దేవదాయ అధికారికి దక్షిణ

ABN , First Publish Date - 2020-11-24T06:28:41+05:30 IST

దేవదాయ శాఖలో ఇటీవల అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ ఇన్‌చార్జిని ప్రసన్నం చేసుకుంటే... ఏం చేసినా అడిగే నాథుడు లేడని గ్రహించిన కొంతమంది ఆ దిశగా పరుగులు తీస్తున్నారు.

దేవదాయ అధికారికి దక్షిణ

ఓ అధికారి తీరు చర్చనీయాంశం

వైసీపీ ఇన్‌చార్జి చుట్టూ ప్రదక్షిణలు

భూముల రికార్డులు ఇస్తూ మెప్పు పొందేందుకు యత్నం

ఆయన అండ చూసుకుని చెలరేగిపోతున్న వైనం

షాపుల లీజు పొడిగింపునకు నజరానాలు అందుకున్నట్టు ప్రచారం

 మంత్రి ఇలాకాలో గుట్టుచప్పుడు కాకుండా ట్రస్టు బోర్డు

 పూజార్ల నియామకంలోనూ అత్యుత్సాహం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


దేవదాయ శాఖలో ఇటీవల అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ ఇన్‌చార్జిని ప్రసన్నం చేసుకుంటే... ఏం చేసినా అడిగే నాథుడు లేడని గ్రహించిన కొంతమంది ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. దేవదాయ, మాన్సాస్‌ ట్రస్టు భూముల వివరాలను రికార్డులతో సహా ‘సదరు పార్టీ ఇన్‌చార్జి’కి అప్పగిస్తూ మెప్పు పొందుతున్నారు. దీంతో దేవదాయ శాఖ అనగానే ఆయన నోటి వెంట...‘ఆ ఒక్క అధికారి’ పేరు మాత్రమే వినిపిస్తుందని తోటి అధికారులు, సిబ్బందే చెప్పుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి ఆ అధికారి ఇతర వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టుకుంటున్నారు. 


లీజు పొడిగింపునకు బేరం?

వన్‌టౌన్‌లోని సీతారామస్వామి దేవస్థానానికి చెందిన స్థలంలో దుకాణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి లీజు గడువు ఇటీవల ముగిసింది. వాటిని వేలం వేసి అద్దెకు ఇచ్చేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. అయితే అక్కడే కొనసాగాలనుకుంటున్న ఓ వ్యాపారి తాను దీర్ఘకాలం లీజు కావాలని దరఖాస్తు చేసుకున్నానని, అర్ధంతరంగా తప్పిస్తున్నారేమిటి?...అంటూ ప్రశ్నిం చాడు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఉన్నత స్థాయిలో ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని స్థానిక సిబ్బంది తెలియజేశారు. దాంతో సదరు వ్యాపారి...దీపావళి పర్వదినాన ఆ అధికారిని కలిసి మిఠాయిలతో సహా దక్షిణ సమర్పించుకున్నారని, దాంతో లీజు కొనసాగించడానికి మార్గం సుగమమైందని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది.


దేవదాయ శాఖలో సి-కేటగిరీ దేవాలయాలకు ట్రస్టు బోర్టులను నియమించే అధికారం స్థానిక అధికారులకు ఉంటుంది. జిల్లా మంత్రి నియోజకవర్గంలో గల గుడిలోవ రంగనాథ స్వామి ఆలయానికి ఆ విధంగానే ట్రస్టుబోర్డును కొద్దిరోజుల క్రితం వేశారు. సదరు పదవులపై ఆశ పెట్టుకున్న కార్యకర్తలు చడీచప్పుడు లేకుండా వేసిన ట్రస్టుబోర్డుపై నిరసన వ్యక్తంచేశారు. ఏమిటీ చర్యలు అంటూ ఆందోళనకు దిగారు. ఇలాగైతే మంత్రి దృష్టికి తీసుకువెళతామంటూ హెచ్చరించారు. దాంతో భయపడిన అధికారులు వెంటనే ఆ ట్రస్టు బోర్డును రద్దు చేసేశారు. మంత్రి ఇలాకాలో ఆయనకు మాట మాత్రం చెప్పకుండా ట్రస్టు బోర్టు వేశారంటే...ఆ అధికారులకు ఎవరి దన్ను వుందో అర్థం చేసుకోవచ్చునంటూ దేవదాయ శాఖ అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.


ఇటీవల మురళీనగర్‌లో వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ తన పరిధిలోకి తీసుకుంది. ఆ కార్యక్రమం కూడా పార్టీ ఇన్‌చార్జి నేతృత్వంలో నేత్రపర్వంగా నిర్వహించారు. అక్కడ జరిగిన తంతు చూసి పూజార్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న అధికారి వద్దకు వెళ్లి తమకు జీవనోపాధి కల్పించాలని వేడుకున్నారు. దాంతో ఆ ఆలయంలో పూజార్ల సంఖ్య రెండు నుంచి ఐదుకు పెరిగింది.


‘జీతం ఇక్కడ...సేవలు అక్కడ’పై నివేదిక

వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడ కాకుండా వేరే చోట డ్రైవర్లుగా ఉపయోగించుకుంటున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘జీతం ఇక్కడ...సేవలు అక్కడ’ శీర్షికన ప్రచురించిన కథనంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాయి. దీనిపై దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ కూడా నివేదిక కోరారు.

Updated Date - 2020-11-24T06:28:41+05:30 IST