Abn logo
Jul 29 2020 @ 04:32AM

ఇంగ్లండ్‌ సాధించెన్‌!

ఓ వైపు వర్షంతో అంతరాయం.. మరో వైపు ఇంగ్లండ్‌ బౌలర్ల వికెట్ల వేట.. ఇదీ ఆఖరి రోజు విండీ్‌సతో జరిగిన మూడో టెస్టు తీరు. చివరికి ఏదైతేనేం.. మ్యాచ్‌ రెండో సెషన్‌లోనే రూట్‌ సేన తాము ఎదురుచూస్తున్న ఫలితాన్ని సాధించింది. అటు పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 500 వికెట్ల కోరికా తీరింది. అయితే ఆఖరి రోజు క్రిస్‌ వోక్స్‌ చెలరేగి ఐదు వికెట్లు తీయడం హైలైట్‌గా నిలిచింది. దీంతో గతేడాది సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ విజ్డెన్‌ ట్రోఫీని ఇంగ్లండ్‌ అలవోకగా సాధించింది..


మాంచెస్టర్‌: ఒక రోజు ఆలస్యమైనా.. ఊహించినట్టుగానే ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించింది. మంగళవారం చివరి రోజు ఆటలో ఆతిథ్య జట్టు పేసర్లు క్రిస్‌ వోక్స్‌ (5/50) బ్రాడ్‌ (4/36) ధాటికి విండీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్‌ 269 పరుగుల తేడాతో విజయం సాధించి 2-1తో విజ్డెన్‌ ట్రోఫీని దక్కించుకుంది. ఇక ఈ ట్రోఫీ శాశ్వతంగా ఈ జట్టు దగ్గరే ఉండబోతోంది. వచ్చే ఏడాది నుంచి  ఈ జట్ల మధ్య జరిగే సిరీస్‌ను బోథమ్‌-రిచర్డ్స్‌ ట్రోఫీ పేరిట పిలవనున్నారు. అంతకుముందు ఈ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఇక 10 వికెట్లతో పాటు అరుదైన 500 వికెట్ల క్లబ్‌లో చేరిన బ్రాడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తోపాటు ‘సిరీస్‌’ కూడా దక్కింది. ఇక విండీస్‌ తరపున మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఛేజ్‌కి లభించింది.


బ్రాడ్‌ మైలురాయి: 10/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌ ఆటగాళ్ల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బ్రాత్‌వైట్‌  (19)ను ఎల్బీగా అవుట్‌ చేసిన బ్రాడ్‌ తన కెరీర్‌లో 500వ వికెట్‌ను పూర్తి చేసుకోవడంతో జట్టు సంబరాలు చేసుకుంది. ఆ తర్వాత ఓక్స్‌ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు తీయగా విండీస్‌ 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే మరోసారి వర్షం పడడంతో జట్లు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లాయి.


వోక్స్‌ హవా: బ్రేక్‌ తర్వాత విండీ్‌సను వోక్స్‌ మరింత వణికించాడు. చేజ్‌ (7)ను బెస్‌ సూపర్‌ త్రోతో రనౌట్‌ చేశాక మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డుపడ్డాడు. ఆ తర్వాత కూడా విండీస్‌ కష్టాలు మాత్రం ఆగలేదు. వోక్స్‌ ధాటికి టపటపా వికెట్లను కోల్పోయింది. 29వ ఓవర్‌లో కెప్టెన్‌ హోల్డర్‌ (12)ను ఎల్బీ చేసిన వోక్స్‌ ఆతర్వాత 35వ ఓవర్‌లో డౌరిచ్‌ (8), కార్న్‌వాల్‌ (2)లను కూడా వెనక్కి పంపడంతో విండీ్‌సపై అతడు తొలిసారి ఐదు వికెట్లను పూర్తిచేసుకున్నాడు. ఇక బ్రాడ్‌ తన స్టయిల్‌లో మ్యాచ్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. తన రెండో స్పెల్‌ తొలి బంతికే బ్లాక్‌వుడ్‌ (23)ను అవుట్‌ చేయడంతో ఆతిథ్య జట్టు సంబరాల్లో మునిగింది. బ్రాడ్‌కు ఈ మ్యాచ్‌లో ఇది పదో వికెట్‌.


బ్రాడ్‌ @ 500

టెస్టు ఫార్మాట్‌లో 500 వికెట్లు పడగొట్టిన రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా స్టువర్ట్‌ బ్రాడ్‌ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇందుకోసం అతడు అందరికన్నా ఎక్కువగా 140 టెస్టులు తీసుకున్నాడు. అలాగే ఓవరాల్‌గా తను ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్‌ కాగా,పేసర్లలో మాత్రం నాలుగోవాడు. గతంలో మెక్‌గ్రాత్‌, వాల్ష్‌, అండర్సన్‌ ఉన్నారు. ఈ క్లబ్‌లో చేరేందుకు చివరి రోజు ఆటలో మరో వికెట్‌ దూరంలో నిలిచిన అతడు బ్రాత్‌వైట్‌ను అవుట్‌ చేయడంతో తన కల నెరవేర్చుకున్నాడు.


తొలి వికెట్‌ చమిందా వాస్‌

100వ వికెట్‌ తిసార పెరీర

200వ వికెట్‌ మైకేల్‌ క్లార్క్‌

300వ వికెట్‌ క్రిస్‌ రోజర్స్‌

400వ వికెట్‌ టామ్‌ లాథమ్‌

500వ వికెట్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌


  • ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో ముందుగా ఫీల్డింగ్‌ చేసిన జట్టు ఇప్పటిదాకా గెలవకపోవడం గమనార్హం.
  • ఇంగ్లండ్‌ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక (79) వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రాడ్‌. అండర్సన్‌ (78)ను అధిగమించాడు.
  • మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీ్‌సలో మొత్తం 50 వికెట్లను పేసర్లే తీయడం 1912 తర్వాత ఇంగ్లండ్‌కిదే తొలిసారి.
  • మూడు టెస్టుల సిరీస్‌ లో తొలి మ్యాచ్‌ను ఓడినా సిరీ్‌సను గెలవడం ఇంగ్లండ్‌కిది ఐదోసారి.


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 369; విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్‌. 

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 226/2 డిక్లేర్డ్‌; విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (ఎల్బీ) బ్రాడ్‌ 19; క్యాంప్‌బెల్‌ (సి) రూట్‌ (బి) బ్రాడ్‌ 0; రోచ్‌ (సి) బట్లర్‌ (బి) బ్రాడ్‌ 4; హోప్‌ (సి) బ్రాడ్‌ (బి) వోక్స్‌ 31; బ్రూక్స్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 22; చేజ్‌ (రనౌట్‌) 7; బ్లాక్‌వుడ్‌ (సి) బట్లర్‌ (బి) బ్రాడ్‌ 23; హోల్డర్‌ (ఎల్బీ) వోక్స్‌ 12; డౌరిచ్‌ (ఎల్బీ) వోక్స్‌ 8; కార్న్‌వాల్‌ (ఎల్బీ) వోక్స్‌ 2; గాబ్రియెల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 37.1 ఓవర్లలో 129 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-6, 3-45, 4-71, 5-79, 6-87, 7-99, 8-117, 9-119, 10-129. బౌలింగ్‌: అండర్సన్‌ 8-4-18-0; బ్రాడ్‌ 8.1-1-36-4; వోక్స్‌ 11-0-50-5; ఆర్చర్‌ 10-1-24-0. 

Advertisement
Advertisement
Advertisement