చరిత్రను కూడా చెరపడితే!

ABN , First Publish Date - 2022-01-27T06:03:56+05:30 IST

చూశారా, దేశం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ ఇచ్చింది కానీ, కాంగ్రెస్ వారికి మాత్రం ఆయన పనికిరాకుండా పోయాడు-.. అని గులాం నబీ ఆజాద్ గురించి కపిల్ సిబల్ నిష్ఠూరంగా అన్నారు...

చరిత్రను కూడా చెరపడితే!

చూశారా, దేశం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ ఇచ్చింది కానీ, కాంగ్రెస్ వారికి మాత్రం ఆయన పనికిరాకుండా పోయాడు-.. అని గులాం నబీ ఆజాద్ గురించి కపిల్ సిబల్ నిష్ఠూరంగా అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడికి ఉన్నత పౌరపురస్కారం ఇవ్వడంలో కేంద్ర అధికారపార్టీ ఇష్టాఇష్టాలు ఉండవు అనుకునేంత నిష్పక్షపాత వాతావరణం దేశంలో లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికో, కశ్మీర్‌లో మున్ముందు జరిగే పరిణామాలకు అనువుగా పనికివస్తాడన్న ఆలోచనతోనో కేంద్రం ఈ పురస్కారం ఇచ్చి ఉండవచ్చు. అలాగని, గులాం నబీ ఆజాద్ అర్హతల గురించి పెద్ద చర్చ అక్కరలేదు. రాజకీయరంగం నుంచి పద్మపురస్కారాలు అందుకునేవారికి ఆజాద్ కంటె మించిన యోగ్యతలు ఉండడం అరుదుగానే చూస్తాము. ఒక సంక్షుభిత రాష్ట్రం నుంచి వచ్చి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో విజయవంతంగా కొనసాగగలగడం చిన్న విషయమేమీ కాదు. 


ఘోరమైన ఓటమి పొందిన కాంగ్రెస్‌ను ఎంత హేళన చేస్తూ వచ్చినా, ఆ పక్షానికి చెందిన ప్రతిష్ఠాత్మక వ్యక్తులను తటస్థం చేయడానికి ఏడేళ్ల నుంచి బిజెపి ప్రయత్నిస్తూనే ఉన్నది. రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తరువాత, ప్రణబ్ ముఖర్జీని ప్రభావితం చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అటువంటి నాయకులకు సమకూరిన ఒకరకమయిన ప్రతిష్ఠ నుంచి ఆమోదం లభించినా చాలు. ఆర్‌ఎస్‌ఎస్ వేదిక మీద, ఆయన తన సొంత భావాలు కొన్ని చెప్పుకున్నా, ఆతిథ్యమిచ్చినవారిని మెప్పించే మాటలు కూడా మాట్లాడవలసి వచ్చింది కదా! ప్రణబ్‌తో పోలిక కాదు కానీ, గులాం నబీ ఆజాద్‌ను ఈ మధ్య గౌరవించడం పెరిగింది. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నించిన బృందంలో ఉండడమే కాక, ఆయన కశ్మీర్‌కు చెంది ఉండడం కూడా అందుకు కారణం. జమ్మూకశ్మీర్ విషయంలో భారతీయ జనతాపార్టీకి ఏవో ఆలోచనలున్నాయి కానీ, అవి అనుకున్న తీరులో ముందుకు వెళ్లకపోతే, ఒక మృదువాద నాయకుడు అవసరమవుతాడు. రెండేళ్లుగా కశ్మీర్ విషయంలో జరుగుతున్న నిర్ణయాలను కానీ, అక్కడి పరిణామాలను కానీ ఆజాద్ పెద్దగా విమర్శించినవాడు కాదు. కాంగ్రెస్‌లో ఉండడం మాత్రమే అందుకు కారణం కాదు. షేక్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల తరువాత అక్కడి ఎన్నికల రాజకీయాలలో కొత్త ముఖం కావాలి.


ఫిరాయింపులను సూత్రరీత్యా వ్యతిరేకించే పార్టీలలో బిజెపి కూడా ఒకప్పుడు ఉండేది. చాలా అరుదుగా మాత్రమే ఇతర పార్టీల నుంచి వలసలు అనుమతించేవారు. వాజపేయి-, అద్వానీ హయాం ముగిసిన తరువాత, ఆ విషయంలో పట్టువిడుపులు మొదలై, విడుపులు మాత్రమే కొనసాగుతున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్ వంటి రాష్ట్రాలలో రాజకీయ క్రీడలలో ఉచ్చనీచాలు లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహించారు. అన్ని చోట్లా ‘డబల్ ఇంజన్’ మోటర్లు నడపాలని ఆ పార్టీ ఉత్సాహపడడంలో తప్పేమీ లేదు. రాజకీయాలలో ఉండి, ఇంత ప్రయాసపడేది అధికారం కోసమే, అధికారంలోకి వచ్చాక కావలసింది పరమాధికారమే కదా? పైగా సైద్ధాంతిక ఆవేశాలు బలంగా ఉన్న పక్షాలు, తమ వ్యక్తిగత విజయాల కంటె, తాము కోరుకున్న భావవాతావరణం అంతటా వ్యాపించాలని కోరుకుంటారు. తిరుగులేని అధికారానికి ఆ వాతావరణమే పునాది.


కాంగ్రెస్‌పై యుద్ధంలో వర్తమానంలో పైచేయి అయ్యాక, దేశస్మృతిలో ఇంకా సజీవంగా ఉన్న గతకాలపు కాంగ్రెస్‌పై కూడా యుద్ధం తప్పడం లేదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఒక్కటనే కాదు, నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీ హయాంలలోని కాంగ్రెస్ మాత్రమే కాదు, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాలం నుంచి, ఇంకా వీలయితే అంతకు పూర్వం నుంచి ఓడించవలసిన వారిని ఓడించి, తన ప్రతినిధులను చరిత్రలో స్థాపించడం ఇప్పుడు అవసరమయింది. అందుకోసమే, కాలయంత్రంలోకి వెనుకకు ప్రయాణించి, కొందరు గతవ్యక్తుల ప్రతిష్ఠను కూల్చివేసి, మరికొందరిని తమ వైపు ఫిరాయించుకునే విపరీత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.


అధికారంలోకి రాగానే సర్దార్ పటేల్‌ని, ఆ తరువాత రెండేళ్లకు అంబేడ్కర్‌ని, మధ్యలో గాంధీజీని బిజెపి తమ శిబిరంలోకి రప్పించుకునే ప్రయత్నం చేసింది. జాతీయోద్యమ కాలం నుంచి తాను వ్యతిరేకించవలసింది గాంధీ, నెహ్రూ సంబంధిత రాజకీయాలను కాబట్టి, వారికి ఎడంగా ఉన్న వారిని, లేదా కాంగ్రెస్ చరిత్రరచనలో తగిన ప్రాధాన్యం లభించని వారిని తన వైపునకు తిప్పుకోవాలి. తద్వారా తాను స్థాపించాలనుకుంటున్న నూతన చారిత్రక కథనానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఆయా వ్యక్తులు నిజంగానే బిజెపికి గానీ, దాని సైద్ధాంతిక ధోరణికి గానీ ప్రతినిధులయితే, ఇప్పుడు ప్రత్యేకంగా పనిగట్టుకుని వారిని ఆదరించనక్కరలేదు. ఇప్పుడింత ప్రయత్నం చేస్తున్నారంటేనే అర్థం, అత్యవసరంగా తమకంటూ మహా నాయకుల పరంపర ఒకటి కావాలి. వారికి తమ భావాలతో ఏకీభావం లేకపోయినా పరవాలేదు. తాను నాస్తికుడినని, సోషలిస్టు భావాలతో ప్రేరితుడనని స్వయంగా చెప్పుకున్నప్పటికీ, భగత్ సింగ్‌ను ఎప్పటినుంచో తమవాడిగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన సర్దార్ పటేల్ గానీ, మనువాదాన్ని, కులవ్యవస్థను వ్యతిరేకించిన బాబాసాహెబ్ గానీ, మతసామరస్యాన్ని కోరి అందుకే ప్రాణాలిచ్చిన గాంధీజీ కానీ బిజెపి పాఠ్యప్రణాళికలో ఇమిడే వారు కాదు. అందుకే, తమ తీవ్రజాతీయవాద అజెండాకు అనువుగా ఉండేవో, లేదా పెద్దగా ఘర్షణలేనివో కొన్ని పార్శ్వాలను తీసుకుని ఆ నాయకులను వాటికి ప్రతినిధులుగా గుర్తించడం చేశారు. సంస్థానాల విలీనం కోసం పటేల్‌ను, ఇస్లామ్‌లోకో క్రైస్తవంలోకో కాక, భారతీయ మతమైన బౌద్ధంలోకి మతమార్పిడిని ప్రోత్సహించినందుకు అంబేడ్కర్‌ను కీర్తించడం కుదిరింది. గాంధీతో ఏకీభావానికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ఒక్కటి పనికివచ్చింది. ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ, నెహ్రూ వర్గం కాక, మరో పోరాటం నడిపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను వేదిక మీదకు తెచ్చారు. 


ఎవరో వేదిక మీదకు తేవడానికి, బోస్ తెరమరుగై లేరు. నేతాజీకి జనంలో ప్రత్యేకమైన ఆదరణ ఉన్నది. ఆయన ఎంచుకున్న మార్గానికి సం బంధించిన ప్రత్యేకమైన ఇబ్బందుల వల్ల అధికారికంగా ఆయనకు పూర్తి గుర్తింపు లభించి ఉండకపోవచ్చును కానీ, భారతీయ సమాజం ఆయన ధైర్య సాహసాలను, త్యాగాన్నీ ప్రత్యేకంగా స్మరించుకుంటూనే ఉన్నది. నేతాజీ ఆనాడు ఎంచుకుని ఉన్న మార్గం సరి అయినదని ప్రస్తుత కేంద్రప్రభుత్వం భావిస్తున్నదా? లేక, వ్యక్తిత్వాన్ని, త్యాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నదా? ఇంతకాలం ఆధునిక జాతీయోద్యమ చరిత్రను నెహ్రూకోవలోనే రాశారని ఫిర్యాదు చేసే ముందు, ఆజాద్ హింద్ ఉద్యమాన్ని, ఐఎన్ఏ ఏర్పాటును, పోరాటాన్ని నేటి కేంద్రప్రభుత్వం ఆమోదిస్తున్నదో లేదో అధికారికంగా చెబుతారా? భారతప్రభుత్వం నేతాజీపై ఒక చారిత్రక అంచనాను ఇవ్వాలన్న ప్రశ్న పెద్దది. మతతత్వం మీద, స్వాతంత్ర్యానంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలన్న అంశం మీద నేతాజీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారా? హిందూ మతతత్వానికి, ముస్లిమ్ మతతత్వానికి ఏ తేడా లేదని, కులమతభేదాలకు ఆస్కారం లేని అభివృద్ధి కావాలని చెప్పిన బోస్ ఆదర్శాలను సెంట్రల్ విస్టా ఎదురుగా ప్రతిధ్వనింపజేస్తారా?


దేశభక్తులలో విశిష్టుడని బోస్‌ను గాంధీ కీర్తించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటె ప్రమాదకరమైన జపాన్, జర్మనీ సాయం తీసుకుని స్వాతంత్ర్యం సాధిస్తానని అంత తెలివితక్కువగా ఎట్లా భ్రమించాడు-, అని కూడా గాంధీయే బాధపడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలలో బోస్‌కు, నెహ్రూకు కొంత స్పర్థ ఉండినది కానీ, ఇద్దరి ఆర్థిక, సామాజిక అభిప్రాయాలూ దాదాపుగా ఒకే కోవలోనివి. భారత జాతీయోద్యమ చరిత్ర నుంచి బోస్‌ను వేరుచేసి, సాధించగలిగేది ఏముంది? కాంగ్రెస్ నాయకత్వంలోని జాతీయోద్యమం వల్ల కాక, బోస్ నాయకత్వం వహించిన ఐఎన్ఎ పోరాటం వల్లనే బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చినట్టు ఒక ప్రచారం మొదలుపెట్టారు. 1945లో బోస్ మరణం, జపాన్ పరాజయంతోనే ముగిసిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ను చూసి భయపడి 1947లో స్వాతంత్ర్యం ఎందుకు ఇస్తారు? 1947లో అధికారమార్పిడి జరగడానికి అనేక అంతర్జాతీయ కారణాలతో పాటు, భారత జాతీయోద్యమం ఉన్నత దశకు చేరుకోవడం కూడా ఒక కారణం.


గాంధీ, నెహ్రూ, బోస్.. వీరంతా ఏ మినహాయింపు లేకుండా ఆమోదం పొందవలసినవారేమీ కాదు. వారు ప్రజాజీవితంలో ఉండి, తాము గుర్తించిన ఆదర్శాలు, విశ్వాసాల ప్రకారం పనిచేసినవారు. సావర్కర్‌లు, గోల్వాల్కర్‌లు కూడా అంతే. కాకపోతే, ఎవరు ఏమిటో వారిని వారిగానే గుర్తించాలి. జాతీయోద్యమంలోని ప్రధానమైన శ్రేణిని విమర్శించిన విప్లవకారులు ఉన్నారు. జాతీయోద్యమనాయకత్వం తరచు కనబరచిన పరిమితులను, లొంగుబాటు ధోరణిని సమకాలంలోనే ఎందరో విమర్శించారు. కానీ మొత్తంగా భారత జాతీయోద్యమం కొన్ని ప్రజాస్వామిక, లౌకిక, సమానతా విలువలను సమకూర్చుకున్నది. అంబేడ్కర్‌, గాంధీ తదితరులందరూ ఈ విలువల సంపుటికి దోహదం చేసినవారే. ఆ విలువలకు ప్రమాదం ఏర్పడిన సందర్భం ఇది. వర్తమానంలోనే కాదు, చరిత్రలోనూ చెడుతో తలపడవలసిన సమయం.


ఒకప్పుడు చరిత్రకు సంబంధించిన అంశాలలో ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే, చాలా కష్టమయ్యేది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ విస్తరించిన తరువాత, చారిత్రక అబద్ధాలను అత్యంత సులువుగా ప్రచారం చేయడం సాధ్యపడుతోంది. సత్యానంతర కాలంలో నమ్మకాలే సత్యాలు కాబట్టి, తమ విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నవి, తమను ప్రేరేపించగలిగినవి మాత్రమే వాస్తవాలని జనాన్ని నమ్మించడం కుదురుతుంది. హరప్పా మొహంజొదారో సంస్కృతి ఆర్యులదేనని, బయటి నుంచి ఎవరూ రాలేదని ఖరగ్‌పూర్ ఐఐటి అధికారిక క్యాలెండర్ చెబుతోంది. జాతీయోద్యమకాలం నుంచి కాదు, సింధు నాగరికత కాలం నుంచి చరిత్రను దారిమళ్లిస్తున్నారు. చరిత్ర చదువుకోవాలి లేకపోతే, అబద్ధాల వెల్లువను తట్టుకోలేము. చరిత్రను పునర్ దర్శించడం అంటే, మరింతగా మానవ చర్యలలోని క్రమాన్ని, ఘర్షణలని, విజయాలను అర్థం చేసుకోవడం, మన పూర్వీకులను మనం గుర్తించడం.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-01-27T06:03:56+05:30 IST