ఓరుగల్లు ప్రగతి విశ్వవ్యాప్తం కావాలి

ABN , First Publish Date - 2021-04-14T05:22:07+05:30 IST

ఓరుగల్లు ప్రగతి విశ్వవ్యాప్తం కావాలి

ఓరుగల్లు ప్రగతి విశ్వవ్యాప్తం కావాలి
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 - పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

- వేయిస్తంభాల ఆలయంలో కవి సమ్మేళనం

వరంగల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 13 : ఈ నూతన ప్లవనామ సంవత్సరంలో ఓరుగల్లు ఖ్యాతి అభివృద్ధి పరంగా విశ్వవ్యాప్తం కావాలని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆకాంక్షించారు. వేయిస్తంభాల ఆలయంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలను ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌తో కలిసి మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంవత్సరం తన మేషరాశికి ఆదాయ, వ్యయాలు భారీగా తేడా ఉన్నా గౌరవం అమితంగా ఉందని మంత్రి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. గౌరవంగా కేసీఆర్‌ ఆశిస్సులతో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు సహకరించాలన్నారు. 

వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. జైనుల ఆలయాల పునరుద్ధరణ ద్వారా పర్యాటక ప్రాంతం గా ఈప్రాంత అభివృద్ధికి మార్గం సుగమం అయిందన్నారు. పద్మాక్షి ఆలయ సమీపంలో సరిగమప పేరిట ప్రారంభించిన ఆడిటోరియంలో వారానికి రెండు రోజులు నగరంలోని కవులు, కళాకారులకు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదికగా నిలువనుందన్నారు. అంతకు ముందు చెరుకుపెల్లి శ్రీనివాసాచార్య, గుడిమెల్ల విజయకుమారాచార్యులు పంచాంగం పఠనం చేసి జిల్లా ప్రగతికి అన్ని రాశుల ఆదాయ వ్యయాలను వివరించారు. ఆలయ అర్చకులు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, భవితశ్రీ చిట్స్‌ ఎం.డి. తాటిపెల్లి శ్రీనివాస్‌, ఈవో వేణుగోపాల్‌, పులి రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరునగరి నరేందర్‌ అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో పొట్లపల్లి శ్రీనివాసరావు, అన్వర్‌, సిరాజొద్దీన్‌, వకుల వాసు, వనపర్తి పద్మావతి, రామ రత్నమాల, బండారు సుజాత, జిల్లా మహేందర్‌, రవి బాలాజీ, డాక్టర్‌ గడ్డం వెంకన్న తదితరులు కవితా గానం చేశారు. కవులను మంత్రి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, గంగు ఉపేంద్ర శర్మ ఘనంగా సత్కరించారు.

Updated Date - 2021-04-14T05:22:07+05:30 IST