రసపట్టులో..

ABN , First Publish Date - 2020-07-20T09:11:03+05:30 IST

ఇంగ్లండ్‌-వెస్టిండీ్‌స మధ్య రెండో టెస్ట్‌ రసకందాయంగా మారింది. పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌ పట్టుదల చూస్తే నాలుగోరోజు టీ విరామం వరకు మ్యాచ్‌ డ్రా దిశగానే ...

రసపట్టులో..

ఆఖర్లో దెబ్బకొట్టిన బ్రాడ్‌

వెస్టిండీస్‌ 287 ఆలౌట్‌

బ్రాత్‌వైట్‌, బ్రూక్స్‌, చేజ్‌ హాఫ్‌ సెంచరీలు 

ఇంగ్లండ్‌ 37/2

ఈ టెస్ట్‌ నెగ్గి సిరీస్‌ రేసులో నిలవాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఆడితే..డ్రా చేసుకొనే లక్ష్యంతో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేసింది..దాంతో రెండో టెస్ట్‌ నాలుగోరోజు ఆట టీ విరామం వరకు ప్రశాంతంగానే సాగింది..అయితే ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రాడ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టు గెలుపు ఆశలకు రెక్కలు తొడిగాడు.. ఆనక విండీస్‌ బౌలర్లు కూడా విజృంభించి రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ రసపట్టులో పడింది. 


మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌-వెస్టిండీ్‌స మధ్య రెండో టెస్ట్‌ రసకందాయంగా మారింది. పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌ పట్టుదల చూస్తే నాలుగోరోజు టీ విరామం వరకు మ్యాచ్‌ డ్రా దిశగానే సాగుతున్నట్టు కనిపించింది. కానీ చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌ పేసర్లు.. ముఖ్యంగా బ్రాడ్‌ కొత్త బంతితో గడగడలాడించాడు. దాంతో పరిస్థితి ఒక్కసారి మారిపోయి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (165 బంతుల్లో 8 ఫోర్లతో 75), బ్రూక్స్‌ (137 బంతుల్లో 11 ఫోర్లతో 68), చేజ్‌ (85 బంతుల్లో 7 ఫోర్లతో 51) హాఫ్‌ సెంచరీలు చేశారు. బ్రాడ్‌ (3/66), వోక్స్‌ (3/42) మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌కు 182 పరుగుల ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 469/9 (డిక్లేర్డ్‌) స్కోరు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ ఆదివారం ఆట ఆఖరికి రెండు వికెట్లకు 37 పరుగులు చేసింది. మొత్తంగా ఆ జట్టు 219 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.  

తొలి సెషన్‌లో ఆచితూచి..:  రెండోరోజు స్కోరు 32/1తో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్రాత్‌వైట్‌, జోసెఫ్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. అడపాదడపా షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. ఈక్రమంలో 17వ ఓవర్లో క్రిస్‌ వోక్స్‌ బంతి జోసెఫ్‌ బ్యాట్‌ను ముద్దాడుతూ రెండు,మూడు స్లిప్‌ల మధ్యలో క్యాచ్‌గా వెళ్లినా అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న వోక్స్‌, జాక్‌ క్రాలేలో ఒక్కరూ పట్టుకోలేకపోయారు. బ్రాడ్‌ ఓవర్లోనూ స్లిప్‌ ఫీల్డర్‌ క్యాచ్‌ పట్టలేకపోవడంతో మరోసారి బతికిపోయిన జోసెఫ్‌ రెండు బౌండరీలు బాదాడు. అయితే నెమ్మదిగా పురోగమిస్తున్న ఈ భాగస్వామ్యాన్ని ఆఫ్‌ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ విడదీశాడు. అతడు వేసిన ఫుల్‌లెంగ్త్‌ డెలివరీ జోసెఫ్‌ బ్యాట్‌ను ముద్దాడుతూ రాగా షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పోప్‌ ఒంటిచేత్తో చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు. వీరు రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. బ్రాత్‌వైట్‌కు హోప్‌ జతకలవగా లంచ్‌ సమయానికి వెస్టిండీస్‌ 2 వికెట్లకు 118 పరుగులు చేసింది. 

బ్రాడ్‌ విజృంభణ: కుదురుగా ఆడుతున్న బ్రాత్‌వైట్‌, షాయ్‌ హోప్‌ భాగస్వామ్యాన్ని పేసర్‌ కర్రాన్‌ విడదీశాడు. ఓ ఆఫ్‌కట్టర్‌తో కీపర్‌ బట్లర్‌ క్యాచ్‌ ద్వారా హోప్‌ (25)ను పెవిలియన్‌కు చేర్చాడు. మరోవైపు బౌండరీతో బ్రాత్‌వైట్‌ అర్ధ శతకం పూర్తి చేయగా..హోప్‌ స్థానంలో వచ్చిన బ్రూక్స్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు. కానీ సెంచరీ దిశగా సాగుతున్న బ్రాత్‌వైట్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో 76 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వెస్టిండీస్‌ 227/4తో టీ విరామానికి వెళ్లింది. అనంతరం పేసర్‌ బ్రాడ్‌ విజృంభించి బ్రూక్స్‌, గత టెస్ట్‌ హీరో బ్లాక్‌వుడ్‌ (0), డౌరిచ్‌ (0)లను అవుట్‌ చేసి వెస్టిండీ్‌సను దెబ్బ కొట్టాడు. తర్వాత చేజ్‌ మినహా మిగిలిన వారెవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయినా, ఫాలోఆన్‌ (270)ను దాటేసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే విండీస్‌ చివరి 6 వికెట్లను 45 పరుగుల తేడాతో కోల్పోయి కష్టాల్లో పడింది.


సిబ్లే ఉమ్మి రాశాడు!

కరోనా వైర్‌సతో బంతికి ఉమ్మి పూయడాన్ని ఐసీసీ నిషేధించింది. కానీ నాలుగో రోజు ఆటలో భోజన విరామానికి ముందు ఇంగ్లండ్‌ ఆటగాడు డొమినిక్‌ సిబ్లే అనుకోకుండా బంతికి ఉమ్మి రాశాడు. 42వ ఓవర్‌ వేసేందుకు స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ రాగా..అప్పటికి తన చేతిలో ఉన్న బంతికి సిబ్లే ఉమ్మి పూశాడు. విషయాన్ని గమనించిన అంపైర్‌ మైకేల్‌ గాఫ్‌..బంతిని క్రిమిసంహారిణితో శుభ్రం చేసి బెస్‌కు అందించాడు. 


సంక్షిప్తస్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 469/9 (డిక్లేర్డ్‌); స్టోక్స్‌ 176, సిబ్లే 120, చేజ్‌ (5/172); వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 287 ఆలౌట్‌; (బ్రాత్‌వైట్‌ 75, బ్రూక్స్‌ 68, రోస్టన్‌ చేజ్‌ 51, జోసెఫ్‌ 32, హోప్‌ 25, క్రిస్‌ వోక్స్‌ 3/42, స్టువర్ట్‌ బ్రాడ్‌ 3/66, కర్రాన్‌ 2/70, స్టోక్స్‌ 1/29,  బెస్‌ 1/67); ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 37/2 (స్టోక్స్‌ 16 బ్యాటింగ్‌, రూట్‌ 8 బ్యాటింగ్‌, రోచ్‌ 2/14).  

Updated Date - 2020-07-20T09:11:03+05:30 IST