80,935సీట్ల భర్తీ

ABN , First Publish Date - 2021-11-17T15:43:08+05:30 IST

తొలి విడత కౌన్సెలింగ్‌లో..

80,935సీట్ల భర్తీ

అమరావతి(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో 80,935సీట్లు భర్తీ అయ్యాయి. మరో 30,360సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో కేటాయించనున్నారు. ఏపీఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. మొత్తం 1,34,205మంది ఆ పరీక్షలో అర్హత సాధించగా...అందులో 90,606మంది సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వందమంది సర్టిఫికెట్ల పరిశీలనలో అనర్హులయ్యారు. అనంతరం కళాశాలలు, సీట్లకోసం ఆప్షన్‌ పెట్టుకున్నవారు 89,898మంది ఉన్నారు. వీరందరికీ మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తిచేసి మంగళవారం సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఫలితాలను విడుదల చేశారు.


ఇంజనీరింగ్‌ విభాగంలో విశ్వవిద్యాలయ కళాశాలలు 25ఉండగా..వీటిలో 5,668సీట్లు కేటాయించారు. మరో 696సీట్లు భర్తీ కావాల్సి ఉంది. 229ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొత్తం 99,872సీట్లు ఉండగా...తొలి విడతలో 74,852భర్తీ అయ్యాయి. ఇంకా 25,020సీట్లు ఉన్నాయి. మొదటి విడతలో ఆప్షన్లు పెట్టుకున్నవారిలో దాదాపు 9వేలమందికి సీట్లు రాలేదు. వారికి వచ్చిన ర్యాంకుకు, పెట్టుకున్న కళాశాలలకు మ్యాచ్‌ కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బి.ఫార్మసీలో 9 ప్రభుత్వ కళాశాలల్లో 293సీట్లు ఉండగా 81భర్తీ అయ్యాయి. 112ప్రైవేటు కళాశాలల్లో 4,093సీట్లు ఉండగా 271భర్తీ అయ్యాయి. మిగిలినవి రెండో విడత కౌన్సెలింగ్‌లో కేటాయిస్తారు. డి.ఫార్మాలో 31సీట్లుండగా 16భర్తీ అయ్యాయి. ప్రైవేటులో 48సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 603సీట్లు భర్తీ కావాల్సి ఉంది. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ కోటాల సీట్లను రెండో విడతలో భర్తీచేస్తారు.

Updated Date - 2021-11-17T15:43:08+05:30 IST