పాక్ ఆటగాళ్లను బీసీసీఐ తొక్కేస్తోంది: నాసిర్ హస్సేన్

ABN , First Publish Date - 2020-08-06T22:30:32+05:30 IST

పాకీస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హస్సేన్ అసంతృప్తి వ్యక్తం ..

పాక్ ఆటగాళ్లను బీసీసీఐ తొక్కేస్తోంది: నాసిర్ హస్సేన్

లండన్: పాకీస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హస్సేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కారణంగా క్రీడా వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. దీనిని పునరుద్ధరించడంలో భాగంగా ఇంగ్లాండ్ ఇతర దేశాలతో సిరీస్‌లను నిర్వహిస్తోంది. అందులో భాగంగా పాకీస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించింది. బుధవారం నుంచి ప్రారంభమైన మొదటి మ్యాచ్‌లో పాక్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. పాక్ బ్యాట్స్‌మన్ బాబార్ అజామ్, షాన్ మసూద్‌లు చక్కటి ప్రదర్శన చేశారు. బాబర్ అర్థసెంచరీతో రాణించాడు. అయితే అతడికి సరైన గుర్తింపు లభించట్లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘బాబర్ గొప్ప ఆటగాడు. అతడిని కావాలనే తొక్కేస్తున్నారు. 2018 నుంచి టెస్టుల్లో బాబర్ సగటు 68, వన్డేల్లో 55 సగటు. ఇంత గొప్పగా ఆడుతున్నా అతడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇదే స్థాయిలో భారత కెప్టెన్ కోహ్లీ రాణిస్తుంటే అతడికి ఎంతో గుర్తింపు వచ్చేది. తొలి రోజే అర్థసెంచరీ చేశాడంటూ సీనియర్లంతా అతడిని ఆకాశానికి ఎత్తేవారు. పాక్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు రాకపోడానికి భారత క్రికెట్ బోర్డే కారణం. ఐపీఎల్‌లో పాక్‌ ఆటగాళ్లను అనుమతించడంలేదు.


అలాగే పాక్‌తో ఒక్క సిరీస్ ఆడేందుకు కూడా భారత్ సుముఖంగా లేదు. దీంతో ఇతర దేశాలతో ఆడే సిరీస్‌ల విషయంలోనూ పాక్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్వదేశానికి దూరంగా యూఏఈలో మ్యాచ్‌లను నిర్వహించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల పీసీబీ ఆర్థికంగా నష్టపోతోంది. బీసీసీఐ ధన బలంతో పీసీబీని, అక్కడి ఆటగాళ్లను తొక్కేస్తుంద’ని నాసిర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్‌లో పాక్ 49 ఓవర్లగాను 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మూడో సెషన్ పూర్తిగా రద్దయింది.

Updated Date - 2020-08-06T22:30:32+05:30 IST