ఈ రోజు ఎన్‌కౌంటరే!

ABN , First Publish Date - 2021-09-07T06:17:42+05:30 IST

ఈరోజు ఎన్‌కౌంటరే..

ఈ రోజు ఎన్‌కౌంటరే!
ఆత్మహత్యాయత్నం చేసిన రత్తయ్యను పరామర్శిస్తున్న బాలాజీ

వైసీపీ నేతలు, పోలీసుల వేధింపులు

ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం 

కందుకూరు ఏరియా వైద్యశాలలో చికిత్స 

బెదిరించడం వల్లే అంటున్న బంధువులు

బాధితులను పరామర్శించిన నూకసాని 


కందుకూరు(ప్రకాశం): ‘ఈరోజు ఎన్‌కౌంటరే’ అని వైసీపీ నాయకుల బెదిరింపులు.. పోలీసుల వేధింపులకు భయపడి ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. లింగసముద్రం మండలం మొగిలిచర్లకు చెందిన మన్నం శ్రీకాంత్‌, పల్లపోతు రత్తయ్య అనే యువకులు పురుగుమందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్థానికులు హుటాహుటిన కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ఆదివారం జరిగిన ఘటనల నేపథ్యంలో వైసీపీ వర్గీయులు మానసికంగా వేధించడంతోపాటు పోలీసులు కూడా ఏకపక్షంగా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతోనే వారిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


మొగిలిచర్లలో ఎరువులదిబ్బల విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానలా మారి  ఘర్షణకు దారితీసింది. ఇరు కుటుంబాల వారు సమీప బంధువులే అయినప్పటికీ వేర్వేరు పార్టీలలో ఉన్నారు. దీంతో అది పార్టీల మధ్య వివాదంగా మారింది. ఈ తరుణంలో వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకుడు వేముల గోపాలరావును దుర్భాషలాడారు. ఆ దుర్భాషలను రికార్డు చేసి గోపాలరావుకి వినిపించటం.. అతను మరికొందరు వెళ్లి దుర్భాషలాడిన వ్యక్తిని నిలదీయగా మరో ఘర్షణ  జరిగింది. వైసీపీ వర్గీయుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏకపక్షంగా ఆదివారం రాత్రి గోపాలరావుని అరెస్టు చేసి లింగసముద్రం స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలోని టీడీపీ వర్గీయులు స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. డీఎస్పీ కండే శ్రీనివాసరావు, పలువురు పోలీసు అధికారులు వెళ్లి వారికి సర్దిచెప్పి పంపించారు.


సోమవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లు మొగలిచర్ల వెళ్లారు. వారు గ్రామంలోని మన్నం శ్రీకాంత్‌, పల్లపోతు రత్తయ్యలను గోపాలరావుకి సంబంధించి ఘర్షణలో ఉన్న వారిని చూపించమని ఒత్తిడి చేశారు. ఆ సమయంలో కానిస్టేబుళ్లు వారిపట్ల కొంత దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. పోలీసులు వైసీపీ వర్గీయులను వెంట తీసుకొచ్చినట్లు శ్రీకాంత్‌, రత్తయ్యలు, వారి బంధువులు చెబుతున్నారు. ఈక్రమంలో వైసీపీ వర్గీయులు ‘ఈ రోజు మీరిద్దరూ ఎన్‌కౌంటరే’ అని బెదిరించినట్లు చెప్తున్నారు. పోలీసుల తీరుతో భయభ్రాంతులకు గురైన శ్రీకాంత్‌, రత్తయ్యలు గ్రామానికి దూరంగా ఉన్న కాకర్లపాలెం డంపింగ్‌ యార్డు సమీపంలోకి వెళ్లి పురుగుమందు తాగారు. అక్కడ వారు అపస్మారక స్థితిలో ఉండగా చూసిన వారు మొగిలిచర్ల గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే స్టేషన్‌ బెయిల్‌పై టీడీపీ నేత గోపాలరావు విడుదల కావడంతో ఆయన, మరికొందరు గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కందుకూరు ఏరియా వైద్యశాలకు చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని  డాక్టర్లు తెలిపారు.


బాధితులకు నూకసాని పరామర్శ

టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ కందుకూరులోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులను పరామర్శించారు. మొగిలిచర్ల గ్రామస్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి భయభ్రాంతులకు గురిచేయటంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారని విమర్శించారు. ప్రాణం తీసుకునేందుకు సిద్ధపడ్డారంటే వారిని అటు వైసీపీ వర్గీయులు, ఇటు పోలీసులు ఎంతగా వేధించి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. దుర్భాషలాడిన వైసీపీ నాయకులు, ఇతర కార్యకర్తలపై కూడా కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు బొల్లినేని నాగేశ్వరరావు, సీహెచ్‌ వీరబాబు, జి.మోషే, షేక్‌ రఫి, ఎన్‌వి సుబ్బారావు, బెజవాడ ప్రసాద్‌, పి.పాపారావు, శ్రీహరి, జియావుద్దీన్‌ తదితరులున్నారు.



Updated Date - 2021-09-07T06:17:42+05:30 IST