దేశాభివృద్ధికి న్యాయమైన, సమ్మిళిత విద్య ముఖ్యం : మోదీ

ABN , First Publish Date - 2021-09-07T19:53:03+05:30 IST

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే న్యాయమైన, నిష్పాక్షిక,

దేశాభివృద్ధికి న్యాయమైన, సమ్మిళిత విద్య ముఖ్యం : మోదీ

న్యూఢిల్లీ : ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే న్యాయమైన, నిష్పాక్షిక, సమ్మిళిత విద్య చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. శిక్షక్ పర్వ్ కాంక్లేవ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య సమ్మిళితంగా ఉండటం మాత్రమే కాకుండా, న్యాయంగా, నిష్పాక్షికంగా కూడా ఉండాలన్నారు. దీని కోసం మన దేశం ఆడియో బుక్స్‌‌ను ఉపయోగించుకుంటోందన్నారు. యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ (యూడీఎల్) ఆధారంగా భారతీయ సంకేత భాషా నిఘంటువును అభివృద్ధిపరచినట్లు తెలిపారు. మన దేశంలో మొట్టమొదటిసారి భారతీయ సంకేత భాషను పాఠ్య ప్రణాళికలో ఓ సబ్జెక్ట్‌గా చేర్చినట్లు తెలిపారు. 


ఈ సందర్భంగా మోదీ భారతీయ సంకేత భాషా నిఘంటువు, టాకింగ్ బుక్స్, పాఠశాల నాణ్యత భరోసా, సీబీఎస్ఈ మదింపు నిబంధనావళి; నిష్ఠ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, విద్యాంజలి పోర్టల్‌లను ఆవిష్కరించారు. పాఠశాల నాణ్యత భరోసా, సీబీఎస్ఈ మదింపు నిబంధనావళి చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాఠశాలలు, విద్య కోసం సాధారణ శాస్త్రీయ నిబంధనావళి మన దేశంలో లేదని, ఈ పరిస్థితి ఇప్పుడు మారిందని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం ఈ రోజుల్లో చాలా అవసరమని, నిష్ఠ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఉపాధ్యాయులు తమ సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు. 


విద్యార్థులు భవిష్యత్తులో క్రీడా రంగాన్ని ఎంచుకునే విధంగా ప్రోత్సహించడం కోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 పాఠశాలలను సందర్శించాలని ఒలింపియన్లు, పారాలింపియన్లను తాను కోరానని చెప్పారు. 


జాతీయ పురస్కారాలను స్వీకరించిన ఉపాధ్యాయులను మోదీ ఈ సందర్భంగా అభినందించారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో వారి కృషి ప్రశంసనీయమని చెప్పారు. 



Updated Date - 2021-09-07T19:53:03+05:30 IST