Abn logo
Jun 30 2020 @ 00:35AM

ఉపాధి రంగం కుదేలు

  • ఇండీడ్‌ తాజా నివేదిక


ముంబై: కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరిలోనూ తమ ఉద్యోగం ఏమౌతుందో అన్న భయం వెంటాడుతోంది. ఇప్పటికే విభిన్న రంగాల్లో ఉద్యోగులకు ఉద్వాసనలు, వేతన కోతలు సర్వసాధారణం అయ్యాయి. అలాగే పలు సంస్థలు ఉద్యోగ నియామ కాలను స్తంభింపచేశాయి. కొత్త నియామకాల విషయంలో ప్రపంచ దేశాల మధ్య వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయని, అలాగే కరోనా ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా లేదని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను ట్రాక్‌ చేసే ఇండీడ్‌ తాజా నివేదికలో తెలిపింది. భారతదేశం ఉపాధి అవకాశాల విషయంలో కొన్ని ప్రపంచదేశాల కన్నా మెరుగ్గాను ఉన్నదని, మరి కొన్ని దేశాల కన్నా వెనుకబడి ఉన్నదని తెలియచేసింది.  వాస్తవానికి మార్చి ద్వితీయార్ధం వరకు కొత్త ఉద్యో గాల కల్పన గత ఏడాదితో సమానంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల కొత్త నియామకాలు జూన్‌ మధ్య కాలం నాటికి 51 శాతం తగ్గాయని తెలిపింది. కొత్త నియామకాల తగ్గుదల బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరోపియన్‌ దేశాల్లో 61 శాతం ఉందని పేర్కొంది. అమెరికా (29 శాతం), సింగపూర్‌ (32 శాతం), ఆస్ర్టేలియా (42 శాతం) కన్నా ఉద్యోగా వకాశాల క్షీణత విషయంలో భారత్‌లో చాలా ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొంది. 


ఐటీ రంగం మెరుగు: సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, వైద్యం, మార్కెటింగ్‌ రంగాల్లో కొత్త ఉద్యోగుల నియామకం జరిగిందని, డెలివరీ, ఐటీ మేనేజర్‌ ఉద్యోగ నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయని కూడా తెలిపింది. ఈ విభాగా లన్నింటిలోనూ నియామకాలు ఫిబ్రవరి నాటి స్థితికి సమానంగానే ఉన్నట్టు పేర్కొంది. కాని చైల్డ్‌కేర్‌, ఆహార తయారీ (78 శాతం), ఆతిథ్యం, పర్యాటకం (77 శాతం), స్వచ్ఛత, పారిశుధ్యం (74 శాతం) విభాగాలు మాత్రం తీవ్రంగా దెబ్బ తిన్నాయని తెలిపింది. 


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గు: రిమోట్‌ వర్క్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి అవకాశం కల్పిస్తున్న ఉద్యోగాల కోసం అన్వేషణలు ఇటీవల కాలంలో 380 శాతం పెరిగినట్టు ఆ నివేదిక తెలిపింది. అలాగే యాజమాన్యాలు కూడా ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులతో జతపరిచిన రెజ్యూమ్‌లను సగటున ఆరు సెకండ్ల పాటు మాత్రమే చూస్తున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఇండీడ్‌ ఇండియా మేనేజర్‌ శశికుమార్‌ తెలిపారు. దీన్ని బట్టి ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు సుదీర్ఘ రెజ్యూమ్‌లు కాకుండా ఒక వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా తన ప్రత్యేకతలేమిటో స్పష్టంగా తెలియచేయడమే ప్రధానమని ఆయన చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement