భిన్న పథంలో భారత్

ABN , First Publish Date - 2020-02-02T01:18:52+05:30 IST

ఏ దేశమూ ఇతర దేశాల వారికి ధార్మిక కారణాలతో పౌరసత్వం ఇవ్వదు. పలస్తీన్ అరబ్బులపై అరబ్బు దేశాలన్నింటిలోనూ సానుభూతి ఉంది. వారి కొరకు యుద్ధాలు చేసినా ఏ ఒక్క అరబ్ దేశ

భిన్న పథంలో భారత్

ఏ దేశమూ ఇతర దేశాల వారికి ధార్మిక కారణాలతో పౌరసత్వం ఇవ్వదు. పలస్తీన్ అరబ్బులపై అరబ్బు దేశాలన్నింటిలోనూ సానుభూతి ఉంది. వారి కొరకు యుద్ధాలు చేసినా ఏ ఒక్క అరబ్ దేశమూ వారికి పౌరసత్వం ఇవ్వలేదు. మతం ఆధారంగా, పౌరసత్వాన్ని కల్పించే అత్యంత ప్రమాదకరమైన సంస్కృతికి ఇప్పుడు భారతదేశం శ్రీకారం చుట్టింది. ఈ చర్య, భారత రాజ్యాంగానికి మాత్రమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ అస్తిత్వపు మౌలిక ధర్మానికీ పూర్తి విరుద్ధం.

ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా వలసదారులు లేదా శరణార్ధులుగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడం వెనుక ఆర్ధిక కారణాలే ప్రధానంగా వుంటాయనడంలో సందేహం లేదు. ఒక్క ఇజ్రాయిల్‌లో మాత్రమే మతం ఆధారంగా పౌరసత్వం లభిస్తున్నది. అక్కడ కూడా కోస్తాంధ్ర నుంచి వెళ్ళిన తెలుగు లేదా ఇథియోపియా నుంచి వెళ్ళిన ఆఫ్రికన్ యూదులకు మతం కంటే సమకూరే ఆర్ధిక ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం.

 

పాకిస్థాన్ గ్రామీణ ప్రాంతాలలో హిందువులు, క్రైస్తవులు ఎంతో మంది దుర్భర పరిస్ధితుల నెదుర్కొంటున్నారు. కటిక దారిద్ర్యంలో నివసిస్తున్నారు. దుబాయి చర్చిలలో తెలుగు ప్రసంగం తర్వాత పాకిస్థానీ క్రైస్తవుల కొరకు పంజాబీ, ఉర్దూ భాషలలో ప్రార్ధన ఉంటుంది. ఈ దైవారాధన కొరకు వచ్చే వారందరు కూడా ఎటువంటి మినహాయింపు లేకుండా అత్యంత నిరుపేదలు. ధార్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా అడుగడుగున వివక్షకు గురవుతున్న వారు. బంగ్లాదేశ్ లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్ధితులు ఉన్నాయి. అయితే పాకిస్థానీయులతో పోల్చితే బంగ్లాదేశీయుల పరిస్ధితి కొంత మెరుగ్గా ఉంది.

 

ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల పరిస్ధితి దారుణంగా మారిందనేది ఒక నిష్టుర సత్యం. చైనా అధీనంలోని టిబెట్‌లో బౌద్ధులు, బర్మాలోని రొహింగ్యా ముస్లింలు, చిన్ క్రైస్తవులు; అదే విధంగా శ్రీలంకలో తమిళులు (హిందువులు, ముస్లింలు) కూడా వివక్షకు గురయి అన్ని రకాల అవకాశాలను కోల్పోయి మెరుగయిన భవిష్యత్తు కొరకు భారత్‌కు వస్తున్నారు. ఇక పాకిస్థాన్‌లో అహ్మదీయా తెగ ముస్లింలు ఆర్ధికంగా బలంగా వున్నా ధార్మికంగా వివక్షకు గురవుతున్నారు. ఈ మూడు ముస్లిం దేశాలలో ఏ రకమైన వివక్ష ఉందో చైనా, శ్రీలంక, బర్మాలో కూడా అదే విధంగా వివక్ష వున్నది. అయితే చైనా, శ్రీలంక, బర్మాలలోని అల్ప సంఖ్యాక వర్గాల వారిని విస్మరించి పూర్తిగా రాజకీయకోణంతో ధార్మికత ఆధారంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. కొత్త భారతీయ పౌరసత్వ చట్టం ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 

‘వాషింగ్టన్ పోస్టు’ మొదలు ఖతర్‌లోని ‘అల్ జజీరా’ దాకా దాదాపు ప్రముఖ పత్రికలు, ప్రసార మాధ్యమాలు అప్నీ ఈ చట్ట ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇతర దేశాలకు చెందిన పౌరులకు ధార్మిక కారణాల వలన పౌరసత్వం ఇవ్వదు. పలస్తీన్ అరబ్బులపై అరబ్బు దేశాలన్నింటిలోనూ సానుభూతి ఉంది. వారి కొరకు యుద్ధాలు కూడ చేసినా ఏ ఒక్క అరబ్బు దేశం కూడ వారికి పౌరసత్వం ఇవ్వలేదు. సున్నీ తెగ కేంద్రీకృతంగా యమన్, సిరియా దేశాలలో ప్రస్తుతం రాజకీయాలు, యుద్ధాలు చేస్తున్న అరబ్బు దేశాలు కూడా ఆ రెండు దేశాలలోని సున్నీ అరబ్బులకు పౌరసత్వం ఇవ్వలేదు. ఈ పరిస్ధితులలో మతం ఆధారంగా, పౌరసత్వాన్ని కల్పించే అత్యంత ప్రమాదకరమైన సంస్కృతికి ఇప్పుడు భారతదేశం శ్రీకారం చుట్టింది. ఈ చర్య, భారత రాజ్యాంగానికి మాత్రమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ అస్తిత్వపు మౌలిక ధర్మానికి పూర్తిగా విరుద్ధం.

 

ఈశాన్య భారత రాష్ట్రాలలో బెంగాలీ వలసవాదుల గంపగుత్త ఓట్లతో ఆ రాష్ట్రాల అధికార కోటలలో పాగా వేయాలనే రాజకీయ ప్రయోజనంతో తీసుకువచ్చిన ఈ చట్టం వైవిధ్యంతో కూడిన భారత విశిష్ట చరిత్రకు మచ్చ. బ్రిటిష్ రాజనీతిజ్ఞురాలు మార్గరెట్ థాచర్ మొదలు సిరియన్ రాచరిక పాలకుడు బష్షార్ అల్ అస్సాద్ దాకా ప్రతి దేశ అధినేత భారత్‌లో వర్థిల్లుతున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రశంసించిన వారే. అలాంటి మహోన్నత చరిత్ర తో ప్రజాస్వామ్య పథంలో పురోగమిస్తున్న భారత్‌ కొత్త పౌరసత్వ చట్టాన్ని తీసుకురావడం దిగ్భ్రాంతికరమేగాక వివాదాస్పదం కూడా. మతం ఆధారంగా రాజ్య పాలన చేయవచ్చని పాకిస్థాన్ గట్టిగా విశ్వసించింది. అందుకే ఆఫ్ఘానిస్థాన్‌ సరిహద్దు నుంచి లక్షలాది శరణార్ధులను మతం ఆధారంగా అక్కున చేర్చుకొని చేతులు కాల్చుకున్నది.

 

దేశ విభజన సమయంలో మనతో సరిసమానంగా ఉన్న పాకిస్థాన్ మతం కారణాన నేడు ప్రపంచంలో అత్యంత వెనుకబడ్డ దేశాలలో ఒకటిగా ఉంది. కేవలం మతం ఆధారంగా అధికారం చలాయించిన అనేక అరబ్బు దేశాలు ఇప్పుడు సహనశీలంగా వ్యవహరిస్తున్న తరుణంలో బీజేపీ పాలకులు భారత్‌ను భిన్నమైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి యత్నిస్తున్నారు. సహనశీలతే భారతీయత. కొత్త పౌరచట్టంతో దేశం ఈ సమున్నత సుగుణాన్ని కోల్పోతున్నదేమో?!


Updated Date - 2020-02-02T01:18:52+05:30 IST