నవంబరు 30 నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు

ABN , First Publish Date - 2021-10-27T08:04:30+05:30 IST

నవంబరు 30వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. నవంబరు 15న కొత్త విద్యార్థులకు ఇండక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాలేజీలకు..

నవంబరు 30 నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు

  • 25లోపు సీటు వదులుకునే విద్యార్థులకు పూర్తి రీఫండ్‌
  • తాజా షెడ్యూల్‌ను ప్రకటించిన  ఏఐసీటీఈ 
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తొలి దశ సీట్ల కేటాయింపు నేడే


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): నవంబరు 30వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. నవంబరు 15న కొత్త విద్యార్థులకు ఇండక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాలేజీలకు సూచించింది. దీనికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను ఏఐసీటీఈ విడుదల చేసింది. అలాగే నవంబరు 25వ తేదీలోపు విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను వదులుకుంటే వారికి పూర్తి ఫీజును తిరిగి చెల్లించాలని కాలేజీలను ఆదేశించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ, క్లాసులు ప్రారంభించడంలో కొంత జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఐటీల్లో సీట్ల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. ఇతర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ కూడా మధ్యలోనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను సవరిస్తూ... వచ్చే నెల 30 నుంచి క్లాసులను ప్రారంభించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.


ఎంసెట్‌ రెండో దశపై త్వరలో నిర్ణయం

రాష్ట్రంలో ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. నవంబరు 15వ తేదీ తర్వాత కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తర్వాత ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఐఐటీల్లో చేరితే ఆ మేరకు ప్రముఖ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ సీట్లు ఖాళీ కానున్నాయి. అందువల్ల జేఈఈ కౌన్సెలింగ్‌ తర్వాత ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కొత్త కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కోర్సులకు అనుమతిస్తే రాష్ట్రంలో మరో 4వేల వరకు ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడించనున్నారు. తర్వాత నవంబరు 1వ తేదీన రెండో దశ, 6వ తేదీన మూడో దశ సీట్ల కేటాయింపులను ప్రకటించనున్నారు. ఇలా వరుసగా మొత్తం ఆరు దశల్లో ఐఐటీ సీట్లను భర్తీ చేయనున్నారు.

Updated Date - 2021-10-27T08:04:30+05:30 IST