Abn logo
Jun 22 2021 @ 23:49PM

పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువకులు పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలను పొందాలని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టీఎస్‌ఐపాస్‌, టీఎస్‌ప్రైడ్‌ పథకాల కింద యూనిట్ల స్థాపనకు కమర్షియల్‌ వాహనాలకు సబ్సిడీ మంజూరు కోసం జిల్లా స్థాయి పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద పరిశ్రమల శాఖ ద్వారా మంజూరు చేస్తున్న టీఎస్‌ఐపాస్‌, టీఎస్‌ప్రైడ్‌ కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పరిశ్రమల స్థాపనకు 8 మంది దరఖాస్తులు చేసుకోగా ఆరు యూనిట్ల స్థాపనకు ఆయా శాఖల ద్వారా అనుమతించిన మేరకు కమిటీ ఆమోదించామన్నారు. టీఎస్‌ప్రైడ్‌ కింద అద్దె వాహనాల కొనుగోలుకు ఏడుగురు లబ్ధిదారులకు రూ.19.32 లక్షల సబ్సిడీని మంజూరుకు ఆమోదించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ డి.పద్మభూషణ్‌రాజ్‌, ఎల్‌డీఎం చంద్రశేఖర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, అధికారులు పాల్గొన్నారు.