Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆంధ్రా వ్యక్తిని ప్రేమించి.. పెళ్లి కోసం దేశాలు దాటి ఏపీకి వచ్చింది.. కానీ ఇంతలోనే చేదు వార్త.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఇథియోపియాలోని అత్యంత పేద కుటుంబంలో ఆమె పుట్టింది. పెరిగి పెద్దయ్యాక ఉద్యోగం కోసం దుబాయికి చేరకుంది. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా గడపసాగింది. అదే సమయంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాతే ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకుందామని ఎన్నో కలలు కని భారత్‌కు చేరుకోగా.. అనుకోని విధంగా తాను ప్రేమించిన వ్యక్తి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో షాక్‌కు గురైన ఆమె.. కొన్ని నెలలుగా భారత్‌లోనే నివశిస్తోంది. అయితే ఎట్టకేలకు ఆమె తన సొంత దేశానికి పయనమైంది.

వివరాల్లోకి వెళితే.. ఇథియోపియా దేశస్థురాలైన 33 ఏళ్ల యెమెనెబిర్హన్ అత్సెడె సెతెయె దుబయ్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేది. అయితే అక్కడే ఆమెకు కడప జిల్లాకు చెందిన కామిశెట్టి రమణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2015 అక్టోబర్‌లో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను భారత్‌ తీసుకొచ్చాడు. ఇక్కడ ఓ అద్దె ఇంట్లో ఆమెను ఉంచి.. మరిన్ని డబ్బులు సంపాదించేందుకు రమణ తిరిగి కువైత్ వెళ్లిపోయాడు.

రమణ త్వరగా తిరిగి వస్తాడని, ఆనందంగా జీవించవచ్చని అనుకున్న సెతెయె.. అతడి కోసం ఎదురు చూడసాగింది. అయితే ఒక్కసారిగా ఆమె పిడుగులాంటి వార్త తెలిసింది. కువైత్‌ వెళ్లిన రమణ అక్కడే చనిపోయాడనే వార్త ఆమెకు అందింది. దీంతో ఆమె కలలు కల్లలైపోయాయి. ఒక్కసారిగా కాళ్ల కింది నేల ముక్కలైనట్లనిపించింది. 2020 మార్చి 6న అతడి శరీరాన్ని భారత్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు కుటుంబ సభ్యులు.

ఈ షాక్‌తో సెతెయెకు తన భవిష్యత్ అంతా అంధకారంగా కనిపించింది. దీనికి తోడు వీసా గడువు కూడా పూర్తి కావస్తుండడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ క్రమంలోనే తనకంటూ భారత్‌లో ఎవరూ లేకపోవడంతో తిరిగి తన దేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కడప స్పెషల్ బ్రాంచ్‌ పోలీస్‌ విభాగమైన ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌(ఎఫ్ఆర్‌వో)కు అనేకసార్లు తన గోడు వెళ్లబోసుకుంటూ దరఖాస్తులు పంపించింది. తనను ఎలాగైనా తన దేశానికి పంపించాలని వేడుకుంది. అలాంటి సమయంలోనే ఆమెను కోవిడ్ మహమ్మారి కూడా పట్టి పీడించింది. అయితే ఎట్టకేలకు ఆమెను ఇథియోపియా పంపించేందుకు అనుమతులు లభించాయి. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్(ఈటీడీ)ని భారత విదేశాంగ శాఖ అందజేసింది. దీంతో ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి తన దేశానికి బయలుదేరింది. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement