అమెరికా ఎన్నికల ఖర్చు ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

ABN , First Publish Date - 2020-10-29T15:31:02+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు అంటేనే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే అంశం. ఇందుకు తగ్గట్టే అగ్రరాజ్యంలో

అమెరికా ఎన్నికల ఖర్చు ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు అంటేనే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే అంశం. ఇందుకు తగ్గట్టే అగ్రరాజ్యంలో ఎన్నికలకు భారీగా ఖర్చు కూడా అవుతుంది. అయితే ఈసారి జరుగుతున్న అధ్యక్ష పదవి ఎన్నికలకు మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ఖర్చు అయింది. అమెరికా 2020 ఎన్నికలకు దాదాపు 14 బిలియన్ డాలర్ల(రూ. లక్షా 3 వేల కోట్లకు పైగా) ఖర్చు అయినట్టు సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. 2012, 2016 ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువగానే ఉన్నట్టు రిపోర్ట్ చెబుతోంది. ఈ సారి ఎన్నికలకు 11 బిలియన్ డాలర్ల(రూ. 81 వేల కోట్లకు పైగా) వరకు ఖర్చయ్యే అవకాశముందని ముందుగా అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి ఎన్నికల ఖర్చు అవడం విశేషం. ట్రంప్, జో బైడెన్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. దీనికి తోడు కరోనా అంశం అమెరికా ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తోంది. 


డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు ఫండ్స్ ద్వారా ఒక బిలియన్ డాలర్లు(రూ. 7,400 కోట్లు) వచ్చాయి. జో బైడెన్‌‌ను గెలిపించేందుకు బడా బిలియనీర్లు ఆయనకు అండగా నిలబడుతున్నారు. వీరిలో న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్, సమాజసేవకుడు టామ్ స్టేయర్ ప్రముఖంగా ఉన్నారు. వీరిద్దరూ మొదట అధ్యక్ష పదవికి పోటీ పడి తరువాత రేసు నుంచి తప్పుకున్నారు. అయితే జో బైడెన్ గెలుపు కోసం ప్రచారానికి కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారు. జో బైడెన్ క్యాంపెయిన్ కోసం వీరిద్దరూ ఇప్పటివరకు 1.4 బిలియన్ డాలర్ల(రూ. పది వేల కోట్లకు పైగా)ను ఖర్చు చేశారు. ఇతర గ్రూపులు, మద్దతుదారులు మరో 5.5 బిలియన్ డాలర్ల(రూ. 40 వేల కోట్లకు పైగా)ను ప్రచారానికి ఖర్చు పెట్టారు. 


మరోపక్క ట్రంప్‌కు ఫండ్‌రైజింగ్ ద్వారా 596 మిలియన్ డాలర్లు(రూ. 4,415 కోట్లు) వచ్చాయి. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి 3.8 బిలియన్ డాలర్ల(రూ. 28 వేల కోట్లకు పైగా)ను ఖర్చు చేసింది. జో బైడెన్‌కు మహిళలు ఎక్కువగా విరాళమిచ్చారు. ఆయనకు ట్రంప్ కంటే ఎక్కువ విరాళాలు రావడానికి ఇది కూడా ఒక కారణం. ఇక రెండు పార్టీలకు 200 డాలర్లు అంతకంటే తక్కువ ఇచ్చిన దాతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. డెమొక్రటిక్ పార్టీకి వీరి నుంచి మొత్తంగా 1.7 బిలయన్ డాలర్లు(రూ. 12 వేల కోట్లకు పైగా) విరాళంగా రాగా, రిపబ్లికన్లకు బిలియన్ డాలర్లు(రూ. 7 వేల కోట్లకు పైగా) వచ్చాయి.

Updated Date - 2020-10-29T15:31:02+05:30 IST