మదనపల్లెను జిల్లాకేంద్రంగా చేయాలి

ABN , First Publish Date - 2021-01-20T06:24:19+05:30 IST

మదనపల్లెను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని ఎంజేఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో సకల జనుల సత్యాగ్రహం నిర్వహించారు

మదనపల్లెను జిల్లాకేంద్రంగా చేయాలి
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న షాజహాన్‌, పక్కనే శివప్రసాద్‌ తదితరులు

మదనపల్లె, జనవరి 19: మదనపల్లెను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎంజేఎస్‌ఎస్‌) కన్వీనర్‌, బాస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు లక్ష్యంగా ఎంజేఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు మంగళవారంతో 590వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణ బీటీ కళాశాల గేటు వద్ద జరిగిన సకల జనుల సత్యాగ్రహం కార్యక్రమానికి పెద్దసంఖ్యలో జనం తరలి వచ్చారు. పీటీఎం శివప్రసాద్‌ మాట్లాడుతూ.. కొత్త జిల్లాల పేరిట ప్రభుత్వం రోజుకో మాట, పూటకో ప్రకటన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. చారిత్రక అంశాలను దృష్టిలో ఉంచుకుని మదనపల్లె అంశంపై విస్పష్ట ప్రకటన చేయాలని కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ ఎక్కడో మూలన ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసేన నేత గంగారపు రామ్‌దా్‌సచౌదరి మాట్లాడుతూ.. 1911లో మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాల్సినా, అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఆ అవకాశం కడపకు దక్కిందన్నారు. మళ్లీ అలాంటి తప్పిదం జరిగితే ప్రజల దృష్టిలో పాలకులు ద్రోహులుగా మారిపోతారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత గురుప్రసాద్‌, పలుపార్టీలు, సంఘాల నాయకులు మాదిన భాస్కర్‌, నాగరాజ, సహదేవి, బి.రాజశేఖర్‌, రఘునాథరెడ్డి, దివాకర్‌, శివరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T06:24:19+05:30 IST