శక్తి మేరకే పరీక్ష

ABN , First Publish Date - 2021-08-06T05:37:11+05:30 IST

మానవులెవరైనా ఎలాంటి సందేహం లేకుండా విశ్వసించగలిగేది దైవాన్ని మాత్రమే. మనస్ఫూర్తిగా ఆయనను నమ్మితే...

శక్తి మేరకే పరీక్ష

మానవులెవరైనా ఎలాంటి సందేహం లేకుండా విశ్వసించగలిగేది దైవాన్ని మాత్రమే. మనస్ఫూర్తిగా ఆయనను నమ్మితే... మనల్ని పతనం వైపు లాక్కుపోయే ప్రలోభాల నుంచి తప్పిస్తాడు. సరైన దారిని ఎంపిక చేసుకొనే వివేకాన్ని ప్రసాదిస్తాడు. కఠిన పరీక్షలను దాటే ఆత్మస్థైర్యాన్నీ, నైపుణ్యాన్నీ అందిస్తాడు. జీవితంలో మనకు ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. మన ప్రయాణం ఎన్నో శోధనలలోంచి సాగుతుంది. ‘‘నాకే ఎందుకీ పరీక్షలు? నాకే ఎందుకిన్ని కష్టాలు?’’ అని మనం తల్లడిల్లిపోతాం. ‘‘దేవుడు నా మీద దయ చూపించలేదు. నా పట్ల ఆయనకు దయ లేదు’’ అని బాధపడతాం. కానీ మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మన శక్తిని మించి ఎన్నడూ ఉండవు. వాటిని ఎదుర్కొనే బలాన్ని దైవం మనకు ఎల్లప్పుడూ ప్రసాదిస్తాడు.


ఆ సంగతి గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో... ‘నేను సర్వసమర్థుణ్ణి’ అనే అహంకారానికి లొంగిపోకపోవడం కూడా అంతే ముఖ్యం. ‘‘మనుషులకు సాధారణంగా కలిగే శోధన తప్ప మరేదీ మీకు జరగలేదు. నమ్మదగినవాడు దేవుడు మాత్రమే. మీరు సహించగలిగేదానికన్నా ఎక్కువ శోధనలకు ఆయన మిమ్మల్ని గురి కానివ్వడు. అంతే కాదు, వాటిని సహించడానికీ, ఆ శోధనలను తప్పించుకోడానికీ మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు’’ అని బైబిల్‌లోని ‘కొరంధీయులు’ అధ్యాయం చెబుతోంది. మనకు ఎదురయ్యే సమస్యలను మనకు ఉన్న శక్తితోనే దాటగలం అనుకోవడం పొరపాటు. దైవ శక్తి తోడయితేనే ఎలాంటి పరీక్ష ఎదురైనా... దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలం. చెక్కుచెదరకుండా బయట పడగలం. అన్ని వేళలా మన వెంట ఉండే ఆ దైవం... ఆపత్సమయంలో చూపించే దారిని గుర్తించే వివేకాన్ని సంపాదించుకోవాలి. అకుంఠిత విశ్వాసం ద్వారానే ఆ వివేకం కలుగుతుంది.

Updated Date - 2021-08-06T05:37:11+05:30 IST