ఈ ఏడాదితో ముగిస్తా!

ABN , First Publish Date - 2022-01-20T06:30:17+05:30 IST

భారత మహిళల టెన్నిస్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తెలుగుతేజం, ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది.

ఈ ఏడాదితో ముగిస్తా!

రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా 


మెల్‌బోర్న్‌: భారత మహిళల టెన్నిస్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తెలుగుతేజం, ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాదే తనకు కెరీర్‌లో చివరిదని తెలిపింది. వయసు పెరుగుతుండడంతో శరీరం క్రమంగా బలహీనమవుతోందని.. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ (ఆగస్టు) ఆడి టెన్ని్‌సకు గుడ్‌బై చెబుతానని సానియా వెల్లడించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో సానియా జోడీ తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ‘కెరీర్‌కు వీడ్కోలు పలకాలన్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి.


ఫిట్‌నెస్‌ సమస్యలను అధిగమించడానికి, గాయాల నుంచి కోలుకోవడానికి నా శరీరం ఎక్కువ సమయం తీసుకుంటోంది. కొవిడ్‌ వైరస్‌ విసురుతున్న సవాళ్ల నడుమ.. టెన్నిస్‌ మూలంగా నా మూడేళ్ల కొడుకు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ రోజు ఆడుతున్నప్పుడు కుడి మోకాలి నొప్పి బాగా ఇబ్బంది పెట్టింది. మరి కొంతకాలం ఆడాలని ప్రతి రోజూ నన్ను నేను ఉత్సాహపర్చుకుంటూ ముందుకు సాగుతున్నా కానీ, ఇంకెక్కువ రోజులు ఇలా కొనసాగలేననే నిర్ణయానికొచ్చా. ఇదే నా చివరి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో ఆడి ముగింపు పలుకుతా’ అని హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల సానియా తెలిపింది. 


రాకెట్‌లా దూసుకొచ్చి.. 

ఆరేళ్ల ప్రాయంలో రాకెట్‌ చేతపట్టిన సానియాకు తొలి గురువు ఆమె తండ్రి ఇమ్రాన్‌ మీర్జానే. తండ్రి శిష్యరికంలో టెన్నిస్‌ ఓనమాలు నేర్చుకున్న ఆమె అత్యుత్తమ ప్రతిభతో అనతికాలంలోనే స్టార్‌ క్రీడాకారిణిగా ఎదిగింది. కెరీర్‌ ఆరంభంలో సింగిల్స్‌లో మెరిసినా... ఆ తర్వాత డబుల్స్‌కు మారి ఆటలో సంచలనాలు సృష్టించింది. సింగిల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌ సాధించిన సానియా.. డబుల్స్‌లో మాత్రం ప్రపంచ నెంబర్‌వన్‌ హోదాను దక్కించుకుంది. మార్టినా హింగి్‌సతో కలిసి దాదాపు 91 వారాలు టాప్‌ ర్యాంక్‌లో కొనసాగిన ఆమె.. కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సాధించింది.


ఇందులో మూడు డబుల్స్‌, మూడు మిక్స్‌డ్‌ టైటిళ్లున్నాయి. ఇక.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు, ఆఫ్రో ఆసియా క్రీడల్లో కలిపి మొత్తం 14 పతకాలు కొల్లగొట్టింది. టెన్ని్‌సలో రాకెట్‌లా దూసుకొచ్చి భారత క్రీడాకారుల్లో (క్రికెటర్లు మినహా) ఎవరికీ రాని క్రేజ్‌ను సంపాదించుకున్న సానియా.. కొన్నిసార్లు వివాదాలనూ చవిచూసింది. తన దుస్తుల విషయంలో మతపరమైన ఆంక్షలకు గురైనా, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకొని విమర్శలపాలైనా.. ఆ సవాళ్లన్నింటినీ తన ఆటతో అధిగమించింది. ఇలా సుదీర్ఘ కెరీర్‌లో అరుదైన మైలురాళ్లను అందుకొని భారత మహిళల టెన్ని్‌సకు ఓ దిక్సూచిలా మారిన సానియాను.. అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న, పద్మభూషణ్‌లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో దేశం గౌరవించింది.   

Updated Date - 2022-01-20T06:30:17+05:30 IST