‘ఉపాధి’ అంతంతే!

ABN , First Publish Date - 2020-11-23T07:50:04+05:30 IST

ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ఒకప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు పూర్తిగా వెనుకబడింది.

‘ఉపాధి’ అంతంతే!

రూ.26 వేల కోట్ల పనులు మంజూరు..

16 నెలల్లో 1531 కోట్లు మాత్రమే వ్యయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ఒకప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు పూర్తిగా వెనుకబడింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాకఈ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదు. ఆలస్యంగా మొదలుపెట్టడం, సిబ్బంది కొత్తవారు కావడంతో రాష్ట్రంలో 26 వేల కోట్ల విలువైన పనులు మంజూరైనా.. వాటిలో ఎనిమిది శాతమే పురోగతి కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటికే  లేబర్‌ బడ్జెట్‌లో ఉన్న పనులన్నీ రద్దు చేసింది. గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి కొత్తవారిని నియమించింది. అనుభవం లేని కొత్త సిబ్బంది కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడ్డారు. రాష్ట్రంలో కూలీలతో చేపట్టిన పనులకు అనుగుణంగా సుమారు రూ.2700 కోట్లతో మెటీరియల్‌ పనులను మార్చి నాటికి చేపట్టే అవకాశం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పనులు చేపట్టలేదు. హడావుడిగా పనులు ప్రారంభించి రూ.2256 కోట్ల మేర పనులు చేపట్టారు. దీంతో సుమారు రూ.500 కోట్లు మెటీరియల్‌ నిధులు మురిగిపోయాయి. ప్రభుత్వ వైఖరితో ఈ ఏడాది కూడా శాశ్వత నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయే పరిస్థితులొచ్చాయంటున్నారు.


సాధారణంగా ఏ ప్రభుత్వమైనా గతంలో చేపట్టిన పనులు కొనసాగించి కొత్త పనులు ప్రారంభిస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినా... వాటిని ఇతర ప్రభుత్వ అవసరాలకు మళ్లించి పాత బకాయిలను నిలిపేసింది. పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఆదాయం వచ్చే ఇళ్ల స్థలాల చదును పనులు మాత్రం హడావుడిగా పూర్తి చేశారు. అయితే ఆదాయం అంతగా రాని సచివాలయ భవనాలు, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో వేల కోట్ల పనులు ముందుకు సాగడం లేదు. 


పురోగతి అంతంతమాత్రమేశ్రీ

కొత్త ప్రభుత్వం వచ్చాక పాత పనులన్నీ రద్దు చేసి.. కొత్తగా 10,973 సచివాలయ భవనాలు, 19,365 సీసీ డ్రైన్లు, 21,473 ఇంటి స్థలాల చదును పనులు, 13,919 పాఠశాలల ప్రహరీల నిర్మాణాలు, 10,265 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను చేపట్టింది. మొత్తం 75,995 పనులను రూ.15,980 కోట్ల మేర అంచనాలతో మంజూరు చేసింది. హడావుడిగా పనులు ప్రారంభించినా ఒక్క పని కూడా ముందుకు సాగడంలేదు. అధికారులు ఎన్ని సమీక్షలు చేసినా, క్షేత్రస్థాయిలో ఎంత మోటివేట్‌ చేసినా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కొత్తగా పనులు చేసేందుకు గ్రామాల్లోని చిన్న కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పెద్ద కాంట్రాక్టర్లు ఈ పనులకు దూరంగానే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో  కార్యకర్తలు ముందుకొచ్చి పనులు ప్రారంభించారు. అయినా ఈ 16 నెలల్లో కేవలం రూ.1300 కోట్ల మేర పనులే పురోగతిలో ఉన్నాయి. అయితే ఏ పనులూ పూర్తయిన దాఖలాల్లేవు. ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో ఎనిమిది శాతమే వ్యయం చేయగలిగారు. 

Updated Date - 2020-11-23T07:50:04+05:30 IST