పేదలకు ఆపన్న హస్తం

ABN , First Publish Date - 2020-04-05T10:17:50+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలువురు నాయకులు, పలు రాజకీయ, కుల సంఘాల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను, మాస్కులను అందజేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్వీ

పేదలకు ఆపన్న హస్తం

ఉమ్మడి జిల్లాలో నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ

మాస్కులు, శానిటైజర్లు, నగదును అందజేసిన దాతలు


సిద్దిపేట, ఏప్రిల్‌ 4: లాక్‌డౌన్‌ నేపథ్యంలో శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలువురు నాయకులు, పలు రాజకీయ, కుల సంఘాల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను, మాస్కులను అందజేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్వీ జిల్లా నాయకుడు నవీన్‌గౌడ్‌ తన సొంత ఖర్చులతో కాళ్లకుంటకాలనీలోని సుమారు వెయ్యి కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.  సిద్దిపేటలోని టీఆర్‌ఎస్‌ నాయకుడు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీను శనివారం స్థానిక 5వ, 7వ వార్డుల్లో పేదలకు నిత్యావసరాల సరుకులు, మాస్కులు, రూ.200ల నగదును అందజేశారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీనివాస జ్యువెలర్స్‌ యజమాని బుర్గోజు శ్రీనివాస్‌, స్వర్ణకార సంఘం సంఘ సభ్యులు స్వర్ణకార కుటుంబాలకు చెందిన 50 మందికి బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సిద్దిపేట పట్టణంలో సీఐటీయూ నాయకులు రేవంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు, వలస కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. 


సిద్దిపేట జిల్లా గుర్రాలగొందిలో గ్రామ పంచాయితీ పాలకవర్గం ఇంటింటికీ కూరగాయలను అందజేసింది. మిరుదొడ్డిలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్‌రెడ్డి పోలీసులకు మాస్కులు, గ్లౌజులను పంపిణీ చేశారు. నంగునూరు మండలం నర్మెటలో ఎంపీటీసీ బాబు ఆధ్వర్యంలో,  కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో 150 మంది పేదలకు శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కొమురవెల్లి మండలకేంద్రంలో జడ్పీటీసీ సిలివేరి సిద్ధప్ప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, లెనిన్‌ నగర్‌లో ఆముదాల మల్లారెడ్డి, నక్కల యాదవరెడ్డి, రాంసాగర్‌ సర్పంచు తాడూరి రవీందర్‌, చేర్యాలలోని బొగ్గు బట్టి కార్మికులకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాలనర్సయ్య బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను విరాళంగా అందజేశారు.


సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెంలో మాజీ సర్పంచ్‌ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌ గుప్తా ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి శనివారం తహసీల్దార్‌ భిక్షపతికి  అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని 20వ వార్డులో కౌన్సిలర్‌ వంటేరు గోపాల్‌రెడ్డి, నాయకురాలు ఉమాదేవీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు, 19వ వార్డులో మార్వాడీ అసోసియేషన్‌కు చెందిన గోపాల్‌, గిరిధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గుంటుకురాజు ఆధ్వర్యంలో, 12వ వార్డులో అత్తెల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో, గజ్వేల్‌ మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ జేజాల వెంకటేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు, నిత్వావసర సరకులను అందజేశారు. జగదేవ్‌పూర్‌ మండలంలో జడ్పీటీసీ వంటేరు సుధాకర్‌రెడ్డి మాస్కులు, సానిటైజర్‌ను పంపిణీ చేశారు. కొండపాక మండలం దుద్దెడలో కలెక్టరేట్‌ నిర్మిస్తున్న కార్మికులకు తహసీల్దార్‌ రామేశ్వర్‌ బియ్యం, నగదును పంపిణీ చేశారు. ములుగు పోలీ్‌సస్టేషన్‌లో బీసీ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోదా అరుణ్‌యాదవ్‌ పోలీసులకు పండ్లను పంపిణీ చేశారు. 


మెదక్‌ జిల్లాలో

మెదక్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ఘనపూర్‌లో పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికీ తొమ్మిది గుడ్లు, శానిటైజర్‌ బాటిల్‌, చేతి గ్లౌజులను పంచాయతీ పాలకవర్గం సభ్యులు అందజేశారు. రామాయంపేటలో శనివారం  మెదక్‌ ఎమ్మెల్యే పద్మారెడ్డి నిత్యావసరాల సరుకుల కిట్లను పలువురికి పంపిణీ చేశారు. అల్లాదుర్గంలోని పేద బ్రహ్మణులకు ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి శనివారం బియ్యంతో పాటు రెండు వేల రూపాయల నగదును అందజేశారు. మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బందికి మెదక్‌ వ్యవసాయ సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ కాస సూర్యతేజ ఆధ్వర్యంలో అల్పహారాన్ని అందజేశారు.   పాపన్నపేట పారిశుధ్య కార్మికులకు శ్రీ విద్య పాఠశాల యాజమాన్యం బియ్యం, నిత్యవసర సరుకులు, శానిటైజర్‌, మాస్కులను అందజేశారు. పాపన్నపేట పోలీసులకు బీజేపీ మండలాధ్యక్షుడు బికొండ రాములు డ్రైఫ్రూట్స్‌, బిస్కెట్‌ ప్యాకేట్లు, వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. మెదక్‌ పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ ఇంటింటికీ కూరగాయలను అందజేశారు. చిన్నశంకరంపేట మండల ఆర్‌ఎంపీల ఆసోసియోషన్‌ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావుకు రూ. పది వేల చెక్కును అందజేశారు.


సంగారెడ్డి జిల్లాలో

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులు, గుమ్మడిదల మండలం బొంతపల్లిలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గిద్దె రాజు పేదలకు నిత్యవసర సరుకులను, బియ్యాన్ని పంపిణీ చేశారు. సంగారెడ్డి మున్సిపల్‌ 7వ వార్డు కౌన్సిలర్‌ విజయలక్ష్మి-శేఖర్‌ దంపతులు శనివారం తహసీల్దార్‌ స్వామికి రూ. 21వేల చెక్కును అందజేశారు. జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి, ఇన్‌ పేషంట్లకు డాకూరి గాలయ్య ట్రస్ట్‌ కన్వీనర్‌, 2వ వార్డు కౌన్సిలర్‌ డాకూరి శివశంకర్‌, ట్రస్ట్‌ డైరెక్టర్‌ డాకూరి చంద్రశేఖర్‌ అన్నదానాన్ని చేపట్టారు. రాయికోడ్‌ మండల పరిధిలోని సంగితం గ్రామంలో ప్రజలకు ఎంపీటీసీ మల్లికార్జున్‌ పాటిల్‌ నిత్యావసర సరుకులను అందజేశారు.


బొల్లారంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి పలు కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయగా, సీఐ ప్రశాంత్‌ ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు. వలస కార్మికులు, పరిశ్రమ కార్మికుల కోసం  పోలీసులువారం రోజులుగా ఆహారాన్ని అందజేస్తున్నారు.  జిన్నారంలో సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌ లబ్ధిదారులకు రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేపట్టారు. నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారులు, పోలీసులు, మున్సిపల్‌ కార్మికులకు భోజనం, అల్పాహారాన్ని అందజేశారు. నారాయణి షాపింగ్‌ మాల్‌ యజమానులు మున్సిపల్‌ కార్మికులకు, పోలీసులకు మాస్కులను, మెట్టు పండర్‌నాథ్‌ వస్త్ర దుకాణం వారు చేతి రుమాళ్లను అందజేశారు. నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కార్మికులకు కమిషనర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రుబీనాబేగం నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. 


కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆనంద్‌స్వరూప్‌ షెట్కార్‌, టీఆర్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో 120 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కల్హేర్‌ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాకు చెందిన సంగారెడ్డిలోని శాంతా డెవలపర్స్‌  యజమాని సంజయ్‌కుమార్‌, చంద్రమోహన్‌ పోలీసులకు, నాగ్‌ధర్‌లో ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌ గ్లౌస్‌లు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్‌ రేణుక శివకుమార్‌ వార్డులో ప్రతి ఇంటికి మాస్కులను పంపిణీ చేశారు.  పట్టణంలో 20వ వార్డు కౌన్సిలర్‌ ఆకుల శివకుమార్‌ ఆధ్వర్యంలో గౌలిగూడ గురుద్వార్‌ వారి సహకారంతో తెలంగాణ సిక్కు సొసైటీ ఆధ్వర్యంలో సిక్కుల కుటుంబాలకు ఆహార ధాన్యాలు, రూ వెయ్యి నగదును అందజేశారు. కొండాపూర్‌ మండలంలో ఎంపీపీ మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు.


రేషన్‌ కోసం క్యూ కట్టిన వారికి కుర్చీల ఏర్పాటు

రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో శనివారం రేషన్‌ బియ్యం కొనుగోలు చేయడానికి వచ్చిన లబ్ధిదారులకు సర్వర్‌ డౌన్‌తో గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. దీన్ని గమనించిన కౌన్సిలర్‌ భరత్‌ క్యూలైన్‌లో పేదల కోసం కుర్చీలను ఏర్పాటు చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ కుర్చీలను రేషన్‌ దుకాణం ముందు వేశారు. దీంతో ఇబ్బంది పడకుండా పేదలు రేషన్‌ తీసుకున్నారు. 


సాయంపై ‘మున్పిపల్‌’ అనుమతి తప్పనిసరి

జోగిపేట : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కరోనా నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, దాతలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా అన్నార్థులకు ఏ రకమైన సాయం చేయాలన్నా మున్సిపల్‌ అధికారుల అనుమతి తీసుకోవాలని కమిషనర్‌ మీర్జా ఫసహత్‌ అలీ ఆదేశించారు. సాయం అందించడం మంచి విషయమే అయినా, పలువురు ఇలా సాయం చేసేటప్పుడు భౌతిక దూరం పాటించడంలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఏఒక్కరు సాయం చేయదలచినా మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలని, దీనిని ఉల్లంఘిస్తే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా జోగిపేట పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న వారాంతపు సంతను కరోనా నేపథ్యంలో బంద్‌ (రద్దు) చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2020-04-05T10:17:50+05:30 IST