పచ్చదనమే తన లక్ష్యమంటున్న ఎంపీ సంతోష్

ABN , First Publish Date - 2021-03-04T21:51:57+05:30 IST

మంచి ఆశయంతో ముందడుగు వేసేవారి వెంట వేలాది

పచ్చదనమే తన లక్ష్యమంటున్న ఎంపీ సంతోష్

హైదరాబాద్ : మంచి ఆశయంతో ముందడుగు వేసేవారి వెంట వేలాది మంది నడుస్తారు. పచ్చదనం గొప్పతనం అందరికీ తెలిసినా, దానిని కాపాడుకునేందుకు తొలి అడుగు వేసి, వేలాది మందిని ప్రేరేపించేవారిని సెలబ్రిటీలు సైతం అనుసరిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావం మానవాళిపై ఎంత తీవ్రంగా పడుతోందో అర్థం చేసుకుని, తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మూడేళ్ళ క్రితం ప్రారంభించిన కృషికి రాజకీయ నేతలు, టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు చేయూతనిస్తున్నారు. పుట్టిన రోజులు వంటి ముఖ్యమైన సందర్భాల్లో మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పరిరక్షించడానికి పాటుపడుతున్నారు. 


ఎంపీ గారి మదిలో ఈ ఆలోచన ఎలా మొదలైందంటే...

2018లో ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ వంటివి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యేవి. దీంతో తాను కూడా ఏదైనా ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన జోగినపల్లి సంతోష్ కుమార్‌లో మొదలైంది. తాను చేపట్టే కార్యక్రమం తప్పనిసరిగా ఎక్కువ కాలం మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉండాలనుకున్నారు. తన సన్నిహితులతో చర్చించి, మొక్కలను పెంచాలనే ఛాలెంజ్ ప్రజలకు విసరాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన నిర్ణయం వెనుక  ఆయన అంకుల్, తెలంగాణా ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో సిద్ధిపేటలో 90వ దశకంలో మొక్కలను భారీగా నాటించిన సంగతి తెలిసిందే. 


ఆ నినాదానికి గొప్ప స్పందన

‘హరా హై తో భరా హై’ అనే స్లోగన్‌తో మూడేళ్ల కిందట ఎంపీ సంతోష్ కుమార్ ఛాలెంజ్ విసిరారు. దీనికి రాజకీయ నేతలు, తెలుగు, మలయాళం, కన్నడ, బాలీవుడ్ సినీ ప్రముఖులు, అధికారులు, క్రీడాకారులు సహా వేలాది మంది స్పందించారు. వీరంతా తమకు నచ్చిన చోట మొక్కలు నాటి, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బర్త్‌డేలు వంటి గుర్తుండిపోయే సందర్భాల్లో ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటుతున్నారు. దీంతో రోజు రోజుకూ ఈ ఛాలెంజ్‌కు స్పందన పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13 కోట్ల మొక్కలు నాటారంటే సంతోష్ కుమార్ వెంట నడుస్తున్నవారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వ్యక్తి ప్రారంభించిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడం గొప్ప విషయం. ఈ విజయంతో మానవాళికి ప్రయోజనం కలగడం మరింత ప్రశంసనీయం. 


అడవుల దత్తత

కేవలం వ్యక్తుల స్థాయిలోనే ఈ కార్యక్రమం ఆగిపోకూడదని భావించినట్లు జోగినపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతతో అడవులను దత్తత తీసుకుని, పచ్చదనాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చానన్నారు. దీని కోసం హైదరాబాద్ పరిసరాల్లో 88 అటవీ బ్లాకులను గుర్తించామని తెలిపారు. ఇతరులకు చెప్పడం మాత్రమే కాకుండా తాను కూడా స్వయంగా 2,400 ఎకరాల రిజర్వు ఫారెస్ట్ ఏరియాను దత్తత తీసుకున్నానని, ఇది మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసరలో ఉందని చెప్పారు. దీనిని రెండేళ్ళ క్రితం దత్తత తీసుకుని, 30 వేల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రాంతానికి పూర్తిగా కంచె వేయడంతో అడవి అద్భుతంగా పెరుగుతోందని చెప్పారు. 


ఎంపీ గారి బాటలో ప్రముఖులు 

ఎంపీ సంతోష్ కుమార్ స్ఫూర్తితో హెటిరో ఫార్మా చైర్మన్ బి పార్థసారథి రెడ్డి నరసాపూర్ వద్ద 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. అదేవిధంగా టాలీవుడ్ నటుడు ప్రభాస్ కాజీపల్లి వద్ద 1,650 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. నగర శివారులోని రాచకొండ ఫారెస్ట్ ఏరియాలో పచ్చదనాన్ని కాపడేందుకు రూ.70 కోట్లు ఖర్చు చేసేందుకు ఓ పారిశ్రామిక వర్గం ముందుకు వచ్చిందని సంతోష్ కుమార్ చెప్పారు. 


వేదాల సారంతో పుస్తకం

పచ్చదనాన్ని పరిరక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ సంతోష్ కుమార్ ఓ పుస్తకాన్ని కూడా రూపొందించారు. వేదాలు, రామాయణం, మహాభారతం, ప్రాచీన సంస్కృత కావ్యాలు, బౌద్ధ సాహిత్యం నుంచి సేకరించిన శ్లోకాలు, సాహిత్యం ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘వృక్ష వేదం’ పేరుతో రూపొందిన ఈ పుస్తకం చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. 


పీఎం మోదీకి ఛాలెంజ్

అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ఛాలెంజ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా భాగస్వామిని చేయాలని ఎంపీ గారు ఆకాంక్షిస్తున్నారు. ‘‘ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీని కూడా భాగస్వామిని చేయాలనుకుంటున్నాను’’ అని సంతోష్ కుమార్ చెప్పారు.


అంతటా పచ్చదనం 

సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. చిన్న ఇల్లు, వీథి, కాలనీ, టౌన్‌షిప్... ఇలా ప్రతి చోట మొక్కలు, చెట్లు కళకళలాడుతూ కనిపించాలనేదే తన కోరిక అని చెప్పారు. గ్రామాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతుండటం వల్ల ఎంత చిన్న చోటు కనిపించినా మొక్కలను నాటాలన్నారు. అప్పుడే మనం మెరుగైన వాతావరణంలో జీవించగలుగుతామని తెలిపారు. 


తెలంగాణా హోం మంత్రి బర్త్‌డే తాజా ఉదాహరణ

తెలంగాణా హోం మంత్రి మహమూద్ అలీ పుట్టిన రోజు బుధవారం జరిగింది. ఆయన ట్విటర్ వేదికగా తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనకు బొకేలు ఇవ్వవద్దని, తన పేరు మీద మొక్కలు నాటాలని కోరారు. ఆయన స్వయంగా అంబర్‌పేటలోని అంజుమన్ ఖాదిమ్-ఉల్-ముస్లిమీన్‌లో ఓ మొక్కను నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజునాడు మొక్కను నాటడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ ఉత్తమ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.

Updated Date - 2021-03-04T21:51:57+05:30 IST