సెల్ఫ్ ఐసోలేషన్‌లో లేకుంటే.. రూ. 10 లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2020-09-21T07:33:39+05:30 IST

కరోనా పాజిటివ్ వచ్చిన వారు నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేల బ్రిటిష్ పౌండ్ల

సెల్ఫ్ ఐసోలేషన్‌లో లేకుంటే.. రూ. 10 లక్షల జరిమానా!

లండన్: కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేల బ్రిటిష్ పౌండ్ల(రూ. 9 లక్షల 54 వేలు) వరకు జరిమానా విధించనున్నట్టు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా హెచ్చరించారు. యూకేలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్‌లో లేని వారికి, కరోనా సోకిన ఉద్యోగులతో రహస్యంగా పని చేయించుకునే యాజమాన్యాలకు వెయ్యి నుంచి పది వేల పౌండ్ల వరకు జరిమానా విధించనున్నట్టు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 28 నుంచి అమలులోకి రానున్నట్టు ఆయన చెప్పారు. 


మరోపక్క తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగులు ఈ ఆదేశాల వల్ల నష్టపోకుండా వారికి సిక్ పేతో పాటు 500 పౌండ్ల(రూ. 47,570) ఆర్థిక సహాయాన్ని అందించనున్నామని పేర్కొన్నారు. యూకేలో ప్రస్తుతం మహమ్మారి రెండో వేవ్‌ను చూస్తున్నామని.. ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా.. యూకేలో ఆరుగురు కంటే ఎక్కువ గుమిగూడకూడదని గత సోమవారం ప్రభుత్వం ఆదేశించింది. ఇక యూకేలో ఇప్పటివరకు మొత్తం 3,94,257 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 41,777 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-09-21T07:33:39+05:30 IST