Abn logo
Sep 24 2021 @ 03:52AM

ప్రధాని కోరినా..రూలు రూలే

బోరిస్‌ విజ్ఞప్తికి నో చెప్పిన స్కాట్‌

లండన్‌: ఈ ఏడాది చివర్లో యాషెస్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో, పైగా క్రిస్‌మస్‌ రోజుల్లో తమ వెంట కుటుంబ సభ్యులు కూడా ఉండాలని భావిస్తున్న రూట్‌ సేనకు నిరాశే ఎదురైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయానా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.


ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ను ఇటీవల ఆయన అమెరికాలో కలుసుకున్న సందర్భంగా క్రికెటర్ల ఫ్యామిలీలకు వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరారు. కానీ ఆటగాళ్ల కోసం ప్రత్యేక అనుమతులేమీ ఉండవని ఆసీస్‌ స్పష్టం చేసింది. ‘యాషెస్‌ సిరీస్‌ సజావుగా సాగాలనే కోరుకుంటున్నా. కానీ క్రికెటర్ల కుటుంబాల కోసం మేం ఎలాంటి వెసులుబాటు కల్పించలేం’ అని మోరిసన్‌ తేల్చారు. అంతకుముందు వీలైనంత మేర సమస్యను పరిష్కరిస్తానని మోరిసన్‌ హామీ ఇచ్చారని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ చెప్పారు.