పాడేరులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2022-01-18T04:23:54+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

పాడేరులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి
కేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై అధికారులకు సూచనలిస్తున్న పీవో గోపాలక్రిష్ణ


అధికారులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం 

పాడేరు, జనవరి 17: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ మరుగుదొడ్లు, విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు, గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ.. యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ప్రతి చోట లైట్లు ఉండాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా వాటర్‌ ట్యాంకు, మోటార్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి గదిని బాధితులు గుర్తించేలా ముందు నేమ్‌బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కేర్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులకు ప్రత్యేక గదులు కేటాయించాలన్నారు. అలాగే కేర్‌ సెంటర్‌లో సీసీ కెమెరాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ, తగిన రక్షణ, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌ చికిత్సకు మందుల నిల్వలను అందుబాటులో ఉంచాలని పీవో గోపాలక్రిష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ కె.కృష్ణారావు, ఏటీడబ్ల్యూవోలు  ఎల్‌.రజని, మలికార్జునరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-18T04:23:54+05:30 IST