ఎనిమిది పదుల వి.వి.

ABN , First Publish Date - 2020-11-02T06:28:43+05:30 IST

కవి, సాహిత్య విమర్శకుడు, వ్యాసకర్త, సంపాదకుడు, తెలుగు అధ్యాపకుడు, జనాకర్షక వక్త, అనువాదకుడు, ప్రజా ఉద్యమ సమర్థకుడు, విప్లవోద్యమ ప్రతినిధి, రాజ్య నిర్బంధానికి లక్ష్యం,...

ఎనిమిది పదుల వి.వి.

కవిత్వ, విశ్లేషణా, వక్తృత్వ, నిర్మాణ సామర్థ్యాలన్నిటినీ ఆయన ప్రజా ఉద్యమాల ప్రచారానికీ, సమర్థనకూ సంపూర్ణంగా వాడారు. నక్సల్బరీ మార్గపు విప్లవోద్యమానికి తన కలాన్నీ గళాన్నీ అంకితం చేశారు. విప్లవోద్యమ స్వరంగా, వ్యాఖ్యాతగా, ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో ఒకవైపు లక్షలాది పీడిత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మరొకవైపు రాజ్య ఆగ్రహానికీ, వ్యవస్థా నిర్వాహకుల, సమర్థకుల ఆగ్రహానికీ గురయ్యారు


కవి, సాహిత్య విమర్శకుడు, వ్యాసకర్త, సంపాదకుడు, తెలుగు అధ్యాపకుడు, జనాకర్షక వక్త, అనువాదకుడు, ప్రజా ఉద్యమ సమర్థకుడు, విప్లవోద్యమ ప్రతినిధి, రాజ్య నిర్బంధానికి లక్ష్యం, ఎనభై సంవత్సరాల జీవితంలో పది సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన వ్యక్తి, పోలీసుల ఆరోపణలలో ఒక్కటంటే ఒక్కటి కూడ రుజువు కాక, న్యాయస్థానాలే నిర్దోషిగా విడుదల చేసిన వ్యక్తి... ఎన్ని అనుకూల విశేషణాలైనా వాడవచ్చు. ఐదు దశాబ్దాల రకరకాల వేధింపులలో, కేసులలో, హత్యా ప్రయత్నాలలో, వ్యక్తిత్వ హననంలో రాజ్యమూ ప్రత్యర్థులూ మరిన్ని ప్రతికూల, భయంకర విశేషణాలు కూడ వాడి ఉండవచ్చు. కాని ఏ విశేషణాలూ వివరణలూ లేకుండానే ప్రతి ఒక్కరికీ తెలిసిన విశాల స్నేహశీలి, నిరంతర సృజనకర్త వరవరరావు. 


ఏడవ నిజాం పాలనలో, పాత వరంగల్‌ జిల్లాలో, సాలా ర్జంగ్‌ జాగీరు గ్రామం చిన్నపెండ్యాలలో 1940 నవంబర్‌ 3న పదిమంది సంతానంలో చివరివాడుగాపుట్టి, వరించిన వారిలోకెల్లా వరించినవాడని పేరు పెట్టించుకున్న ఆయన జీవితంలోనూ సాహిత్యంలోనూ ప్రయాణించిన కాలమూ దూరమూ సుదీర్ఘమైనవి. కవిత్వం, సాహిత్య విమర్శ, వక్తృత్వం, సంఘ నిర్మాణం, సామాజిక, రాజకీయ విశ్లేషణ, అను వాదం--చేపట్టిన పనులు ఎన్నో. అన్నిటికన్నీ ప్రభావశీల వ్యక్తిత్వాన్ని వికసించి విజయం సాధించినవే. 


సొంత అన్నల సాహిత్య, నిజాం వ్యతిరేక, బ్రిటిష్‌ వ్యతిరేక జాతీయవాద భావనల ప్రభావం, ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభల నుంచి కమ్యూనిస్టు పార్టీ సాయుధ దళ నాయకుడి దాకా ఎదిగిన జ్ఞాతి సోదరుడి ప్రభావం ఆయన బాల్య కౌమారాల సాహిత్య, రాజకీయ పునాదులు. పది పన్నెండేళ్ల వయసులోనే కవిత్వం అల్లడం, కుదురైన చేతి రాతే అర్హతగా లిఖిత సాహిత్య పత్రికలు రాయడం మొద లైనా, పదిహేడేళ్ల వయసులో తెలుగు స్వతంత్రలో మొదటి అచ్చయిన కవిత ఆధునిక కవిగా పేరు తెచ్చింది. ఆ 1957 కవిత నుంచి 2017లో ప్రచురితమైన రెండు సంపుటాల సమగ్ర కవిత్వం దాకా పద్నాలుగు కవిత్వ సంపుటాలు, రెండు కావ్యాలు, ఒక పాటల సంపుటం ఆరు దశాబ్దాల సామాజిక చరిత్రకు ప్రజాప్రత్యామ్నాయ దృక్పథం నుంచి సమకాలిక నిరంతర కవితా వ్యాఖ్యానం. 


1958 నుంచి 1964 దాకా రాసిన కవిత్వంతో మొట్టమొ దటి కవితా సంపుటం 1968లో వెలువడినప్పుడు, వెనుక అట్టమీద ప్రచురణకర్తలు (స్వేచ్ఛాసాహితి, హనుమకొండ) ‘‘ఫ్రీవర్స్‌ కవులలో సామాజిక ప్రగతివాదానికి నాయకుడు వరవరరావు. బాధా బానిసత్వమూ ఎరగని లోకానికి అతడి పరుగు. అంతర్జాతీయ స్పందనకీ సమతా సౌజన్యతకీ అతడు కూడలి. ఊపిరీ ఉద్యమమూ కవిత్వం అతడికి. మంచీ మమతా మనిషీ సమష్టి మనుగడ అతడి మతం. భవిష్యత్తు మీది విశ్వాసం అతడి జీవనాడి. బుద్ధీ వెన్నె ముకా అతడి భావనకు ఊపిరితిత్తులు. చల్లారుతున్న తరానికి చలినెగళ్లు అతడి కవిత్వం’’ అని రాశారు. అప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకవి తొలి సంపుటంలో ప్రచురణకర్తలు చేసిన ఈ అంచనాలోని ప్రతి మాటా అక్షరసత్యమని తర్వాతి ఐదున్నర దశాబ్దాలు అడుగడుగునా రుజువయింది. 


కవిత్వం తర్వాత వరవరరావు చేపట్టిన ప్రక్రియ వ్యాసం. సాహిత్య విమర్శనూ, సామాజిక రాజకీయ విశ్లేషణనూ విస్తారంగా నిర్వహించగల సాధనంగా ఆయన ఈ ప్రక్రియను 1960లో ఒక సాహిత్య చర్చతో ప్రారంభిం చారు. శ్రీశ్రీని ఉద్దేశించి ‘‘సినిమాల చిట్టడివిలో చిక్కు కున్న మహాకవి మళ్లీ కలం పట్టాలని ప్రార్థిస్తూ’’ చేకూరి రామారావు ఒక కవిత రాసినప్పుడు, వెంటనే ‘శ్రీశ్రీ వైపు చూడకపోతే మీరో మరొకరో ఆ పనికి ఎందుకు పూను కోరు’ అనే వ్యాసంతో ‘తెలుగు స్వతంత్ర’లోనే వ్యాస ప్రక్రియ లోకి ప్రవేశించారు వరవరరావు. ఆ తర్వాత అరవై సంవ త్సరాలలో ఆయన రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలు ఎనిమిది సంపుటాలుగా, సామాజిక రాజకీయ విశ్లేషణ వ్యాసాలు తొమ్మిది సంపుటాలుగా వెలువడ్డాయి. పుస్తకాలుగా సంకలితంకాని, పత్రికల్లో మిగిలిపోయిన వ్యాసాలు వెయ్యి పైనే ఉంటాయి. ‘తెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవల: సామాజిక, సాహిత్య సంబంధాల విశ్లేషణ’ అని ఆయన రాసిన పిహెచ్‌డి సిద్ధాంత వ్యాసం తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో మైలురాయి. 


ఇరవై సంవత్సరాలకు పైగా వరంగల్‌ సికెఎం కాలేజీలో సాగిన అధ్యాపన కృషి ఉపన్యాసంలో పునాది వేయగా, వేలాది మంది విద్యార్థులకు తరగతి గదిలోపల పాఠాలు చెప్పడంతో పాటు, 1968 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టి ఆయన బహిరంగ సభల ఉపన్యాసకుడిగా, వక్తగా మారారు. విప్లవోద్యమంతో, విప్లవ రచయితల సంఘంతో అనుబంధం తర్వాత యాబై సంవత్సరాలలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపన్యసించని ప్రాంతం లేదు. దేశవ్యాప్తంగా కూడ ప్రధాన నగరాలన్నిటా ఆయన వక్తగా సుప్రసిద్ధుయ్యారు. గత యాబై సంవత్సరాలలో పది సంవత్సరాల జైలు జీవితం మినహాయిస్తే, కనీసం వెయ్యి సభల్లోనైనా ఆయన మాట్లాడి ఉంటారు. ‘‘మంచివాని కంఠం కంచయి మోగాలి, మంచివాని కష్టం కనకమై పండాలి’’ అని 1958లో ‘శిశిరోషస్సు’ కవితలో ఆయనే రాసినట్టుగా ఆయన కంఠం మోగింది. 


డిగ్రీ రెండో సంవత్సరంలోనే వరవరరావు నిర్మాణదక్షత మొదలయింది. కాళోజీ రామేశ్వరరావు, కాళోజీ నారాయణ రావు 1958లో తాము ప్రారంభించిన వారంవారం సాహిత్య సమావేశం ‘మిత్రమండలి’కి తొలి కన్వీనర్‌గా వరవరరావును ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాత్రి కవితాసంకలనం (1964)లో, సృజన ఆధునిక సాహిత్య వేదిక (1966)లో, తిరుగబడు కవులు (1969)లో, విప్లవ రచయితల సంఘం (1970)లో, ఆ తర్వాత యాబై సంవత్సరాలలో అనేక విద్యార్థి, యువజన, సాహిత్య, సాంస్కృతిక, హక్కుల నిర్మాణాలలో ఆయన చోదకశక్తిగా, మార్గదర్శిగా ఉన్నారు. గత ఆరు దశాబ్దాల తెలుగు సాహిత్య, సామాజిక చరిత్ర సాగించిన నిర్మాణాత్మక యత్నాల ప్రయాణం పొడవునా ఆయన కృషి కనబడుతుంది.


ఆయన నిర్మాణ దక్షతను పద్దెనిమిదో ఏట గుర్తించిన కాళోజీ సోదరులతోపాటు, ముప్పయో ఏట ప్రతికూలంగా గుర్తించిన నోరి నరసింహశాస్త్రి, ముప్పై రెండో ఏట అను కూలంగా గుర్తించిన ప్రభాకర్‌, రహిల వ్యాఖ్యలు యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం కలుగు తుంది. అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించి 1970 జూలై 4న విరసం ఏర్పాటైన నాలుగో రోజున ఆంధ్ర ప్రభ దినపత్రిక ఈ పరిణామాల మీద నోరి నరసింహ శాస్త్రి అభిప్రాయాలు ప్రకటించింది. ‘‘సాహిత్య నక్సలైట్లు’’ అనే మాట మొదటిసారి ఉపయోగించిన ఆయన ఆ బహిష్కరణకు ‘‘పూర్వ కథ ఉన్నద’’ని అంటూ, విప్లవ వాది వరవరరావు సంపాదకుడైన సృజనలో శ్రీశ్రీ ఇంటర్వ్యూ, తర్వాతి సంచికలో శ్రీశ్రీపై విమర్శ ఉత్తరాలు ఈ బహిష్క రణకు పురికొల్పాయని అన్నారు. విరసం ఏర్పాటు ‘‘వాస్త వికతావాది కుటుంబరావు, విప్లవవాది వరవరరావుల విజయం’’ అని అన్నారు. 


ఆ తర్వాత రెండు సంవత్సరాలకు అప్పటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక నిర్వహించిన కొత్త కెరటాలు శీర్షికలో వరవరరావు పరిచయంగా ‘‘ప్రభాకర్‌, రహి’’ రాసిన ‘మనవాళ్లయ్య’ వ్యాసం బహుశా నవంబర్‌-డిసెంబర్‌ 1972లో అచ్చయింది. ప్రభాకర్‌ అంటే బహుశా దేవుల పల్లి ప్రభాకర్‌ రావు కావచ్చు. రహి అంటే హరి పురుషోత్తమరావు. ‘‘నిత్య హాసము, సుతిమెత్తని మూర్తి, ఆర్ద్రవాక్కు, కత్తిలాంటి దృక్పథం- వెరశి పెండ్యాల వరవరరావు. వరవరరావు ఒక మొబైల్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఢిల్లీలో ఉన్నా, జడ్చర్లలో ఉన్నా అతని వెనుక ఒక ఉద్యమం, ఒక సంస్థ ఉన్నాయన్న మాట. కొందరు-ఆమాటకొస్తే చాలమంది--సంస్థల పేరుతో చలామణీ అవుతుంటారు. వరవరరావు అలా కాదు. అతని సహజ కృత్యాలలో సంస్థ ఒకటి. అతడు సంస్థలకు నాయకుడైనా అనుచరులను పోగుచేయడు. అతని చుట్టూ ఉండేవారంతా అతని సహచరులే’’ అనీ, ‘‘వరవరరావనేది కలంపేరని కొందరి అనుమానం. ‘విప్లవం రహస్యంగా జరిగే కుట్ర మాత్రం కాదు’ అనేందుకు నిదర్శనంగానే విప్లవ చైతన్యాన్ని తన మతంగా చేసుకున్న మరునాటినుంచే గుప్త నామాల్ని, కలం పేర్లనీ వర్జించి సొంత పేరుతో కవిత రాస్తున్నాడు వరవరరావు’’ అనీ రాశారు. 


ఈ కవిత్వ, విశ్లేషణా, వక్తృత్వ, నిర్మాణ సామర్థ్యాలన్నిటినీ ఆయన ప్రజా ఉద్య మాల ప్రచారానికీ, సమర్థ నకూ సంపూర్ణంగా వాడారు. నక్సల్బరీ మార్గపు విప్లవో ద్యమానికి తన కలాన్నీ గళాన్నీ అంకితం చేశారు. విప్లవోద్యమ స్వరంగా, వ్యాఖ్యాతగా, ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో ఒకవైపు లక్షలాది పీడిత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మరొకవైపు రాజ్య ఆగ్రహానికీ, వ్యవస్థా నిర్వాహకుల, సమర్థకుల ఆగ్రహానికీ గురయ్యారు. 1973లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద మొదటి అరెస్టు నుంచి 2018 ఆగస్ట్‌ 28న భీమా కోరేగాం కేసులో అరెస్టు దాకా పద్దెనిమిదిసార్లు అరెస్టయ్యారు. ఇరవై ఐదు కేసులలో నేరారోపణలు ఎదుర్కొన్నారు. ఒక్క కేసూ రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారు. అయినా ఏడేళ్లకు పైగా జైలు జీవితం గడపవలసి వచ్చింది. ప్రస్తుత భీమా కోరేగాం కుట్రకేసు కూడ న్యాయస్థానాలు కొట్టివేయవచ్చు గాని, విచారణ ప్రారంభం కాకుండానే ఇప్పటికి రెండేళ్ళుగా జైల్లో ఉండి, దేశ చరిత్రలోనే అతి ఎక్కువ కాలం జైల్లో ఉన్న రచయితగా నిలిచిపోయారు.

ఎన్‌ వేణుగోపాల్‌

(ఈ నవంబర్‌ 3కు వరవరరావుకు ఎనబై ఏళ్లు నిండుతాయి.)


Updated Date - 2020-11-02T06:28:43+05:30 IST