ఇంగ్లండ్‌.. అదే జోరు

ABN , First Publish Date - 2020-07-25T06:20:20+05:30 IST

వెస్టిండీ్‌సతో జరుగుతున్న నిర్ణాయక టెస్టులో ఇంగ్లండ్‌ మరోసారి అదిరే ఆటను ప్రదర్శిస్తోంది. స్వల్ప స్కోరుకే వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రత్యర్థిపై...

ఇంగ్లండ్‌.. అదే జోరు

సెంచరీకి చేరువలో పోప్‌ 

తొలి ఇన్నింగ్స్‌ 258/4  

బట్లర్‌, బర్న్స్‌ అర్ధసెంచరీలు

వెస్టిండీ్‌సతో మూడో టెస్టు


ఫామ్‌లో ఉన్న సిబ్లే తొలి ఓవర్‌లోనే అవుట్‌.. కెప్టెన్‌ జో రూట్‌దీ అదే పేలవ ప్రదర్శన.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌ కూడా మూగబోయింది.. 122 రన్స్‌కే 4 వికెట్లు ఫట్‌.. ఇలా క్లిష్ట పరిస్థితిలో నిలిచిన ఇంగ్లండ్‌ను ఒల్లీ పోప్‌, బట్లర్‌ శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దీంతో మూడో టెస్టు తొలిరోజు.. ఆరంభంలో తడబడి, తర్వాత పుంజుకున్న ఆతిథ్య జట్టు ప్రస్తుతం భారీస్కోరుపై కన్నేసింది.


మాంచెస్టర్‌: వెస్టిండీ్‌సతో జరుగుతున్న నిర్ణాయక టెస్టులో ఇంగ్లండ్‌ మరోసారి అదిరే ఆటను ప్రదర్శిస్తోంది. స్వల్ప స్కోరుకే వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్‌ సిబ్లే (0), కెప్టెన్‌ రూట్‌ (17), స్టోక్స్‌ (20) విఫలమైనా ఒల్లీ పోప్‌ (91 బ్యాటింగ్‌), జోస్‌ బట్లర్‌ (56 బ్యాటింగ్‌) తమదైన ప్రదర్శనతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. వీరి మధ్య అజేయంగా 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. మరో ఓపెనర్‌ జో బర్న్స్‌ (57) అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ జట్టులో సామ్‌ కర్రాన్‌, క్రాలే స్థానాల్లో ఆర్చర్‌, అండర్సన్‌కు చోటిచ్చారు.


బౌలర్ల హవా.. బర్న్స్‌ ఒంటరి పోరాటం

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలమైనా.. టాస్‌ గెలిచిన విండీస్‌ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీని ఫలితం ప్రారంభ ఓవర్‌లోనే వచ్చింది. రెండో టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న సిబ్లేను పేసర్‌ కీమర్‌ రోచ్‌ ఆరో బంతికే ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత కూడా రోచ్‌ బౌన్సర్లతో పాటు హోల్డర్‌, స్పిన్నర్‌ కార్న్‌వాల్‌ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టారు. అటు రూట్‌ అనవసర పరుగు కోసం వెళ్లి రోస్టన్‌ చేజ్‌ విసిరిన డైరెక్ట్‌ త్రోతో రనౌటయ్యాడు. మరోవైపు ఓపెనర్‌ జో బర్న్స్‌ మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్‌ కాపాడుకున్నాడు. దీంతో 66/2 స్కోరుతోజట్టు లంచ్‌ విరామానికి వెళ్లింది. కానీ బ్రేక్‌ తర్వాత ఇంగ్లండ్‌ రెండు కీలక వికెట్లను కోల్పోవడంతో గట్టి ఝలక్‌ తగిలింది. నాలుగో నెంబర్‌లో బరిలోకి దిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను ఓఅద్భుత ఇన్‌స్వింగర్‌తో రోచ్‌ బౌల్డ్‌ చేశాడు. మరోవైపు బర్న్స్‌ నిలకడను ప్రదర్శిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే నిలదొక్కుకుంటున్న దశలో అతడిని స్పిన్నర్‌ రోస్టన్‌ చేజ్‌ దెబ్బతీశాడు. స్లిప్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను కార్న్‌వాల్‌ నేర్పుగా పట్టేశాడు. టీ విరామానికి ఇంగ్లండ్‌ 131/4 స్కోరుతో ఉంది.


ఆదుకున్న పోప్‌, బట్లర్‌

చివరి సెషన్‌లో మాత్రం పోప్‌, బట్లర్‌ సాధికారిక ఆటతీరుతో విండీస్‌ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. పోప్‌ ఫిఫ్టీ సాధించగా ఫామ్‌ను అందిపుచ్చుకుంటూ బట్లర్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతడు కార్న్‌వాల్‌ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో ధాటిని ప్రదర్శించాడు. అంతేకాకుండా 15 ఇన్నింగ్స్‌ల విరామం తర్వాత బట్లర్‌ అర్ధసెంచరీ పూర్తి చేయగలిగాడు. ఈ జోడీ సమన్వయ బ్యాటింగ్‌తో అటు స్కోరు కూడా చూస్తుండగానే 250 దాటింది. అయితే మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలిన దశలో వెలుతురు లేమితో ఆటను ముగించారు.


స్కోరుబోర్డు 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: జో బర్న్స్‌ (సి) కార్న్‌వాల్‌ (బి) చేజ్‌ 57; డామ్‌ సిబ్లే (ఎల్బీ) రోచ్‌ 0; జో రూట్‌ (రనౌట్‌) 17; బెన్‌ స్టోక్స్‌ (బి) రోచ్‌ 20; ఒల్లీ పోప్‌ (బ్యాటింగ్‌) 91; జోస్‌ బట్లర్‌ (బ్యాటింగ్‌) 56; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 85.4 ఓవర్లలో 258/4. వికెట్ల పతనం: 1-1, 2-47, 3-92, 4-122. బౌలింగ్‌: కీమర్‌ రోచ్‌ 18.4-2-56-2; గాబ్రియెల్‌ 18-4-47-0; హోల్డర్‌ 20-5-45-0; కార్న్‌వాల్‌ 21-4-71-0; రోస్టన్‌ చేజ్‌ 8-2-24-1.

Updated Date - 2020-07-25T06:20:20+05:30 IST