లక్ష మందికి ‘ఉపాధి’

ABN , First Publish Date - 2021-01-21T05:57:15+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ లక్ష మంది కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. ఈ మేరకు డ్వామా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కరువు పరిస్థితులు, వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులకు ఉపాధి హామీ పథకమే ఆసరాగా నిలుస్తోంది.

లక్ష మందికి ‘ఉపాధి’
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

అడిగిన ప్రతి ఒక్కరికీ రోజూ పని

ప్రణాళిక సిద్ధం చేసిన డ్వామా

(కడప - ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా  రోజూ లక్ష మంది కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. ఈ మేరకు డ్వామా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కరువు పరిస్థితులు, వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులకు ఉపాధి హామీ పథకమే ఆసరాగా నిలుస్తోంది. ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని పొరుగు రాషా్ట్రలకు వెళ్లిన వారు గత ఏడాది కరోనా కారణంగా సొంతూళ్లకు వచ్చారు. వారికి చాలా మందికి ఉపాధి హామీ పనులే ఆసరాగా నిలిచాయి. వేసవిలో రోజూ లక్ష మందికి పైగా కూలీలకు ఉపాధి కల్పించేందుకు డ్వామా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే కూలీలకు పనుల కల్పనలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కోటి 33 లక్షలా 54 వేల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జనవరి 20 నాటికే కోటి 34 లక్షలా 66 వేల పనిదినాలు కల్పించారు. 101 శాతం లక్ష్యం పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.527 కోట్లు ఖర్చు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కూలీలకు వేతనాల రూపంలో 316.45 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికే రూ.315.22 కోట్లు ఖర్చు పెట్టారు. మెటీరియల్‌కు రూ.210.99 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.158.23 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు ఉండడంతో లక్ష్యం సునాయాసంగా అధిగమిస్తామని అధికారులు చెబుతున్నారు. కూలీకి సరాసరి రోజుకు రూ.235.57 కూలీ గిట్టుబాటు అవుతుంది. ఒక్కో కుటుంబానికి వంద రోజులు పని కల్పించాల్సి ఉండగా జిల్లాలో సరాసరిన ఇప్పటి వరకు 53.3 పనిదినాలు కల్పించారు. 


రోజూ లక్ష టార్గెట్‌

ఉపాధి ద్వారా ప్రధానంగా నీటి సంరక్షణ పనులు, పండ్ల తోటల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు. ఈనెల 19న 30 వేల మంది కూలీలు పనికి రాగా 20న 30,743 మంది హాజరయ్యారు. ఈనెల చివరి  నాటికి రోజూ 70 వేల కూలీలు హాజరయ్యేలా లక్ష్యం నిర్ణయించారు. గ్రామ పంచాయతీలు, మండలాల వారీగా కూలీల హాజరుపై టార్గెట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి రోజూ లక్ష మంది కూలీలు హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు.


- మొత్తం జాబ్‌కార్డులు  - 3,61,168

- శ్రమశక్తి సంఘాలు - 30,489

- వంద రోజులు పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలు - 30 వేలు

- 90 నుంచి 99 రోజులు పనిచేసిన కుటుంబాలు - 22 వేలు

- 70 నుంచి 90 రోజులు పూర్తి చేసిన కుటుంబాలు - 25 వేలు


ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం 

- డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి  

జాబ్‌కార్డు కలిగి పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం. కరోనా కారణంగా గత ఏడాది ఇతర ప్రాంతాల్లో ఉంటూ సొంతూర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాం. కలెక్టరు సూచన, సిబ్బంది సహకారంతో ఇప్పటికే లక్ష్యం పూర్తి చేశాం. గ్రామ పంచాయతీల వారీగా పనుల క ల్పనకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వారీగా లక్ష్యం విధించాం. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిచ్చాం. మార్చి నాటికి 1.50 లక్షల మంది పనికి హాజరయ్యేలా చూసేలా ప్రణాళిక రూపొందించాం.

Updated Date - 2021-01-21T05:57:15+05:30 IST