ఆంగ్ల మాధ్యమం కోసం..టీచర్లకు ప్రత్యేక శిక్షణ!

ABN , First Publish Date - 2022-01-20T06:57:31+05:30 IST

ఆంగ్ల మాధ్యమం అమలు కోసం రాష్ట్రంలోని టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తామని రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.....

ఆంగ్ల మాధ్యమం కోసం..టీచర్లకు ప్రత్యేక శిక్షణ!

1వ తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం 

తెలుగు మాధ్యమం కూడా ఉంటుంది

విద్యార్థులు దేనిలోనైనా చేరొచ్చు

ఒకే పుస్తకంలో తెలుగు, ఇంగ్లిష్‌ పాఠాలు

ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం

త్వరలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం

మన ఊరు-మనబడి తొలిదశలో 9,123 స్కూళ్ల ఎంపిక

విలేకరుల ఇష్టాగోష్ఠిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఆంగ్ల మాధ్యమం అమలు కోసం రాష్ట్రంలోని టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తామని రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఒకటవ తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియంను ప్రారంభిస్తామని, అన్ని స్కూళ్లల్లో తెలుగు మీడియం విద్య కూడా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.  తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియంలో చేరే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయానికే ప్రాధాన్యమిస్తామన్నారు. ఇంగ్లిష్‌ మీడియం, ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం వంటి పలు అంశాలపై మంత్రి బుధవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే విధి విధానాలపై కేబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకటవ తరగతి కాకుండా ఇతర తరగుతుల వారు కూడా తాము ఇంగ్లిష్‌ మీడియంలోకి మారాలని ముందుకొస్తే.. వారి విషయంలో ఏ చేయాలనే అంశంపై సబ్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధించడానికి వీలుగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 1350 మంది ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన వారిలో ఇప్పటికే 200 మంది టీచర్లు మెంటార్లుగా మారారని తెలిపారు. దశల వారీగా అందరికీ ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు.


విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుంది.. 

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించినా.. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుందని మంత్రి సబిత చెప్పారు.  అయితే దేనిలో చేరాలనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది కొత్తగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారని, ఇంగ్లిష్‌ మీడియంతో విద్యార్థుల సంఖ్య  పెరుగుతుందని అంచనా వేశారు. 


ఇంగ్లిష్‌ మీడియంలో 10 లక్షల మంది.. 

రాష్ట్రంలోని గురుకులాలు, వెల్ఫేర్‌, ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వ విభాగంలో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 10 లక్షల మంది ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్నారని చెప్పారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆంగ్లమాధ్యమంలో మరింత మంది విద్యార్థులు పెరుగుతారని అభిప్రాయపడ్డారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలన్న కోరికతో ఉన్నారని, ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ మీడియంతోనే సాధ్యం అవుతుందని వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.


మిర్రర్‌ విధానంలో పాఠ్యపుస్తకాలు!

ఆంగ్ల మాధ్యమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలనూ సిద్ధం చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఇంగ్లిష్‌, తెలుగు మీడియం ఒకే పుస్తకంలో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. అంటే పుస్తకంలోని ఒక పేజీలో తెలుగు మీడియం, మరో పేజీలో ఇంగ్లిష్‌ మీడియం(మిర్రర్‌ విధానం)లో పాఠ్యాంశ సమాచారం ఉంటుందని వెల్లడించారు. 2, 3 నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టే అంశంలో కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొంటూ.. మంచి సూచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. కానీ కొందరు మాత్రం కావాలనే విమర్శలను చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయంతో ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులు వస్తారన్నారు. 


పాఠశాలల పరిసరాల్లోకి 

అంగన్‌వాడీలు

అంగన్‌వాడీ స్కూళ్లను ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అంగన్‌వాడీలో చేరే విద్యార్థులు తర్వాత నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించిన తర్వాత, అంగన్‌వాడీ, ప్రభుత్వ స్కూల్‌లో చేరడానికి మధ్యలో ప్రత్యేక తరగతులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మన ఊరు-మన బడి పథకం కింద మొదటి దశలో 9123 పాఠశాలలను ఎంపిక చేశామని మంత్రి సబిత చెప్పారు. మండలం యూనిట్‌గా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఈ తొలి దశలో ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలల అభివృద్ధికి రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందన్నారు. 2, 3 నెలల్లోనే ఈ పనులను పూర్తి చేస్తామని, మిగిలిన పాఠశాలలను తర్వాత దశల్లో ఎంపిక చేస్తామని వివరించారు.  


ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం!

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ చట్టం లేదని, ఉత్తర్వులతోనే నియంత్ర ణ కొనసాగుతోందని చెప్పారు. దాంతో అనేక సార్లు కోర్టుల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఫీజుల విషయంలో ఇప్పటికే తిరుపతిరావు కమిటీ నివేదిక ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్‌ సబ్‌ కమిటీ తగిన సూచనలు చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఈ నియామకాల కోసం ఓ విధానాన్ని ఎంపిక చేసి, దాని ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. మహిళా యూనివర్సిటీని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సబిత కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-01-20T06:57:31+05:30 IST