బీజేపీ బోగస్‌ పార్టీ

ABN , First Publish Date - 2021-06-21T05:23:46+05:30 IST

బీజేపీ బోగస్‌ పార్టీ

బీజేపీ బోగస్‌ పార్టీ
కమలాపూర్‌లో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 


కమలాపూర్‌, జూన్‌ 20: భారతీయ జనతా పార్టీ బోగస్‌ పార్టీ అని  పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కమలాపూర్‌ మండలంలోని శనిగరం గ్రామంలో మండల స్థాయి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుందని, ఎక్కడా గెలిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అడ్రస్‌ ఉండదన్నారు.  తెలిసీ తెలియక టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరవద్దని సూచించారు. కాస్త అశ్రద్ధ వల్ల దుబ్బాకలో గెలిచిన బీజేపీని తొక్కితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని, నల్లగొండలో బీజేపీకి డిపాజిట్‌ రాలేదన్నారు. ప్రధాని మోదీ నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజల ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని గొప్పలు చెప్పాడని, ఇంధనం, వంటగ్యాస్‌ ధరలను పెంచాడన్నారు.  ప్రధాని మోదీ ఏ అభివృద్ధి చేయలేదని, వ్యవసాయ నల్లా చట్టాలను తీసుకొచ్చి రైతుల నడ్డి విరుస్తున్నాడని, నెలల తరబడి వ్యవసాయ చట్టాలపై రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడంతో ఒక్కొక్క రైతుకు యేడాదికి రూ.లక్ష కరెంట్‌ బిల్లు వస్తుందని, తెలంగాణలోని రైతులకు వ్యవసాయ మోటార్లకు వస్తున్న కరెంట్‌ బిల్లు సంవత్సరానికి రూ.లక్ష సీఏం కేసీఆర్‌ చెల్లిస్తున్నాడని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటే బీజేపీ ఒప్పుకోవడం లేదన్నారు.  


స్వార్థం కోసం బీజేపీలో చేరిన ఈటల

తన స్వార్థం కోసం ఈటల బీజేపీలో  చేరాడని దయాకర్‌రావు అన్నారు. ఈటల కార్యకర్తలకు చేసిందేమీ  లేదన్నారు. ఈటల తప్పటడుగు వేశాడన్నారు.  ఈటలకు టిక్కెట్‌ ఇస్తే పార్టీ ముఖం చూసి ప్రజలు ఓటు వేశారనీ, తల్లి లాంటి పార్టీకి, తండ్రి లాంటి కేసీఆర్‌కు మోసం చేశాడన్నారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టాల్సిందని, ప్రతీ గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కట్టించే బాధ్యత తీసుకుంటానన్నారు. దయన్న చెబితే.. కేసీఆర్‌ అన్నట్లేనని అన్నారు. కమలాపూర్‌ మండలాన్ని దత్తత తీసుకుంటానని, అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి, తాము ఇద్దరం మంచి స్నేహితులమైనప్పటికీ ప్రజల సమస్యలపై  గొడవ పడేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడని అన్నారు. వచ్చే ఉప-ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ఽధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, రైతు రుణవిమోచన చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు,  దివ్యాంగుల డెవల్‌పమెంట్‌  కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వాసుదేవా రెడ్డి, మండల ఇంచార్జి డాక్టర్‌ పెరియాల రవీందర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, వైస్‌-చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, జడ్పీటీసీ కళ్యాణి, నాయకులు  పాల్గొన్నారు.


మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న  రైతు

శనిగరం గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతుండగా ఓ రైతు  తనకు రూ.లక్ష రుణ మాఫీ చేయాలని, ఇంత వరకు రైతు రుణ మాఫీ చేయడంలేదని ప్రశ్నించారు. దీంతో మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో కూడా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాడని, రుణ మాఫీ చేస్తారని అన్నారు. కాగా, అంతకుముందు మండలంలోని శనిగరం గ్రామంలో గూనిపర్తి నుంచి బత్తినివానిపల్లి వరకు రూ.5.1కోట్లతో నిర్మించే డబుల్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. గ్రామంలో మిషన్‌ భగిరథ పథకాన్ని ప్రారంభించారు.

Updated Date - 2021-06-21T05:23:46+05:30 IST