నమోదు చేసుకోగా, 2006 నుంచి ఇప్పటి వరకు కేవలం 750మందికి మాత్రమే అది కూడా ప్రైవేటు  రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. నల్లగొండ జిల్లాలో 23,770 మంది పేరు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 20 జాబ్‌ మేళాలు నిర్వహించి 405 మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారు. సూర్యాపేట జిల్లాలో 9,375మంది పేరు నమో దు చేసుకోగా,ఆరు జాబ్‌ మేళాలు నిర్వహించి 102 మందికి ఉద్యోగాలు కల్పించారు. యాదాద్రి జిల్లాలో  5491 మంది పేరునమోదు చేసుకోగా, 21 జాబ్‌ మేళాలు నిర్వహించి 243మందికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగఅవకాశం కల్పించారు. 


అంతా ఏజెన్సీలమయం

ఉమ్మడి జిల్లాలో రెండు మెడికల్‌ కళాశాలలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిమ్స్‌ ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశారు. సెక్యూరిటీ గార్డులు మొదలు నర్సింగ్‌ స్టాఫ్‌ వరకు నియమించారు. అదేవిధంగా మునిసిపాలిటీలు, విద్యాశాఖలో వేల సంఖ్యలో నాలుగో తరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని గతంలో ఏజెన్సీ ల ద్వారా భర్తీ చేయగా, ఆ సమాచారం నిరుద్యోగులకు ఎక్కడా లభించదు. నోటిఫికేషన్లు, పరీక్షలు, మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూలు అన్నీ కాగితాలపైనే ఉంటాయి. వారు అనుకు న్న వారే ఉద్యోగాల్లో చేరుతారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఏజెన్సీలు, ఉద్యోగాలు కావాల్సిన వారి నుంచి లక్ష ల్లో వసూళ్లు గుట్టుచప్పుడుకాకుండా సాగిపోతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ పొందిన అధికారులు, ప్రత్యేక కార్యాలయాలు, సిబ్బంది ఉన్నా ప్రేక్షకపాత్రే. ఇంటర్య్వూలు, నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు.


ప్రభుత్వానికి ఆదాయంపైనే ధ్యాస : పున్న కైలాస్‌, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత

ఖజానాను నింపే రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌శాఖ, తన ఎజెండాను అమలుపరిచేందుకు అవసరమైన పోలీసుశాఖలో మినహా మరే ఇతర శాఖలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు వెలువడలేదు. ప్రభుత్వ శాఖల్లో 2.50లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ కార్పొరేషన్లలో మరో 50వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి నింపరు. నింపితే నెలనెలా జీతాలు ఇవ్వాలి. దీంతో ఖజానా ఖాళీ అవుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఉన్న ఉద్యోగులతోనే కాలం గడిపే ప్రయత్నంలో భాగంగానే ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచారు.


కరోనా కారణంగా పోస్టుల భర్తీ మందగించింది : పద్మ, నల్లగొండ జిల్లా ఉపాధి కల్పనాధికారి

జాబ్‌ మేళాలు నిర్వహించి, అర్హత కలిగిన వారికి వివిధ కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 జాబ్‌ మేళాలు నిర్వహించాలి. కరోనా కారణంగా సాధారణ రోజుల్లో నిర్ణయించి నలక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. వచ్చే రోజుల్లో ఉపాధి కల్పనకు మెరుగైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదైన నిరుద్యోగుల వివరాలు ఇలా..

నల్లగొండ సూర్యాపేట యాదాద్రి 

పేరు నమోదు చేసుకున్న వారు 23,770 9,375 5,491

పురుషులు 15,347 6,208 4,148

స్త్రీలు 8,423 3167 1343

10వ తరగతి పూర్తిచేసిన వారు 4526 1368 922

ఇంటర్‌ పూర్తిచేసిన వారు 5588 2346 1100

డిగ్రీ పూర్తిచేసిన వారు 6181 3049 1920

ఇతర కోర్సులు చేసిన వారు 7475 2612 1549

నిర్వహించిన జాబ్‌ మేళాలు 20 06 21

కల్పించిన ఉద్యోగాల సంఖ్య 405 102 243

Updated Date - 2022-01-25T06:31:38+05:30 IST