కేసీఆర్‌ చలువతోనే ఉమ్మడిజిల్లా అభివృద్ధి

ABN , First Publish Date - 2021-02-25T04:45:30+05:30 IST

కేసీఆర్‌ చలువతోనే ఉమ్మడిజిల్లా అభివృద్ధి

కేసీఆర్‌ చలువతోనే ఉమ్మడిజిల్లా అభివృద్ధి
ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలంటూ పరిచయం చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలి

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొత్తగూడెంలో ‘పట్టభద్రుల’ సన్నాహక సమావేశం 

హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి, పలువురు నేతలు


కొత్తగూడెం, ఫిబ్రవరి 24: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ చలువతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి జరుగుతోంది. దేశంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయనదే. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి అందించాలనే ఆలోచనతో సీఎం అహర్నిశలు కృషిచేస్తున్నారు’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో బుధవారం జరిగిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలుచేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సీఎంకు ఈ విజయాన్ని కానుకగా ఇవ్వాలన్నారు.


పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌, జగదల్‌పూర్‌, విజయవాడ, ఏటూరు నాగారం లాంటి ప్రాంతాలకు కూడా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జాతీయ రహదారుల నిర్మాణాల కోసం తాను మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడి మంజూరు చేయించానని గుర్తుచేశారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సాగుభూములకు గోదావరి నీరంది సస్యశ్యామలమవుతాయన్నారు. 


కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు కొత్తగా రైల్వే లైన్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు ఆ రైల్వేలైన్‌ను పొడిగించే అవకాశముందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.45వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. భదాద్రి జిల్లా పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీచేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలన్నారు.


ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులతో ఐటీ కంపెనీలను స్థాపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల రాష్ట్రంలో మరింత నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజు పెట్రోలు, డీజిల్‌, చమురు, వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ పోతోందని ఆరోపించారు.


తాను అందరికీ అందుబాటులో ఉండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, కార్మికులు పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అడుగులో అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.


కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, టీబీజీకేఎస్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్‌ తదితరులు మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళీ, కొత్తగూడెం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:45:30+05:30 IST