అంతా అనధికారికమే..!

ABN , First Publish Date - 2020-05-27T10:03:43+05:30 IST

మండలంలోని ముసి నది పరివాహక ప్రాంతం లో అధికారికంగా ఇ సుక రీచ్‌ ఒక్కటీ లేదు. అయినప్పటికీ ఎర్రఓబనపల్లి, ఉయ్యాలవాడ, కృష్ణాపురం తదితర గ్రామాల సమీపంలోని ముసినది నుంచి ..

అంతా అనధికారికమే..!

దర్శి మండలంలో ఒక్క అధికారిక రీచ్‌ లేకున్నా

ముసి నుంచి జోరుగా తోడకం

ముండ్లమూరు మండలంలోనూ అనుమతుల్లేని రీచ్‌లు  

అనుమతి ఉన్నా ఒకదాని పేరిట వందల లారీల్లో నిత్యం తరలింపు

కొన్నిచోట్ల భారీగా నిల్వలు.. లక్షలు కూడబెడుతున్న వైసీపీ నేతలు

మామూళ్ల మత్తులో జోగుతున్న 

పోలీస్‌, మైనింగ్‌ శాఖ అధికారులు


ఇసుక బంగారంతో సమానమైంది. ప్రస్తుతం దానికి ఉన్న డిమాండ్‌ అలాంటిది. ఇసుక అక్రమ వ్యాపారం అనతికాలంలోనే లక్షలు కూడబెడుతోంది. కాస్త పలుకుబడి, అధికారులతో మచ్చిక ఉంటే చాలు వాగుల్లో ఇసుకను నిర్భయంగా తోడుకోవచ్చు, ఎంత దూరమైన తరలించి అమ్ముకోవచ్చు.! దర్శి మండలంలో అధికారిక రీచ్‌ ఒక్కటంటే ఒక్కటీ లేదు. కానీ ముసి వాగునుంచి అధికార పార్టీ నేతలు అక్రమంగా ఇసుక తోడి విక్రయిస్తున్నారు. రీచ్‌లు ఉన్న ప్రాంతాల్లో కూడా నామమాత్రంగా కొన్ని అనుమతులు తీసుకొని అనేక రెట్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.


దర్శి, మే 26 : మండలంలోని ముసి నది పరివాహక ప్రాంతం లో అధికారికంగా ఇ సుక రీచ్‌ ఒక్కటీ లేదు. అయినప్పటికీ ఎర్రఓబనపల్లి, ఉయ్యాలవాడ, కృష్ణాపురం తదితర గ్రామాల సమీపంలోని ముసినది నుంచి ఇసుకను ట్రాక్టర్లతో కొందరు అక్రమార్కులు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చందలూరు వాగు నుంచీ నిత్యం తోడుతూనే ఉన్నారు. ఇక్కడ్నుంచి రెండు మూడు మండలాల కు ప్రతినిత్యం సరఫరా చేస్తున్నా రు. ఇక ముండ్లమూరు మండలం చిలకలేరు వాగు పరిధిలోని కొన్ని చోట్ల మాత్రమే అధికారిక ఇసుక రీచ్‌లున్నాయి.


వాటి నుంచీ జోరుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. రీచ్‌లు ఉన్న చోట కూడా ఒక లారీ ఇసుకకు మాత్రమే అనుమతి తీసుకొని అదే పర్మిషన్‌తో అనేక ట్రిప్పులు అక్రమంగా తరలిస్తున్నారు. రీచ్‌ యజమానులు, వ్యాపారులతోపాటు అధికారులు కుమ్మక్కై దందా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇసుక లారీలు పట్టుబడినప్పటికీ అధికారీ పార్టీ నేతల ఒత్తిడి మేరకు వదిలేస్తున్నారు. తప్పనిసరైతే జరిమానాలు వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా నిరంతరం ఇసుక తరలి వెళ్తున్నప్పటికీ మైనింగ్‌ శాఖ అధికారులు, పోలీసులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మొక్కుబడిగా కేసుల నమోదు, జరిమానాలు విధించి పంపుతున్నారు.  ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక అందిస్తున్నామని ప్రకటిస్తున్నా రీచ్‌ల వద్ద అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇసుక దందాను అరికట్టకపోతే వాగుల స్వరూపమే మారిపోయే ప్రమాదముంది.



Updated Date - 2020-05-27T10:03:43+05:30 IST