కోతకు గురైన రోడ్లు

ABN , First Publish Date - 2021-08-03T04:24:30+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మండలంలోని మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లు, వాటిపైనున్న కల్వర్టులు కొట్టుకుపోయాయి.

కోతకు గురైన రోడ్లు

- ఇటీవల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న దారులు

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

- పట్టించుకోని అధికారులు

సిర్పూర్‌(టి), ఆగస్టు 2: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మండలంలోని మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లు, వాటిపైనున్న కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో చీలపల్లి, పూసిగూడ, మాకిడి, జక్కాపూర్‌, భూపాలపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రతి నిత్యం మండల కేంద్రానికి వివిధ పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. గ్రామాలకు 108, 104, ఆర్‌బీఎస్‌ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని దుస్థితి నెలకొంది. వైద్యశిబిరాల నిర్వహణకు సిబ్బంది వెళ్లడానికి తీవ్రఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కాలినకడన వెళ్లాల్సి వస్తోంది. అలాగే సిర్పూర్‌(టి) నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన బీటీ రోడ్డుపై ఉన్న కల్వర్టు పూర్తిగా తెగిపోయి ప్రమాదకరంగా మారింది. ఇదే రోడ్డు గుండా ప్రతిరోజు మహారాష్ట్రకు ద్విచక్ర వాహనాలతో పాటు వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ రోడ్డు దుస్థితి చూసి కనీసం ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ అధికారులు తాత్కాలిక మరమ్మతులు సైతం చేయలేక పోతున్నారు. రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంటే ప్రమాదాలు జరగక తప్పదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయాన్ని పల్లె ప్రగతి పనుల పర్యవేక్షణకు వచ్చిన ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి కోతకు గురైన రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి..

- కోడిపె మక్తు, పూసుగూడ

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలి. గ్రామాలకు 108, 104 అంబులెన్స్‌లు వచ్చే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. 

ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి..

- సంజీవ్‌, మాకిడి

మహారాష్ట్ర రోడ్డుపై భారీవర్షాలకు కల్వర్టు కోతకు గురికావడంతో ప్రమాదకరంగా మారింది. కల్వర్టువద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్‌ అండ్‌బీ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి. 

Updated Date - 2021-08-03T04:24:30+05:30 IST