ఉత్సాహంగా ఉగాది సంబరాలు

ABN , First Publish Date - 2021-04-14T06:00:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

ఉత్సాహంగా ఉగాది సంబరాలు
ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

కరోనా కారణంగా పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు రద్దు

 ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

 ఇళ్లలోనే ప్రసార మాద్యమాల ద్వారా పంచాంగ శ్రవణాలు


కరీంనగర్‌ కల్చరల్‌ ఏప్రిల్‌ 13 జిల్లా వ్యాప్తంగా మంగళవారం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కరోనా కారణంగా వాడ వాడల్లో, ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు, ఉగాది పచ్చడి స్వీకరణలు, తీర్థప్రసాద వినియోగాలు, కవి సమ్మేళనాలు రద్దయ్యాయి. ఉదయం నుంచే భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వివిధ ఆలయాలను దర్శించుకొన్నారు.  ఇళ్ళలో కుటుంబ సభ్యులంతా సమీప బంధువులు, స్నేహితులతో కలసి సహపంక్తి భోజనాలు, ఉగాది పచ్చడి స్వీకరణలు, కబుర్లు కాలక్షేపాలతో ఉత్సాహంగా గడిపారు. ఇళ్ళలోనే  సామాజిక, ప్రచార, ప్రసార మాద్యమాల ద్వారా తమ తమ రాశి ఫలాల గురించి తెలుసుకున్నారు. మరి కొందరు అర్చకులు, పురోహితులను తమ ఇళ్ళకు ఆహ్వానించుకొని ఇంటిల్లిపాదికి పంచాంగం చెప్పించుకున్నారు. దానధర్మాలు, ప్రత్యేక పూజలతో ఏ ఇంట చూసినా ఆధ్యాత్మిక వాతావరణం, పండుగ ఆనందం కనిపించింది. కరోనా భయం వెంటాడుతుండటం, సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించారు. సామూహికంగా ఉత్సవాలు, వేడుకలు జరుపలేదు. కాగా పలు ప్రధాన ఆలయాలతోపాటు ఇతర ఆలయాల్లో జనం సందడి పెద్దగా కనిపించలేదు. భక్తులు కేవలం దర్శనాలు చేసుకుని వెనుదిరిగారు. 

Updated Date - 2021-04-14T06:00:10+05:30 IST