రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-28T04:42:54+05:30 IST

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి పేర్కొన్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా  కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి 


సిద్దిపేటఅగ్రికల్చర్‌, అక్టోబరు 27: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 396 కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 2, 3 రోజుల్లో వందశాతం ప్రారంభించేలా సన్నాహాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాలోని రైస్‌మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు లక్షా 79వేల రైతుల నుంచి 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోళ్లు చేయడం కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐకేపీ-225, పీఏసీఎస్‌-156, ఏఏంసీ-10, మెప్మా-5 చొప్పున మొత్తం 396 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్లలో అవకతవకలు జరగకూడదని ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు క్లస్టర్‌ అధికారులను నియమించినట్లు చెప్పారు. పంట మిల్లుకు డెలివరీ కావడం ప్రధానంగా చూడాలని, అన్‌లోడింగ్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసే దిశగా మిల్లర్లు సహకరించాలన్నారు. ధాన్యం మూమెంట్‌పై ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేలా అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా రెండు రైస్‌ మిల్లులకు ఒక మండల స్పెషల్‌ ఆఫీసర్‌, ప్రత్యేక అధికారిని నియమించినట్లు స్పష్టం చేశారు. ఇక మిల్లింగ్‌ కెపాసిటీ పెంచాల్సిన అవసరం, చేయలేని అంశాలపై త్వరలోనే మంత్రి హరీశ్‌రావుతో విశ్లేషించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు. సమీక్షా సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ముజామ్మీల్‌ ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డీఆర్డీఏ పీడీ గోపాల్‌ రావు, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి హరీష్‌, డీసీవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, రైస్‌ మిల్లర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఏంపీడీవోలు, ఏపీఏంలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:42:54+05:30 IST