పర్యావరణ హితం ఉపాధికి ఊతం

ABN , First Publish Date - 2022-01-19T05:19:18+05:30 IST

పర్యావరణ కాలుష్యం ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. ఉరుకుల పరుగుల జీవితంలో వాహనాల వినియోగం అధికమైంది. అదే సమయంలో వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి అధిక కారణమవుతోంది. ఈ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పర్యావరణ హితం ఉపాధికి ఊతం

మహిళా సంఘాలకు ఈ-ఆటోలు, ద్విచక్ర వాహనాలు


చౌటుప్పల్‌: పర్యావరణ కాలుష్యం ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. ఉరుకుల పరుగుల జీవితంలో వాహనాల వినియోగం అధికమైంది. అదే సమయంలో వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి అధిక కారణమవుతోంది. ఈ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాలుష్యరహిత ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ఈ-ఆటోలు, ఈ-ద్విచక్ర వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలుకు రుణ సదుపాయం కూడా కల్పించనుంది. ఈ-వాహనాల కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 80,120 సమభావన సంఘాలు ఉన్నాయి. అందులో 8,18,485మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 18,857 సమభావన సంఘాలు ఉండగా, 1,91,378 మంది సభ్యులు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 36,370 సమభావన సంఘాలు ఉండగా, 3,76,00 మంది సభ్యులుగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 24,899 సమభావన సంఘాలు ఉండగా, అందులో 2,51,107మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతీ నెల కొంతమొత్తం పొదుపు చేస్తూ బ్యాంకు రుణాలు తీసుకుంటూ ఆర్థికంగా బలోపేతానికి బాటలు వేసుకుంటున్నారు. తాజాగా, స్త్రీనిధి ద్వారా ఈ-ఆటోలు, ఈ-ద్విచక్ర వాహనాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధిని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.


స్త్రీనిధి ద్వారా రుణ సదుపాయం

గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యా లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా మారుమూల పల్లెలు, గిరిజన తండాల పరిస్థితి మ రింత దయనీయంగా ఉంది. సరైన రవాణా సదుపా యంలేక ఇక్కడి ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల్లోని సభ్యులకు ఈ-ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం కూడా మెరుగుపడుతుంది. అంతేగాక మహిళాసంఘాల సభ్యులకు స్వయం ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.సరుకు రవాణాకు అవసరమైన ఈ-వాహనాల కొనుగోలుకు సైతం స్త్రీనిధి ద్వారా మహిళా సభ్యులకు రుణాలు అందజేయనున్నారు.


ఇవీ నిబంధనలు

ఈ-ఆటోలు, ఈ-ట్రాలీఆటో కొనుగోలు చేసేందుకు రూ.3లక్షల నుంచి రూ.6లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోంది. ఈ రుణం ఆయా సంఘాల పరపతి ప్రకారం అధికారులు స్త్రీనిధి నుంచి అందజేస్తారు. రూ.3లక్షల రుణం తీసుకుంటే 60 నెలల పాటు నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అందుకు 11శాతం వడ్డీగా వసూలు చేస్తారు. ఎలక్ట్రికల్‌ అటోలో ఐదుగురు ప్రయాణించవచ్చు. రోజుకు రెండు గంటల చార్జింగ్‌తో 100కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఎలక్ట్రికల్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా గరిష్ఠంగా రూ.75,000 వరకు రుణంగా అందిస్తారు. దీన్ని 48 వాయిదాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాహనాలు విద్యుత్‌ బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. కాబట్టి పెట్రోల్‌ ఖర్చు ఉండదు. అంతేగాక కాలుష్య రహితం. అయితే మహిళా సంఘాల్లో సభ్యులైన వారికి మాత్రమే ఎలక్ట్రికల్‌ వాహనాల కొనుగోలుకు గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు మంజూరుచేస్తారు. ఒక సమభావన సంఘంలో 10 మంది సభ్యులు ఉంటే అందరూ ఈ రుణాలు తీసుకోవచ్చు. అందుకు మిగిలిన తొమ్మిది మంది సభ్యులు తీర్మానంచేసి ఆ ప్రతిని అధికారులు అందజేస్తే సంఘం పరపతి, గతంలో తీసుకున్న రుణాల చెల్లింపుల ప్రకారం ఎలక్ట్రికల్‌ వాహనాల కోసం కొత్త రుణాలు మంజూరు చేస్తారు.


 ఎలక్ట్రికల్‌ వాహనాలను సద్వినియోగం చేసుకోవాలి : సంధ్యారాణి, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌

కాలుష్యరహిత ఎలక్ట్రికల్‌ వాహనాల కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. ఈ రు ణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ-వాహనాల కొనుగోలుతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవాలి. అంతేగాక మారుమూల ప్రాంతాలకు రవాణా సదుపాయం కలుగుతుంది. వాహనాలు సక్రమంగా నడపడంతోనే తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం క్ర మం తప్పకుండా చెల్లించే వీలుంటుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ-వాహనాల కొనుగోళ్లపై సమభావన సంఘాల మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - 2022-01-19T05:19:18+05:30 IST