ధిక్కరించేవారిని శిక్షించే అధికారం తొలగింపు అసాధ్యం : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-09-29T21:00:01+05:30 IST

తమ ఆదేశాలను ధిక్కరించేవారిని శిక్షించే అధికారం న్యాయస్థానాలకు

ధిక్కరించేవారిని శిక్షించే అధికారం తొలగింపు అసాధ్యం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : తమ ఆదేశాలను ధిక్కరించేవారిని శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉందని, చట్టం చేయడం ద్వారా అయినా ఈ అధికారాన్ని తొలగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం అధికార పరిధిని పదే పదే దుర్వినియోగపరుస్తున్న ఓ ఎన్‌జీవో చైర్‌పర్సన్ కోర్టు ధిక్కార చర్యలపై విచారణ సందర్భంగా బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 


సూరజ్ ఇండియా ట్రస్ట్ చైర్మన్ రాజీవ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజీవ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, కోర్టుకు అపకీర్తి తేవడానికి ఆయన చేసే చర్యలు సహించరానివని పేర్కొంది. 


రాజీవ్ అనేక సంవత్సరాలుగా, పదే పదే అల్పమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేస్తూ కోర్టు అధికార పరిధిని దుర్వినియోగపరుస్తున్నారని సుప్రీంకోర్టు అంతకుముందు పేర్కొంది. ఆయనకు రూ.25 లక్షలు జరిమానా విధించింది. ఈ సొమ్మును ఆయన జమ చేయకపోవడంతో కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. 


తనకు విధించిన జరిమానాను చెల్లించేందుకు తన వద్ద సొమ్ము లేదని, తాను రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతానని రాజీవ్ కోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, జరిమానాలను రాబట్టే విషయంలో రాష్ట్రపతి సమక్షంలో క్షమాభిక్ష దరఖాస్తు చేయడానికి వీలు కల్పించే నిబంధన ఏదీ లేదని తెలిపింది. ఆయనకు విధించిన రూ.25 లక్షల జరిమానాను భూమి రెవిన్యూ బాకీలను రాబట్టే పద్ధతిలో రాబట్టాలని ఆదేశించింది. 


రాజీవ్ తన దారిన తాను ప్రవర్తిస్తున్నారని, కోర్టు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, రాష్ట్ర ప్రభుత్వాలపై బురద జల్లుతున్నారని పేర్కొంది. తాము వెనుకకు తగ్గేది లేదని, దీనిని ఓ తార్కిక ముగింపునకు తీసుకెళ్తామని తెలిపింది. ఆయన క్షమాపణ చెప్పడంలో నిజాయితీ లేదని తెలిపింది. కేవలం పర్యవసానాల నుంచి బయటపడటానికి మాత్రమే ఆయన ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. మరోవైపు మరికొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారని తెలిపింది. ఇదంతా ఓ ప్రహసనంగా ఉందని పేర్కొంది. ఆయన ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని వ్యాఖ్యానించింది. ఆయనకు మరొక అవకాశం ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది. 


రాజీవ్ అనేక సంవత్సరాలుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేస్తున్నారు. మొత్తం మీద 64 పిల్స్ వేసినప్పటికీ, కనీసం ఒకదానిలోనైనా విజయం సాధించలేదు. పదే పదే తన అధికార పరిధిని దుర్వినియోగపరుస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రూ.25 లక్షలు జరిమానా విధిస్తూ 2017 మే 1న ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ఉపసంహరించాలని రాజీవ్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 


Updated Date - 2021-09-29T21:00:01+05:30 IST