పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం..

ABN , First Publish Date - 2022-01-24T05:09:32+05:30 IST

పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం..

పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం..
హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

  కొవిడ్‌ వ్యాప్తిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 దళితబంధు పథకం పకడ్బందీగా అమలు చేయాలి

  సమీక్షా సమావేశంలో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హనుమకొండ టౌన్‌, జనవరి 23: వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లో పంట నష్టాల అంచనా, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, జిల్లాల్లో జరుగుతున్న జ్వర సర్వే, దళితబంధు అమలుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వర్షానికి ఇప్పటివరకు 51వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిని 35మంది రైతులు నష్టపోయినట్లు అంచనాలు అందాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశామని, నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకూడదని ప్రతిపక్ష పార్టీలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 

కొవిడ్‌ వ్యాప్తి నివారణకు తగు చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు చికిత్స అందించేలా ఆస్పత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు చేపట్టిన జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇంటింటికి జ్వర సర్వే చేసి కి ట్లను అందించాలన్నారు. పోలీసులు కరోనా నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సభలు, సమావేశాలు, విందు, వినోదాల విషయంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలు రాస్తోరోకోలు చేయకుండా చూడాలన్నా రు. రాష్ట్రంలో దళిత వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలుకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఫిబ్రవరి 5లోగా స్థానిక శాసనసభ్యులు ఎంపిక చేయాలని మంత్రి దయాకర్‌రావు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, టి.రవిందర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, రాజయ్య, మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు బి.గోపి, రాజీవ్‌గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, వ్యవసాయ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-24T05:09:32+05:30 IST