అలరించిన దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T05:08:27+05:30 IST

నంద్యాల పట్ట్ణణంలో శుక్రవారంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. బాలాజి కాంప్లెక్స్‌ కళ్యాణ మండపంలో ఽభగవతి దేవి అలంకారంలో, కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో, సంజీవనగర్‌ కోదండ రామాలయంలో రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవార్లు దర్శనమిచ్చారు.

అలరించిన దసరా వేడుకలు
చాగలమర్రిలో సంజీవరాయ, చెన్నకేశవ ఉత్సవమూర్తుల గ్రామోత్సవం

నంద్యాల (కల్చరల్‌), అక్టోబరు 16: నంద్యాల పట్ట్ణణంలో శుక్రవారంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. బాలాజి కాంప్లెక్స్‌ కళ్యాణ మండపంలో ఽభగవతి దేవి అలంకారంలో, కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో, సంజీవనగర్‌ కోదండ రామాలయంలో రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవార్లు దర్శనమిచ్చారు. స్థానిక అమ్మవారిశాలలో వాసవీ కన్యకాపరమేశ్వరిదేవికి అమెరికన్‌ డైమండ్‌ చీరెతో అలంకరించారు, బ్రహ్మనందీశ్వరాలయంలో ఉదయం పరమేశ్వరపూజ, సాయంత్రం పార్వతీ దేవికి పూజలు చేశారు. ఆంజనేయకోదండరామస్వామి ఆలయంలో, సంజీవనగర్‌ లక్ష్మీవెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకారం, శమీదర్శనం ఏర్పాట్లు చేశారు. నిమిషాంబ ఆలయం, సుంకులా పరమేశ్వరి, తెలుగుపేటలో వెలసిన మద్దిలేటి స్వామి ఆలయంలో అమ్మవార్లు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో అమ్మ వారి శాల అధ్యక్షుడు భవనాశి శ్రీనివాస, భగవత్‌ సేవా సమాజ్‌ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, కమిటీ సభ్యులు పార్థసారథికృష్ణ, ఈవోలు వేణునాథరెడ్డి, రామాంజనేయ శర్మలు, కాళికాంబ, బ్రహ్మనందీశ్వర ఆలయాల చైర్మన్‌లు బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య, చెంచుగారి వేణుగోపాల్‌, కాళిమాత సేవాసమాజం అధ్యక్ష కార్యదర్శులు ఆరవేటి వాసు, మోదాల విజయ్‌కుమార్‌, కమిటీ సభ్యులు, కశెట్టి చంద్రశేఖర్‌, భక్తులు పాల్గొన్నారు. భక్తులు విధిగా మాస్క్‌లు ధరించి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. 

- నంద్యాల పట్టణంలో కాళికాంబ చంద్రశేఖరస్వామి దేవస్థానం, బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానం, అమ్మవారి శాల, జగజ్జననీ ఆలయంలోని ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే మద్దిలేటి స్వామి ఆలయంలో మట్టితో దుర్గామాతను ప్రతిష్టించి 9 రోజులు పూజలు చేశారు. శనివారం ఉదయం అమ్మవారికి వడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపు నిర్వహించి చిన్న చెరువులో మధ్యాహ్నం నిమజ్జనం చేశారు. పట్టణంలో శుక్రవారం సాయంత్రం భక్తులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. శమీశమయతే పాపం శమీశత్రు వినాశినీ అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని పఠిస్తూ మూడు ప్రదక్షిణలు చేశారు. పట్టణంలోని సంజీవనగర్‌ రామాలయం, బస్టాండు దగ్గరగల ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం, బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయంలో గల జమ్మిచెట్ల వద్ద భక్తులు శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం జమ్మి ఆకును ఒకరకి ఒకరికి ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నంద్యాల పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురష్కరించుకొని శుక్రవారం రాత్రి నిర్వహించిన దసరా వేషధారణలు ఆకట్టుకున్నాయి. భక్తులు శక్తి దుర్గా మాత, రక్త పింజరి, శివుడు, రాక్షషుల వేషధారణలతో అలరించారు. 

వివిధ మండలాల్లో..

పాణ్యం: దసరా నవరాత్రి ఉత్సవాలు మండలంలో ఘనంగా ముగిశాయి. దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పార్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఈవో రామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. నంద్యాల రోడ్డు వైపుగల జమ్మి చెట్టు వద్ద గ్రామోత్సవాన్ని ముగించారు. అనంతరం శమీపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రూపు దేవాలయాల ఛైర్మన్‌లు బాలశంకర్‌, సుధాకర్‌, సిబ్బంది తిరుమలయ్య, మద్దిలేటి, అర్చకులు భాస్కరయ్య పాల్గొన్నారు.

- పది ఇంద్రియాలను జయించడమే దసరా ఉద్దేశమని త్రైతసిద్ధాంత ప్రబోధసేవా సమితి అధ్యక్షుడు రామచంద్రుడు అన్నారు. భగవద్గీత ప్రచారంలో భాగంగా రెండు రోజులుగా పాణ్యంలో చేపట్టిన ప్రచారం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా భగవద్గీతపై ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. కార్యక్రమంలో మునిదాసు, కుమారాచారి, శ్రీను, గోకారి వరలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు. 

దొర్నిపాడు: మండలంలో ఆయా గ్రామాల్లోని విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొర్నిపాడు, భాగ్యనగరం, కొండాపురం, చాకరాజువేముల, రామచంద్రాపురం, గుండుపాపల తదితర గ్రామాల్లోని ఆలయాల్లో విజయదశమి పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దొర్నిపాడు, రామచంద్రాపురం గ్రామాల్లో అమ్మవారిని ఊరేగింపు చేశారు. మహిళలు తమ మొక్కు బడులు చెల్లించుకున్నారు. విజయాలు చేకూర్చాలని భక్తితో అమ్మవారికి పూజించారు. 

ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్ర వారం దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఉయ్యాలవాడలో మారెమ్మ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేయగా మాయలూరులో గంగమ్మకు, రూపనగుడిలో దుర్గమ్మ, ఇంజేడులో, బోడెమ్మనూరు గ్రామాల్లో చౌడేశ్వరీ దేవీలకు, ఆర్‌.జంబులదిన్నెలో ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అర్చకుడు కీర్తిలక్ష్మణ స్వామి అమ్మవారికి అభిషేకం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు. ఉయ్యాలవాడలో కోదండరాములకు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, పోచా రాధాక్రిష్ణారెడ్డి, విశ్వనాథరెడ్డి, ఈశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గడివేముల: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు దసరా పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మిచెట్టుకు పూజలు చేసి ఇంటి పెద్దలతో ఆశీస్సులు తీసుకున్నారు. గడిగరేవుల, గడివేముల, బూజనూరు గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించారు. గడివేములలోని ఆర్యవైశ్యులు వాసవీమాత ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా తిప్పుతు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. అనంతరం అమ్మవారిశాలలో భక్తులకు తీర్థప్రసాదాలను పంచి పెట్టారు.

రుద్రవరం: రుద్రవరం గ్రామంలో కొలువుదీరిన చౌడేశ్వరి అమ్మవారికి దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అభిషేకం చేసి పట్టుచీరతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రుద్రవరం సమీపంలో కొలువుదీరిన జంబుల పరమేశ్వరి అమ్మవారికి దసరా పూజలు చేశారు. 

చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని చెన్నకేశవ, కన్యకాపరమేశ్వరి, చాగలమ్మ, గంగాభవాని ఆలయాల్లో శుక్రవారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిదేవి అలంకారంలో కొలువుదీరారు. ముత్యాలపాడు ఆలయంలో బంగారులక్ష్మి, ధనలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే చెన్నకేశవ ఉత్సవమూర్తులచే గ్రామోత్సవం నిర్వహించారు. చాగలమర్రి, ముత్యాలపాడు గ్రామాల్లో శనివారం ఆర్యవైశ్యులు వసంత మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ అమ్మ వారికి పురవీధుల గుండా గ్రామోత్సవం చేశారు. వెల్లాల క్షేత్రంలో చెన్నకేశవ, సంజీవరాయ ఉత్సవమూర్తులచే శనివారం పల్లకి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు చెన్నకేశవ, సంజీవరాయ, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల గుండా గ్రామోత్సవం చేశారు. 

ఆళ్లగడ్డ్డ: దసరా నవరాత్రి ఉత్సవాలు వసంతోత్సవం, మహానివేదనతో శనివారం ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున కాళీకామాతకు ఉత్సవ పల్లకిలో వసంతోత్సవాన్ని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా యువకులు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. అనంతరం విశ్వబ్రాహ్మణులు మహానివేదన కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం చేశారు. 

ఆళ్లగడ్డ: దసరా ఉత్సవాల ముగింపు రోజున అహోబిలంలో శమి వృక్షదర్శనం కార్యక్రమాన్ని వేదపండితులు శనివారం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన అర్చకుడు శమి వృక్ష దర్శనంలో విల్లంబులు ఎక్కుపెట్టి బాణాలు వదిలి ఉత్సవాలను ముగించారు. కార్యక్రమంలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌, ఈవో నరసయ్య పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం భక్తిశ్రద్దలతో దసరా పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, కేతవరం, నన్నూరు, మీదివేముల, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, లొద్దిపల్లె, హుశేనాపురం, గుట్టపాడు, ఎన్‌.కొంతలపాడు, శకునాల, తిప్పాయపల్లె, ఆయా గ్రామాల్లో వెలసిన మహిళలు, భక్తులు దేవాలయాలకు వెళ్లి కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం జమ్మిచెట్టుకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. హుశేనాపురంలో మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌ పల్లకిని మోసుకుంటూ జమ్మిచెట్టు వద్దకు తీసుకెళ్లారు. 





Updated Date - 2021-10-17T05:08:27+05:30 IST