ముగిసిన ‘ప్రగతి’

ABN , First Publish Date - 2022-06-20T05:56:11+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో ముగిశాయి.

ముగిసిన ‘ప్రగతి’
బుగ్గారంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈశ్వర్‌ (ఫైల్‌)

- పక్షం రోజులుగా సాగిన కార్యక్రమం

- పారిశుధ్యంపైనే ప్రధాన దృష్టి

- అంతంతమాత్రంగానే మిగితా పనులు

జగిత్యాల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో ముగిశాయి. ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఈనెల 3వ తేది నుంచి 18వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి, 380 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామాలు, పట్టణాల్లో పాడుబడిన బావులను పూడ్చివేయడం, శిథిల భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, అంతర్గత రోడ్లపై ఏర్పడిన గుంతల పూడ్చివేత తదితర పనులు చేపట్టారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌ వేయడం, పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటికి వెళ్లి డ్రై డే నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో శ్రమదానం చేసి, పారిశుధ్య చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, రక్షిత మంచినీటి సరాఫరా పథకాలను శుభ్రం చేసి, పైపులైన్ల లీకేజీలను అరికట్టడం, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఖాళీ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించారు.

- పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇలా...

 పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని, గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త సేకరించే పనులు విస్తృతంగా నిర్వహించారు. శ్రమదానం కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను భాగస్వామ్యులను చేశారు. జిల్లా వ్యాప్తంగా 25,318 మంది శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో 1,472 కిలో మీటర్ల మేర రోడ్లను, 976 కిలోమీటర్ల మేర మురికి కాలువలను శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతంలో 400 కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇళ్లు, అపరిశుభ్రమైన ఖాళీ స్థలాలను గుర్తించి శుభ్ర పరిచారు. గ్రామాల్లో 2,346 ప్రదేశాలల్లో పొదలు, పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మ చెట్లు గుర్తించి వంద శాతం తొలగించారు. జిల్లాలో 451 లోతట్టు ప్రాంతాలను, 692 గుంతలను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. 1,663 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 99 కమ్యూనిటీ ఇంకుడు గుంతలను అధికారులు నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న 24 పాత బోరు బావులను, 55 ఓపెన్‌ బావులను గుర్తించి మూసివేయించారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామం ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 141 వైకుంఠధామాలకు విద్యుత్‌ సరాఫరా, 73 వైకుంఠధామాలకు నీటి సరాఫరా, 67 వైకుంఠధామాల్లో నీటి సరాఫరాతో కూడిన టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు పవర్‌డేను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 155 విద్యుత్‌ స్తంబాలకు మూడో వైర్‌ అవసరం గుర్తించి పనులు పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చెడిపోయిన ఆరు విద్యుత్‌ మీటర్లు, వంగిపోయిన 238 విద్యుత్‌ స్తంబాలు, వేలాడుతున్న 306 లూజ్‌ వైర్‌ సమస్యలను పరిష్కరించారు. 22 బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించారు. గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటేందుకు వీలుగా 359 కిలో మీటర్ల మేర పంచాయతీ రహదారులను గుర్తించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటివాటిపై అవగాహన కల్పించారు.

- పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఇలా..

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం, పచ్చదనం, నీటి సరాఫరా మరమ్మతులు, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, వైకుంఠధామాల నిర్మాణం, సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించారు. 1,339 టన్నుల చెత్తను, 171 టన్నుల వ్యర్థ శిథిలాలను గుర్తించి తొలగించారు.  వర్షాకాలం నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న 808 కిలో మీటర్ల మురికి కాలువను డిసిల్టేషన్‌ చేయడం, అవసరమైన 64 ప్రదేశాలలో జాలీలను ఏర్పాటు చేయడం వంటి పనులు పూర్తి చేశారు.  129 లోతట్టు ప్రాంతాలను గుర్తించి వర్షపునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లాలో సింగిల్‌ యూసెజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలు చేయడంలో భాగంగా 29 కిలోల ప్లాస్టిక్‌ను గుర్తించి సీజ్‌ చేయడంతో పాటు వ్యాపారులకు రూ. 13,300 జరిమానా విధించి వసూలు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 1,049 ఖాళీ ప్రదేశాలను గుర్తించారు. 5,825 వంగిపోయిన మొక్కలు, ట్రీ గార్డు లేని మొక్కలు గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. అయిదు మున్సిపాల్టీలలో నూతనంగా అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయడానికి తొమ్మిది అనువైన స్థలాలను గుర్తించారు. మున్సిపాలిటీల పరిధిలో లీకేజీ అవుతున్న 98 తాగునీటి పైప్‌లేన్లను, ఆరు మోటార్లను గుర్తించి వాటిని మరమ్మతు పూర్తిచేశారు.  

- ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో...

పల్లెలు, పట్టణాల్లో ప్రగతి కార్యక్రమాలను ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అధికారులు పూర్తిచేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్‌లలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, పలు ప్రాంతాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, ఆయా మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పలు కమిటీల నేతలు, ప్రజలు భాగస్వామ్యమై ప్రగతి పనులు నిర్వహించారు. శాసనసభ్యులు ప్రతీ రోజు ఆధ్యాంతం ఏదో ఒక ప్రగతి కార్యక్రమాల్లో లీనమై పనులు నిర్వహించారు.

- కొన్నిపనులు అసంపూర్తిగా...

జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ప్రగతి కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ పలు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రధానంగా పారిశుధ్యం, పరిశుభ్రతపైనే దృష్టి సారించిన అధికారులు ఇతర పనులు గుర్తించినప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కరించలేదన్న విమర్శలు ప్రతిపక్ష నేతలు చేస్తున్నారు. కొన్ని సమస్యలు గుర్తించి సగమే పరిష్కరించారని, సంపూర్ణంగా చేయలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ప్రధానంగా నిధులు ఖర్చు అయ్యే పనులు మాత్రం గుర్తించి వదిలివేశారన్న ఆరోపణలున్నాయి. కొన్ని సమస్యలు తాత్కాలికంగా పరిష్కరించినప్పటికీ, మునుముందు ఆ సమస్య మళ్లీ ఎదురయ్యే అవకాశాలు సైతం ఉన్నాయి. ప్రగతి కార్యక్రమంలో భాగంగా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ప్రజలు భావిస్తే తాత్కలిక ఉపశమనం కల్పించారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా పదిహేను రోజులుగా పల్లెలు, పట్టణాల్లో ప్రగతి కార్యక్రమాలలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి కనిపించింది. పలు సమస్యలు పరిష్కారమైనప్పటికీ మరికొన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులు పడ్డాయి. 


Updated Date - 2022-06-20T05:56:11+05:30 IST