ఇటలీతో అమీతుమీకి ఇంగ్లండ్‌ సై

ABN , First Publish Date - 2021-07-09T08:27:58+05:30 IST

యూరో కప్‌లో ఇంగ్లండ్‌ జట్టు అదరగొడుతోంది. అద్వితీయ ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారిగా ఈ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇటలీతో అమీతుమీకి  ఇంగ్లండ్‌ సై

సెమీస్‌లో  డెన్మార్క్‌పై గెలుపు జూ యూరో కప్‌

లండన్‌: యూరో కప్‌లో ఇంగ్లండ్‌ జట్టు అదరగొడుతోంది. అద్వితీయ ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారిగా ఈ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బుధ వారం అర్ధరాత్రి డెన్మార్క్‌తో జరిగిన సెమీఫైనల్లో 2-1తో ఇంగ్లండ్‌ గెలిచింది. ఎక్స్‌ట్రా సమయం (104 నిమిషం)లో కెప్టెన్‌ హ్యారీ కేన్‌ పెనాల్టీ కిక్‌తో జట్టు సంబరాలు ఆకాశా న్నంటాయి. ఓవరాల్‌గా 1966 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఓ మేజర్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. అప్పటి నుంచి 15 వరల్డ్‌కప్‌లు, తొమ్మిది యూరో కప్‌ల్లో పాల్గొన్నా ఈ దశ వరకు చేరలేకపోయింది. గతంలో 1968, 1996 యూరో టోర్నీల్లో ఇంగ్లండ్‌ సెమీస్‌ వరకు చేరి నిష్క్ర మించింది. ఆదివారం స్థానిక వెంబ్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌-ఇటలీ మధ్య తుదిపోరు జరుగుతుంది.


అదృష్టం కూడా తోడైంది..

సెమీస్‌కు చేరే క్రమంలో ప్రత్యర్థి జట్లకు ఇంగ్లండ్‌ ఒక్క గోల్‌ను కూడా ఇవ్వలేదు. 60వేల మంది ప్రేక్షకుల మధ్య అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ సెమీస్‌లోనూ ఇంగ్లండ్‌ పదేపదే డెన్మార్క్‌ గోల్‌పోస్టుపై దాడికి దిగింది. అయితే వారి డిఫెన్స్‌ మాత్రం అడ్డుగోడలా నిలచింది. మరోవైపు 30వ నిమిషంలో డామ్స్‌గార్డ్‌ 25 గజాల దూరం నుంచి సంధించిన సూపర్‌ ఫ్రీ కిక్‌తో డెన్మార్క్‌ ఖాతా తెరిచింది. తాజా టోర్నీలో ఇదే తొలి ఫ్రీ కిక్‌ గోల్‌ కావడం విశేషం. దీంతో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే డెన్మార్క్‌ తప్పిదం ఇంగ్లండ్‌ పాలిట వరమైంది. 39వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్‌ బుకాయో సాకా బైలైన్‌ నుంచి తన్నిన బంతిని డెన్మార్క్‌ కెప్టెన్‌ సిమన్‌ కేర్‌ గోల్‌ పోస్టు ముందు అడ్డుకోవాలని చూశాడు.


ఈ క్రమంలో బంతి అతడి కాలికి తగిలి సెల్ఫ్‌ గోల్‌గా మారడంతో స్కోరు సమమైంది. ఇక ద్వితీయార్ధంలో మరో గోల్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లింది.  ఇక్కడా ఇంగ్లండ్‌ను అదృష్టం వరించింది. డెన్మార్క్‌ గోల్‌పోస్టుకు అతి సమీపంలో ఇంగ్లండ్‌ మిడ్‌ఫీల్డర్‌ స్టెర్లింగ్‌ను కాస్పర్‌ కాలితో అడ్డుకున్నాడు. దీంతో 104వ నిమిషంలో ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్‌ అవకాశం దక్కింది. హ్యారీ కేన్‌ షాట్‌ను మొదట డెన్మార్క్‌ కీపర్‌ అడ్డుకున్నా బంతి తిరిగి కేన్‌ వైపే వచ్చింది. దీంతో మరో ప్రయత్నంలో దాన్ని గోల్‌గా మలిచిన అతడు తమ టీమ్‌కు అతి గొప్పవిజయాన్నందించాడు.

Updated Date - 2021-07-09T08:27:58+05:30 IST