మద్యం.. మాయం..

ABN , First Publish Date - 2020-05-06T10:41:59+05:30 IST

జిల్లాలో గల మద్యం షాపుల్లో మద్యం స్టాకు నిల్వలపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

మద్యం.. మాయం..

ఖాళీ అయిన మద్యం షాపులు

ఎక్సైజ్‌ అధికారుల తనిఖీల్లో తేటతెల్లం 

షాపులు తెరిచేందుకు ప్రభుత్వ తనిఖీలు

తగిన స్టాక్‌ సరఫరా చేసిన తర్వాతనే తెరవనున్న షాపులు 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి ): జిల్లాలో గల మద్యం షాపుల్లో మద్యం స్టాకు నిల్వలపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చాలా షాపుల్లో మార్చి 21వ తేదీ వరకు ఉన్న స్టాక్‌ ప్రస్తుతం అంత మేరకు లేదని తెలుస్తుంది. ఎక్సైజ్‌ శాఖ అధికారుల అండదండలతో మద్యం షాపుల యజమానులు బ్యాక్‌ డోర్‌ల నుంచి చాలా వరకు మద్యం స్టాక్‌ తీసి పక్కదారి పట్టించారు. ఏజంట్లను పెట్టుకొని ఎమ్మార్పీల కంటే మూడింతల ధరలకు విక్రయించారు. మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగించారు.


అయితే కోన్నింటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. అందులో మద్యం దుకాణాలను కూడా తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రానికి పక్కన గల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్‌లో మద్యం అమ్మకాలను ప్రారంభించాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను సాగించే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దానికంటే ముందు రాష్ట్రంలో గల మద్యం షాపుల్లో ఈ మేరకు స్టాకు ఎంత ఉంది అనే విషయమై ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖ అధికారులను తనిఖీలకు ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం నుంచి ఎక్సైజ్‌ శాఖ అధికారులు జిల్లాలోగల అన్ని మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. చివరగా మార్చి 21వ తేదీ వరకు మద్యం షాపులు నడిచాయి. మార్చి 22వ తేదీ నుంచి షాపులు మూతపడ్డ విషయం తెలిసిందే. మూతపడే నాటికి షాపుల్లో ఉన్నంత లేకపోవడం గమనార్హం. 23వ తేదీ నాడే ఎక్సైజ్‌ శాఖ అధికారులు అన్ని షాపులకు సీళ్లు వేశారు.


దానికంటే ముందే షాపులో నుంచి మద్యం షాపుల యజమానులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లు సమాచారం. మరికొంత మంది బ్యాక్‌డోర్‌ ద్వారా విడతల వారీగా షాపులో ఉన్న మద్యం బయటికి తీసి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. 45 రోజుల తరువాత మద్యం షాపులను తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. షాపుల్లో ఈమేరకు స్టాక్‌ ఉందో వివరాలను తెలుసుకొని స్టాక్‌ పాయింట్ల నుంచి స్టాక్‌ సరఫరా చేసుకున్న తరువాత మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో పెంచినట్లుగా మద్యం ధరలను పెంచే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. మొత్తం మీద మద్యం షాపులను తెరిపించేందుకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-05-06T10:41:59+05:30 IST