కేసీఆర్‌ అవినీతిపై త్వరలో విచారణ

ABN , First Publish Date - 2022-02-13T08:13:34+05:30 IST

‘కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై వచ్చినన్ని ఆరోపణలు ఎవరి మీదా రాలేదు..

కేసీఆర్‌ అవినీతిపై త్వరలో విచారణ

సహారా, ఈఎ్‌సఐ స్కాం ఎవరు చేశారు..?..

వెలుగుబంటి సూర్యనారాయణను తీసుకువస్తాం: సంజయ్‌


పెద్దపల్లి/హైదరాబాద్‌/సంగారెడ్డి/చేర్యాల, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై వచ్చినన్ని ఆరోపణలు ఎవరి మీదా రాలేదు.. సహారా, ఈఎ్‌సఐ స్కాం ఎవరు చేశారు..? వెలుగుబంటి సూర్యనారాయణను తీసుకువస్తాం.. కేసీఆర్‌ అవినీతి మీద విచారణ ప్రారంభం కాబోతున్నది.. తన పతనం ఆరంభమైందని గ్రహించే కేసీఆర్‌.. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వే పెద్ద అవినీతిపరుడివి.. కేంద్రం అవినీతి చిట్టా నీ వద్ద ఉందా.. ఆ చిట్టాను ఎప్పుడు తీస్తావో చెప్పు.. దమ్ముంటే వారంలోగా అవినీతిని బయటపెట్టు’’ అంటూ సవాల్‌ విసిరారు. శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి వచ్చిన ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ను పరామర్శించారు.


అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ సంజయ్‌ మాట్లాడారు. రాజ్యాంగం తిరగరాయాలన్నందుకు కేసీఆర్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో పథకం ప్రకారం కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టిందా..? అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్‌.. రబీ ధాన్యం కొంటారా? లేదా..? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌ వణికిపోతారని సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఇంతకుముందు కూడా కేసీఆర్‌ ఢిల్లీ పోయి, మోదీని చూడగానే వణికిపోయారని అన్నారు. ‘‘కేసీఆర్‌ చెల్లని రూపాయి. దేశంలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఆయన్నుంచి ఏమీ కాదు’’ అని అన్నారు. బీజేపీ పిడికెడంత కూడా లేని పార్టీ అని జనగామ సభలో కేసీఆర్‌ అన్నారని, అదే జనగామలో సభ పెట్టి తమ దమ్మేందో చూపిస్తామని ప్రకటించారు. బీజేపీ అంటే కేసీఆర్‌ ఎంత భయపడుతున్నారో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను జనగామ ఆస్పత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించడమే అందుకు నిదర్శనమన్నారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న 10 మంది కార్యకర్తలను ఆయన పరామర్శించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంజయ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ శనివారం భువనగిరి సభలో కాంగ్రె్‌సకు, రాహుల్‌ గాంధీకి అనుకూలంగా మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన.. ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఇరు పార్టీలు లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నారు. ప్రధానిపై కేసీఆర్‌ చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ జిల్లా కేంద్రాల్లో ఆదివారం మీడియా, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.


కేసీఆర్‌కు అసహనం పెరిగింది: ఈటల

ప్రజల్లో బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి కేసీఆర్‌కు అసహనం పెరిగి శాడిస్టులా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లాగురువన్నపేటలో శనివారం ఆయన మాట్లాడారు. జనగామ సభలో అసహనానికిలోనైన సీఎం.. ప్రధాని మోదీ పట్ల చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. 

Updated Date - 2022-02-13T08:13:34+05:30 IST