అమరావతి కథ సమాప్తం!

ABN , First Publish Date - 2020-08-01T08:47:56+05:30 IST

నవ్యాంధ్రుల రాజధానిగా ‘అమరావతి’ కథ ముగిసింది! రాజధాని లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రకు ఇప్పుడు ‘మూడు రాజధానులు

అమరావతి కథ సమాప్తం!

  • ఇక మూడు రాజధానుల ముచ్చట
  • పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు.. బిల్లులపై గవర్నర్‌ ఆమోద ముద్ర
  • పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ రాజధాని కర్నూలు
  • చట్టసభలకు పరిమతమయ్యే అమరావతి... భగ్గుమన్న అమరావతి రైతులు


సీమాంధ్రుల కలల రాజధానిగా  తెరపైకి వచ్చిన ‘అమరావతి’కి  వైసీపీ సర్కారు మంగళం పలికింది. మూడు రాజధానుల పేరిట... అమరావతిని చట్టసభలకు మాత్రమే పరిమితం చేసింది.   రాజధానిపై కోటి ఆశలతో  భూములు అప్పగించిన రైతులకు... అక్కడ ప్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసిన తెలుగు వారికి కడగండ్లే మిగిలాయి. రాజధానిపై పట్టు వీడేది లేదని... పోరాడి తీరుతామని అమరావతి జేఏసీ ప్రకటించింది. ఈ పోరుకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి.


అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రుల రాజధానిగా ‘అమరావతి’ కథ ముగిసింది! రాజధాని లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రకు ఇప్పుడు ‘మూడు రాజధానులు’! పరిపాలనా రాజధానిగా విశాఖ! న్యాయ రాజధానిగా కర్నూలు! శాసన రాజధానిగా అమరావతి! సర్కారు పెద్దల ‘మూడు’ కార్యరూపం దాల్చేలా... వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించారు. రెండు వారాల క్రితం తన వద్దకు వచ్చిన బిల్లులపై శుక్రవారం ఉదయం 11గంటలకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లులు అప్రజాస్వామికమని, తిరస్కరించాలని, అటార్నీ జనరల్‌ పరిశీలనకు పంపించాలని.... ఇలా అనేక విన్నపాలు, డిమాండ్లు వచ్చినప్పటికీ గవర్నర్‌ పట్టించుకోలేదు. రాజధాని రైతులు, విపక్షాలు, ప్రజా సంఘాల వినతులను తోసిరాజని... మూడు రాజధానులకు పచ్చజెండా ఊపారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక... మూడు రాజధానులను, సీఆర్డీయే రద్దును నోటిఫై చేస్తూ ప్రభుత్వం వేర్వేరు జీవోలు కూడా జారీ చేసింది. 


ఇలా ముందుకు... 

మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని తొలుత ఈ ఏడాది జనవరి 20వ తేదీన అసెంబ్లీలో ఆమోదించారు. మండలి మాత్రం...  మరింత లోతుగా పరిశీలించేందుకు వీలుగా ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా సదరు బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిందని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పింది. మండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీ  సభ్యులను ఎంపిక చేసినప్పటికీ... కార్యదర్శి దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇది అలా ఉండగానే... జూన్‌ 16న ఇవే బిల్లులను శాసనసభలో మళ్లీ ప్రవేశపెట్టి మరోసారి ఆమోదించారు. మండలిలో మాత్రం ఆమోదించలేదు. ‘మండలి తిరస్కరించిన బిల్లును శాసనసభ మళ్లీ ఆమోదిస్తే... అదే ఫైనల్‌’ అనే నిబంధనను సర్కారు తనకు అనుకూలంగా ఉపయోగించింది.


మండలిలో ఈ బిల్లులు తిరస్కరణకు గురికాలేదని, సెలెక్ట్‌ కమిటీకి వెళ్లాయని విపక్షాలు చేసిన వాదనలను పట్టించుకోలేదు. ‘మండలి’ నిరవధిక వాయిదా పడిన నెలరోజుల తర్వాత... జూలై 18వ తేదీన ఈ బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. ‘మూడు రాజధానులు’ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకోవాలని గవర్నర్‌కు విన్నపాలు అందాయి. అయితే, ఆయన న్యాయశాఖ సలహా తీసుకున్నారు. మాజీ న్యాయమూర్తులు, సీనియర్‌ లాయర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు.   బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన విధానం సరైనదేనా? హైకోర్టులో ఉన్న కేసులు బిల్లుల ఆమోదంపై ప్రభావం చూపుతాయా? ఇది విభజన చట్టానికి వ్యతిరేకమా? అని పరిశీలించారు. అసెంబ్లీ, మండలిలో జరిగిన ఘటనలపైనా నివేదిక తెప్పించుకున్నారు.  చివరికి... బిల్లులను ఆమోదించారు.

Updated Date - 2020-08-01T08:47:56+05:30 IST