ఇంజనీరింగ్‌ సెట్‌.. చేయండి

ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST

ఇంజనీరింగ్‌ ప్రథమ సంవత్సర విద్యా ర్థులకు డిసెంబరు ఒకటో తేదీ నుంచి తరగ తులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది.

ఇంజనీరింగ్‌ సెట్‌.. చేయండి

ఖరారు కాని ఫీజులు.. మొదలు కాని కౌన్సెలింగ్‌ 

ఇప్పటికే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి 

డిసెంబరు 1న తరగతులు ప్రారంభించాలన్న ఏఐసీటీఈ  

క్లాసులు ప్రారంభంకాక ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఆందోళన 

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాక యాజమాన్యాల గగ్గోలు  


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

ఇంజనీరింగ్‌ ప్రథమ సంవత్సర విద్యా ర్థులకు డిసెంబరు ఒకటో తేదీ నుంచి తరగ తులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. కాని, ఇక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇంజనీరిం గ్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేయకపోవడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇంజనీరింగ్‌ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఎంసెట్‌ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభించేందుకే కాలాతీతమైంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మరింత  జాప్యం జరుగుతోంది. దీని ప్రభావం జిల్లాలో సుమారు తొమ్మిది వేల మంది ఎంసెట్‌ విద్యార్థులపై పడుతోంది. ఇంజనీరింగ్‌ విద్య ఫీజు నిర్ధారణ కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కళాశాలల వారీగా ఫీజులను నిర్ధారిస్తూ ఇచ్చిన నివేదికపై ప్రస్తు తం తాత్సారం చేస్తున్నారు. కొన్ని కళాశాలలకు తక్కువ ఫీజును నిర్ధారించడం వల్లే కమిటీ ఇచ్చిన నివేదికపై ఇంకా ప్రభుత్వం ఎటూ తేల్చు కోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందులో కొందరు ప్రజాప్రతినిధుల కళాశాలలు ఉన్నాయి. కమిటీ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం ఫీజులను ఖరారు చేయలేదు. కౌన్సెలిం గ్‌ నిర్వహించడంలో జాప్యం అనివార్యమైంది. వాస్తవానికి ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్‌ల పరిశీలన పూర్తయ్యింది. కౌన్సెలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. నవంబరు రెండో వారంలోనే  కౌన్సెలింగ్‌ షెడ్యూల్డ్‌ విడుదల చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. అప్పటిలోగా ఫీజులను నిర్ధారిస్తామని వెల్లడించారు. అయినా సరే ఫీజుల నిర్ధారణలో తొలి నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో కళా శాలలు ఇబ్బందులు పడుతున్నాయి. అనుకున్న సమయానికి ఫీజులు ఖరారు చేయడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అంగీకరిం చాలని అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలపై ఒత్తిడి తెచ్చారు. అందుకు సమ్మతించిన కళాశాలలకు తొలుత పీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేశారు. ఆ తర్వాత అనుమతి పత్రాలు ఇచ్చిన కళాశాలలకు ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న బకాయిలను విడుదల చేయలేదు. 

గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అలాగే ఉన్నాయి. మరోవైపు జిల్లాలోని అన్ని కళాశాలలకు ఇంజనీరింగ్‌ పీజీ అభ్యర్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయి. అనుమతి పత్రం ఇవ్వడం లో కాస్త వెనుకపడ్డ కళాశాలలకు అక్టోబరు మాసాంతానికి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ గత బకాయిలను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇప్పటి వరకు బకాయిలు జమ చేయకపోవడంతో కళాశాలలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. 

పది నెలలుగా సిబ్బంది వేతనాలు ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. అయినా సరే ప్రభుత్వం నుంచి స్సందన కొరవడింది. ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలు కేవలం కళాశాలల యాజమాన్యాలపైనే ప్రభావం చూపా యి. తాజాగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబరు ఒకటి నుంచే ఆన్‌లైన్‌ తరగుతులు ప్రారంభం కావాల్సి ఉన్నా కౌ న్సెలింగ్‌ నిర్వహించకపోవడం వల్ల ఏఐసీటీఈ ఆ దేశాలు నెరవేర లేదు. విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నా మన్న ఆవేదన విద్యార్థుల్లో నెలకొంది.. ఇంజనీరింగ్‌లో తాము అనుకున్న సీటు, కళాశాల రాకపోతే వేరే కోర్సుల్లో  చేరేందుకు ఆసక్తి చూపే విద్యార్థులు నష్టపోనున్నారు.

వేగంగా నిర్వహించాలి

 ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి.  తాము కోరిన సీటు వస్తుందో రాదో లెలియదు. ఇంజనీరింగ్‌ కాకపోతే మరో కోర్సు చేయాలన్నా ముందుగా కౌన్సెలింగ్‌ పూర్తి కావాలి. ఇప్పటికే తామంతా సర్టిఫికెట్‌లను ధ్రువీకరించుకున్నాం. నవంబరులోనే కౌన్సెలింగ్‌ పూర్తయితే తమ భవిష్యత్తు తేలిపోతుందని ఊహించాం. కానీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో ఆందోళనగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే కౌన్సెలింగ్‌ నిర్వహించే చర్యలు తీసుకోవాలి.

– బూరగడ్డ హాసిత, తాడేపల్లిగూడెం 


Updated Date - 2020-12-02T05:30:00+05:30 IST