పాండురంగస్వామి దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 14 షాపులు స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-01T06:07:11+05:30 IST

స్థానిక పాండురంగస్వామి దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న 14 షాపులను మంగళవారం దేవదాయ శాఖ అధికారులు ఖాళీచేయించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతి ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు, సిబ్బంది షాపులను స్వాధీనం చేసుకుని, షట్టర్లకు తాళాలు వేశారు.

పాండురంగస్వామి దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 14 షాపులు స్వాధీనం
దేవదాయ శాఖ అధికారులు షాపులను ఖాళీ చేయించడంతో సామగ్రిని బయటకు చేర్చిన వ్యాపారులు


కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం: ఏసీ శాంతి 

త్వరలో లీజువేలం పాటలు నిర్వహిస్తామని వెల్లడి


పాయకరావుపేట, నవంబరు 30: స్థానిక పాండురంగస్వామి దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న 14 షాపులను మంగళవారం దేవదాయ శాఖ అధికారులు ఖాళీచేయించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతి ఆధ్వర్యంలో సుమారు 20 మంది  అధికారులు, సిబ్బంది షాపులను స్వాధీనం చేసుకుని, షట్టర్లకు తాళాలు వేశారు. ఈ సమయంలో కొంతమంది షాపుల నిర్వాహకులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా  షాపులు ఖాళీచేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కరోజు గడువు ఇస్తే షాపులను ఖాళీచేస్తామని బతిమాలినా ఏసీ శాంతి వినిపించుకోలేదని, పోలీసుల బందోబస్తుతో ఉన్నఫళంగా ఖాళీ చేయించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీ కె.శాంతి విలేకరులతో మాట్లాడుతూ, పాండురంగస్వామి దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 14 షాపులను లీజుదారులు ఇతరులకు సబ్‌లీజుకు ఇచ్చినట్టు గుర్తించి గత ఏడాది డిసెంబరులో షాపులను సీజ్‌ చేయించామన్నారు. అయితే లీజుదారులు కోర్టుకు వెళ్లారని, తరువాత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు షాపులను లీజుదారులకు తిరిగి అప్పగించి, ఖాళీ చేయడానికి మూడు నెలలు గడువు ఇచ్చామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో గడువు ముగిసినప్పటికీ షాపులు ఖాళీ చేయకపోవడంతో నోటీసులు జారీ చేసి,  లీజుదారులతో సమావేశం కూడా నిర్వహించామన్నారు. వారి విజ్ఞప్తి మేరకు నవంబరు 29వ తేదీ వరకు గడువు ఇచ్చామని, అయినా ఒక్కరు కూడా ఖాళీ చేయలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు షాపులను ఖాళీచేసి సీజ్‌ చేస్తున్నామన్నారు. ఈ షాపులకు త్వరలో లీజు వేలం పాటలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 


Updated Date - 2021-12-01T06:07:11+05:30 IST