Abn logo
Sep 22 2021 @ 19:45PM

ఎగ్ దోశకు డబ్బులు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరు: ప్రతి మనిషి మరణం వెనుక ఓ కారణం ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వంటి ఇతర బలమైన కారణాలతో జీవితంపై విరక్తితో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. మరి కొందరైతే చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకుంటుంటారు. తాజాగా కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.


చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన యువకుడు(21) గ్రామ సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్ధానికంగా విషాదాన్ని నింపింది. యువకుడు బి.కోత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి ఎంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి చలాకీగా ఉంటూ యువకుడు చదువులో‌నూ తోటి విద్యార్థుల కంటే ముందుండే వాడు. ఇలా ఉండగా బుధవారం ఉదయం యువకుడు కోడిగుడ్డు దోశ‌కు డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులను కోరారు. డబ్బులు ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు .. కుటుంబ సభ్యులతో గోడవ పడి తన మొబైల్ ఫోన్‌ను ఇంటిలోనే వదిలి పెట్టి బయటకు వెళ్ళారు. ఏదో కోపంలో‌ బయటకు వెళ్తున్నాడని, కోపం తగ్గాక ఇంటికి వస్తాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. 


ఇంతలోనే గ్రామ సమీపంలో పొలం పనులు చేస్తున్న కూలీలు కేకలు వేస్తుండగానే యువకుడు గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుంటలో దూకిన యువకుడిని కాపాడేందుకు కూలీలు ప్రయత్నించినా అప్పటికే‌ మృతి చెంది ఉండడంతో పోలీసులకు,‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో‌ మునిగి పోయారు. సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి‌ గుర్రప్పకుంటలో‌ నుంచి యువకుడు మృతిదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.