నిత్యావసరాలు నింగిలో..

ABN , First Publish Date - 2020-03-30T10:51:47+05:30 IST

కరోనా కలకలంతో నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. కొన్నింటికి చాలా డిమాండ్‌ ఉంటోంది. మార్కెటింగ్‌

నిత్యావసరాలు నింగిలో..

రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

అధికారులు చక్కదిద్దకుంటే ఇబ్బందులే

రవాణా అద్దెలు.. హమాలీల కొరతతో చేయి దాటే పరిస్థితి

ఉల్లి, బంగాళా దుంపలకు డిమాండ్‌


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కరోనా కలకలంతో నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. కొన్నింటికి చాలా డిమాండ్‌ ఉంటోంది. మార్కెటింగ్‌ శాఖ నిఘా పెట్టి తక్షణం చర్యలు తీసుకోకుంటే సామాన్యులకు నిత్యావసరాలు అందడం కష్టం అవుతుంది. గ్రామ స్థాయిలోని వినియోగదారునికి నిత్యావసరాలు చేరాలంటే అనేక దశలు దాటాలి. మనకు వస్తున్నవన్నీ ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయి. అక్కడి రైతులు పండించిన పంటలు ఆయా రాష్ట్రాల్లోని హోల్‌ సేల్‌ మార్కెట్‌కు చేరాక అక్కడి నుంచి విజయగనగరంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌కు లారీల్లో వస్తాయి. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారులు కొనుగోలు చేసి వినియోగదారునికి కిలోల రూపంలో అమ్మకాలు నిర్వహిస్తుంటారు.


ఈ విధంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, అల్లం, వెల్లుల్లి, కందిపప్పు, మినపగుళ్లు, ఆయిల్స్‌ ఇలా వివిధ సరుకుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇందులో ప్రధానమైనవి ఉల్లిపాయలు, బంగాళా దుంపలు. ఈ రెండు ఉత్పత్తులు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ నుంచి వస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రాలు దాటి సరుకులు రావాలంటే ఇబ్బందులే. నిత్యావసరాలకు వెసులుబాటున్నా ఎక్కడో ఒకచోట ఇరుక్కోవడం పరిపాటిగా మారిందని వర్తకులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఎక్కడి రవాణా అక్కడే నిలిచిపోయింది. నిత్యావసరాలకు మినహాయింపు ఉంది కాని కార్మికుల కొరత ఏర్పడింది. హమాలీలు పూర్తిగా రావడం మానేశారు. లోడింగ్‌ అన్‌లోడింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కరోనాపై ప్రభుత్వ సూచనలను దృష్టిలో పెట్టుకుని హమాలీలు సైతం పనుల్లోకి రావడం లేదు. కొంత మంది వస్తున్నప్పటికీ రెట్టింపు కూలి అడుగుతున్నారు.


 పెరిగిన అద్దెలు

లాక్‌డౌన్‌ పరిస్థితిలో లారీల లభ్యత తగ్గింది. రాష్ట్రాలు దాటుతూ నిత్యావసరాలు రావాలంటే లారీ యజమానులు భయపడుతున్నారు. ఒక వేళ ముందుకొచ్చినా రెంట్టింపు కిరాయి గుంజేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభం కాకముందు మహారాష్ట్ర నుంచి లారీలోడు 10టన్నుల బరువుతో ఉల్లి రావాలంటే విజయనగరంలోని హోల్‌ సేల్‌ వ్యాపారులు రూ.40వేలు చెల్లించేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక లారీ లోడు ఉల్లిపాయలు మహారాష్ట్ర నుంచి హోల్‌ సేల్‌ వ్యాపారులు ఆదివారం తీసుకు వచ్చారు. అద్దె రూ.1,04,000 చెల్లించారు. అంటే రూ.40వేలు ఉండే అద్దె ఒక్కసారిగా సుమారు రెండు రెట్లు పెంచేశారు. బంగాళా దుంపల పరిస్థితి అంతే. పశ్చిమబెంగాల్‌ నుంచి వస్తున్న సరకులు విషయంలో రవాణాకు కాస్తా వెసులుబాటున్నట్లు వర్తకులు చెపుతున్నారు.


ప్రతి రోజూ 100 టన్నుల ఉల్లి

 ఉల్లిపాయలు జిల్లాకు రోజుకు 100 టన్నులు అవసరం. ఒక్క విజయనగరం, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల వారినుంచే ప్రతి రోజూ 50 టన్నుల ఉల్లిపాయల డిమాండ్‌ ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెపుతున్నారు.  ప్రస్తుతం 25 నుంచి 30 టన్నులు మాత్రమే ఉల్లిపాయలు తెప్పించగలుగుతున్నారు. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీల్లోని ఉల్లిపాయలు, బంగాళా దుంపల వ్యాపారులు నేరుగా ఇతర రాష్ట్రాల నుంచే కొనుగోలు చేసి నిల్వలు తెప్పించుకుంటున్నారు. కాగా హోల్‌ సేల్‌ వ్యాపారులు ఆదివారం ఉల్లి కిలో రూ.31 నుంచి 33కు కొన్నారు. ఈనిల్వలు రిటైల్‌ వద్దకు చేరాలి. వారు మళ్లీ లాభం చూసుకుని అమ్మకాలు చేపట్టాలి. కిలో రూ.35 పైబడి అమ్మకాలు చేస్తున్నారు.


కందిపప్పు.. మినప గుళ్లు వంటి నిత్యావసర సరుకులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితిలో వీటి రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. వంట నూనె ధరలు కూడా పెరిగే పరిస్థితి కన్పిస్తున్నది. అన్ని రిఫండ్‌ అయిల్స్‌ కూడా లీటరు ధర రూ.100కు తక్కువ లేదు. మరో 10 రూపాయలు పెంచే పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా పప్పులు, ఉప్పులు, నూనె తరువాత ముఖ్యమైది మసాలా దినుసులు. అల్లం, ఎల్లులి, పచ్చిమిర్చి, ఏలకులు, జీలకర్ర, దనియాలు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు కేరళ రాష్ట్రం నుంచి గరిష్ఠంగా దిగుమతి అవుతున్నాయి. కొన్ని నిల్వలు స్ధానికంగా లభ్యం అవుతున్నా ఏలకలు, మిరియాలు, మసాల దినుసలన్నీ కేరళనుంచి వస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ప్రభావం వీటిపైనా పడుతున్నది. 


అందరికీ అవసరమైన బియ్యం నిల్వలు మన జిల్లాకు పక్క జిల్లాలు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అధికంగా వస్తున్నాయి. 50శాతం నిల్వలు తూర్పు గోదావరి నుంచే వస్తున్నాయి. ఈ జిల్లాల్లో షార్టెక్‌ మిషన్లు ఉన్న కారణంగా సాంభమసూరి, సోనా మసూరి వంటి వివిధ పేర్లతో వివిధ రకాల అకర్షనీయ ప్యాకింగ్‌లో మనకు వస్తున్నాయి. కరోనా దెబ్బతో బియ్యం నిల్వల ధరలు పెరుగుతున్నాయి. ప్రతి బ్యాగ్‌ వద్ద రూ.50 వరకు పెంచారు. ఇదివరకు రూ.1150 ఉన్న బియ్యం ప్రస్తుతం రూ.1200కు పెంచారు. 

Updated Date - 2020-03-30T10:51:47+05:30 IST